Harish Rao: గురుకులాలకు నిత్యవసరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం అన్యాయమని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao)మండిపడ్డారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్ పెడితే, గురుకులకు ఆహార పదార్థాలు ఎలా సప్లై చేస్తారు? పిల్లలకు నాణ్యమైన భోజన ఎలా అందిస్తారు? అని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్ లో కాంట్రాక్టర్లు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు (Harish Rao) మాట్లాడుతూ కల్తీ ఆహారంతో గురుకుల విద్యార్థులు ఆసుపత్రుల పాలై ప్రాణాలు వదులుతుంటే..ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం శోచనీయం అన్నారు.
6 నెలలుగా ఉన్న పెండింగ్ బిల్లులు
గురుకుల విద్యార్థులు పస్తులు ఉండకూడదన్న బాధ్యతతో కాంట్రాక్టర్లు అప్పులు తీసుకొచ్చి మరీ భోజనాలు పెడుతున్నారన్నారు. ఆ అప్పులు క్రమంగా పెరిగి, వారితో పాటు వారి కుటుంబ సభ్యులు ఆర్థిక భారంతో సతమతమవుతున్నాయని పేర్కొన్నారు. సుమారు 5000 మంది సరఫరాదారులకు బతుకమ్మ, దీపావళి పండగ సంబరం లేకుండా చేయడం దుర్మార్గం అన్నారు. అధికారులను కలిసి బిల్లులు చెల్లించాలని గోడు వెళ్లబోసుకుంటున్నా ఈ ప్రభుత్వానికి కదలిక లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 6 నెలలుగా ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, గురుకుల పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: Janagama: మూడు సీట్లు..! ఆరు నోట్లు..! స్థానిక ఎన్నికలపై బెట్టింగ్‌ల జోరు
రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెషల్ బస్సులు.. మంత్రి పొన్నం ప్రభాకర్
సద్దుల బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకొని సొంతూళ్లకు వెళ్లే వారికి రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రావాణాశాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాలకు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రతి బస్ స్టేషన్ లోనూ ప్రత్యేక అధికారిని నియమించాలని, అక్కడ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెషల్ బస్సులు
ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలతో పాటు ఉన్నతాధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉంటూ.. 97 డిపోలు 340 బస్ స్టేషన్లు సమన్వయం చేసుకొని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఆదేశించారు. దసరా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు మంత్రితెలిపారు. విధుల్లో అలసత్వం వహించొద్దని సూచించారు. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నదని, శనివారం నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.