Jagapathi Babu: సాహితీ ఇన్ ఫ్రా కేసులో టాలీవుడ్ నటుడు జగపతి బాబు (Tollywood Actor Jagapathi Babu) గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన జగపతి బాబును అధికారులు దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించి వివరాలను సేకరించారు. అపార్ట్ మెంట్లు, విల్లాల నిర్మాణం పేర పలు ప్రాజెక్టులు చేపట్టినట్టు ప్రచారం చేసుకున్న సాహితీ ఇన్ ఫ్రా ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో వందలాది మంది నుంచి భారీ మొత్తాల్లో డబ్బు వసూలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఏ ఒక్కరికీ ఫ్లాట్ గానీ.. విల్లాగానీ అప్పజెప్పలేదు. దాంతో పలువురు బాధితులు మొదట జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసులు హైదరాబాద్ నేర పరిశోధక విభాగానికి (సీసీఎస్) బదిలీ అయ్యాయి.
Also Read- Bigg Boss Telugu 9: ఇది చదరంగం కాదు.. రణరంగం! బిగ్ బాస్ హౌస్‌లోకి న్యూ సెలబ్రిటీస్!
800 కోట్ల రూపాయలకు మోసం
సీసీఎస్ జరిపిన విచారణలో సాహితీ ఇన్ ఫ్రా గ్రూప్ ఛైర్మన్ భూదాటి లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ పూర్ణచందర్ రావుతోపాటు మరికొందరు కలిసి జనాన్ని దాదాపు 800 కోట్ల రూపాయలకు మోసం చేసినట్టుగా వెల్లడైంది. ప్రీ లాంచ్ పేరిట జనం నుంచి వసూలు చేసిన డబ్బును భూదాటి లక్ష్మీనారాయణ, ఇతర నిందితులు షెల్ కంపెనీలకు మళ్లించినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత సొంతానికి వాడుకున్నట్టుగా తేలింది. ఒక్క పూర్ణచందర్ రావు రూ. 126 కోట్లను జనం నుంచి వసూలు చేసి తన పేరున, తన కుటుంబ సభ్యుల పేరున భారీగా ఆస్తులు కొన్నట్టుగా వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంలో నిందితులు మనీ లాండరింగ్‌కు కూడా పాల్పడినట్టుగా ఆరోపణలు వచ్చాయి. దాంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.
Also Read- OG Producer: నిర్మాత నాగవంశీకి థ్యాంక్స్ చెప్పిన ‘ఓజీ’ నిర్మాత.. ఎందుకో తెలుసా?
జగపతి బాబుని అడిగిన ప్రశ్నలివే..
విచారణలో సాహితీ ఇన్ ఫ్రా గ్రూప్ ప్రీ లాంచ్ ఆఫర్ల పేర.. 800 వందల కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడినట్టుగా గుర్తించారు. కాగా, సాహితీ ఇన్ ఫ్రా గ్రూప్ కోసం గతంలో సినీ నటుడు జగపతి బాబు పలు ప్రకటనల్లో నటించారు. ప్రీ లాంచ్ ఆఫర్ల అడ్వర్టైజ్మెంట్స్లో కూడా కనిపించారు. ఇక, ఈడీ విచారణలో సాహితీ ఇన్ ఫ్రా గ్రూప్ ఛైర్మన్ భూదాటి లక్ష్మీనారాయణ బ్యాంక్ అకౌంట్ నుంచి జగపతి బాబు ఖాతాలకు కోట్ల రూపాయల బదిలీ జరిగినట్టుగా కూడా వెల్లడైంది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు గురువారం జగపతి బాబును కార్యాలయానికి పిలిపించుకుని విచారణ జరిపారు. సాహితీ ఇన్ ఫ్రా తరపున అడ్వర్టైజ్మెంట్స్లో నటించడానికి చేసుకున్న అగ్రిమెంట్లు, రెమ్యునరేషన్‌గా తీసుకున్న డబ్బు ఎంత? అనే అంశాలపై జగపతి బాబును ప్రశ్నించారు. ఈ క్రమంలో జగపతి బాబు అకౌంట్లకు సంబంధించిన వివరాలను కూడా తీసుకున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు