Balmoor Venkat: హుజూరాబాద్ పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ (Balmoor Venkat) స్పష్టం చేశారు. రజక సంఘం ఆహ్వానం మేరకు పట్టణంలో నిర్వహించిన ధీర వనిత, పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు పోక తప్పదు: అవినీతిపై విచారణ తప్పదు
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక సంక్షేమ పథకాల్లో భారీగా అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా దళిత బంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం విచారణ చేపడుతుందని, తదనంతరం బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా, ఈ మధ్య కాలంలో చర్చనీయాంశమైన కార్ రేసుల్లోనూ అవకతవకలు జరిగాయని ఆధారాలున్నాయని పేర్కొంటూ, మాజీ మంత్రి కేటిఆర్ జైలుకు పోక తప్పదని వెంకట్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
Also Read: Fan Emotional Video: దేవుడి కోసం సాధించండి.. స్టేడియంలో పాక్ ఫ్యాన్ ఎమోషనల్.. భారత్‌పై ఇంత కసి ఉందా?
పార్టీలకతీతంగా అభివృద్ధి నిధులు: కౌశిక్ రెడ్డి విమర్శలకు కౌంటర్
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే, కాంగ్రెస్ పార్టీ నాయకుల అభ్యర్థన మేరకు, ప్రభుత్వం పార్టీలకతీతంగా నిధులను మంజూరు చేసిందని ఎమ్మెల్సీ వెంకట్ తెలిపారు. తాను పోరాడి నిధులు తీసుకువచ్చానని ఇక్కడి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి నివేదించి, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలి గానీ, అనవసరమైన అబద్ధాలు చెబితే ప్రజలు తిరగబడి కొట్టే రోజు వస్తుందని ఆయన కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు.
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్సీ వెంకట్ హామీ ఇచ్చారు. పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, టికెట్ విషయంలో ఎవరికైనా ఆశాభావం ఉండవచ్చని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి తాను అంకితమవుతానని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబుకు ఇది తెలియదు అనుకుంటా.. ‘ఓజీ’ గురించి మళ్లీ..