Ponnam Prabhakar: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రూ.5 కే భోజనాన్ని అందించే అన్నపూర్ణ స్కీమ్ ను ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తున్న జీహెచ్ఎంసీ (GHMC) ఆధ్వర్యంలో రూ.5 కే టిఫిన్ అందుబాటులోకి తెచ్చేందుకు జిహెచ్ఎంసి ఇందిరమ్మ టిఫిన్ క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. సిటీలో ఏర్పాటు చేసిన 60 ఇందిరమ్మ టిఫిన్ క్యాంటీన్లను ఉదయం హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరు చోట్ల ప్రారంభించనున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మోతీ నగర్, మింట్ కాంపౌండ్ లోని క్యాంటీన్ తోపాటు ఇతర నాలుగు చోట్ల మంత్రి ప్రారంభించిన వెంటనే సిటీలోని 60 క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు, కార్మికులు చాలా మంది వివిధ రకాల పనులు చేసుకునేందుకు ఉదయాన్నే బయల్దేరి ఆకలితోనే పనులు మొదలు పెట్టి, మధ్యాహ్నాం తాము తెచ్చుకున్న భోజనం తిని, కడుపు నింపుకుంటున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ వారికి కేవలం రూ.5 కే టిఫిన్ ఇందిరమ్మ టిఫిన్ స్టాళ్లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మహానగరంలో రోజురోజుకి షుగర్ పేషెంట్లు పెరిగిపోతున్నందున ఏకంగా షుగర్ లెస్, పౌష్టికమైన టిఫిన్స్ అందించేందుకు బల్దియా సిద్దమైంది.
Also Read: Assembly Restrictions: సోమవారం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు.. ఎందుకంటే?
రోజుకో వెరైటీ టిఫిన్స్ అందించాలని భావిస్తుంది. వారంలో సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులకు ఆరు రకాల పౌష్టికమైన టిఫిన్స్ అందించేందుకు జీహెచ్ఎంసీ మెనూను కూడా ఖరారు చేసింది. తొలి దశగా రూ.11.43 కోట్ల వ్యయంతో సిటీలో 130 స్టాళ్లను ఏర్పాటు చే్యాలని భావించినా, ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ 60 స్టాళ్లను ప్రారంభానికి సిద్దం చేసింది. ప్రతి టిఫిన్ స్టాల్ లో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు కఠినంగా పాటిస్తూ, పేదలకు పౌష్టికాహారం అందించడమే ధ్యేయంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ ఒక వరంలా మారనుందని, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు టిఫిన్స్ స్కీమ్ కీలక పరిణామం కానున్నట్లు జీహెచ్ఎంసీ భావిస్తుంది.
ఖర్చులో ఎక్కువ శాతం భరించనున్న బల్దియా
ప్రస్తుతం హరే రామ హరే కృష్ణ మూవ్ మెంట్ తో కలిసి రూ.5 కే నాణ్యమైన, పౌష్టికమైన భోజనాన్ని అందిస్తున్న జీహెచ్ఎంసీ రూ.5 కే టిఫిన్స్ అందించేలా మరోసారి హరే రామా హరే కృష్ణ మూవ్ మెంట్ తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అయితే పూర్తిగా మిల్లెట్స్ తో తయారు చేయనున్న ఈ ఒక్కో టిఫిన్ కు రూ 19 ఖర్చవుతుండగా, ఇందులో రూ. 5 ప్రజల నుంచి వసూలు చేస్తుండగా, మిగిలిన రూ. 14 ను జీహెచ్ఎంసీ భరించనుంది. ఈ స్కీమ్ ను ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా జీహెచ్ఎంసీ మిల్లెట్స్ తో తయారు చేసే టిఫిన్ల మెనూను సిద్దం చేసింది.
వీక్లీ టిఫిన్ మెనూ
సోమవారం మిల్లెట్ ఇడ్లీ (3), సాంబార్, చట్నీ/పొడి
మంగళవారం మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్స్ చట్నీ
బుధవారం పొంగల్, సాంబార్, చట్నీ
గురువారం ఇడ్లీ (3), సాంబార్, చట్నీ
శుక్రవారం పొంగల్, సాంబార్, చట్నీ
శనివారం పూరీ (3), ఆలూ కూర్మా
Also Read: Future City: ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన.. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు