OG Producer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా, సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రూపొందిన ‘ఓజీ’ (OG Movie) సినిమా ఈ రోజు (సెప్టెంబర్ 25, 2025) విడుదలై, ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత డీవీవీ దానయ్య, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత నాగవంశీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘ఓజీ’ సక్సెస్‌ను పురస్కరించుకుని చిత్రయూనిట్ గురువారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డీవీవీ దానయ్యతో పాటు సంగీత దర్శకుడు థమన్, దర్శకుడు సుజీత్, హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, ఎడిటర్ నవీన్ నూలి, నిర్మాత కళ్యాణ్ దాసరిలతో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత నాగవంశీ కూడా పాల్గొన్నారు.
Also Read- Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య, కామినేని సంభాషణపై స్పందించిన చిరు.. అసలు వాస్తవం ఇదేనట!
‘ఓజీ’ టైటిల్ వారిదే..
‘ఓజీ’ టైటిల్‌ను మొదట నాగవంశీని రిజిస్టర్ చేయించారు. మేము అడగగానే మరో ఆలోచన లేకుండా మాకు ఇచ్చినందుకు ఆయనకు ఈ సభా వేదికగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత డీవీవీ దానయ్య. ‘ఓజీ’ టైటిల్ విషయంలో నాగవంశీ చూపిన ఔదార్యం సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని దానయ్య పేర్కొన్నారు. ఈ టైటిల్ సినిమా కథకు సరిగ్గా సరిపోయిందని, పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రకు పూర్తి న్యాయం చేసిందని అన్నారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘హంగ్రీ చీతా’ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్, 22న విడుదలైన ట్రైలర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇక రిలీజ్‌కు ఒక రోజు ముందే ప్రీమియర్స్ పడటంతో.. సినిమా టాక్, రివ్యూలు బయటకు వచ్చాయి. చాలా వరకు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూసే పడ్డాయి.
Also Read- Prasads Multiplex: మేము బాధ్యత వహించలేము.. ‘ఓజీ’ ఫ్యాన్స్‌కి ప్రసాద్స్ మల్టీప్లెక్స్ రిక్వెస్ట్!
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు థ్యాంక్స్
ఇక ఈ మీడియా సమావేశంలో నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya) మాట్లాడుతూ.. నిజంగా నాకు ఆనందంతో మాటలు రావడంలేదు. నేను మొట్ట మొదటిగా థాంక్స్ చెప్పాల్సింది త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు.. దర్శకుడు సుజీత్ పేరు ఆయనే సూచించారు. త్రివిక్రమ్ లేకపోతే ఈ సినిమా లేదు, నాకు ఇంత పెద్ద విజయం కూడా వచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చే సినిమా అందించాలనే ఉద్దేశంతో.. మొదటి నుంచి ఎంతో శ్రద్ధతో ఈ సినిమా చేశాం. సుజీత్‌తో దాదాపు రెండున్నరేళ్ళకు పైగా ప్రయాణం చేశాను. తను ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. సుజీత్, అతని టీమ్ ఎన్నో రోజులు నిద్ర కూడా మానుకొని ఈ చిత్రం కోసం పని చేశారు. థమన్, నవీన్ నూలి, రవి చంద్రన్.. ఈ ముగ్గురూ ఈ సినిమాకి మూడు పిల్లర్లు. ఎప్పుడు ఫోన్ చేసినా, ‘ఓజీ’ బ్లాక్ బస్టర్ అవుతుందని థమన్ నమ్మకంగా చెప్పేవాడు. ఇప్పుడు అభిమానుల స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్, యాక్షన్ చూసి నాకే మైండ్ పోయింది. థమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. సినిమా విడుదలకు ముందు అభిమానులు ‘ఓజీ ఓజీ’ అంటూ ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. ఇప్పుడు సినిమా విడుదలై, వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేయడంతో చాలా హ్యాపీగా ఉందని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు