Land Encroachment: హైడ్రా ఆపరేషన్ల తర్వాత వెలుగులోకి వస్తున్న భూ కబ్జాల (Land Encroachment) తీరును చూసి ప్రభుత్వం షాక్ కు గురవుతున్నది. వేల కోట్ల భూములు కబ్జాకు గురైన పరిస్థితిపై ప్రభుత్వం అవాక్కైంది. ఇటీవల హైడ్రా గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) లోని కొన్ని ప్రాంతాలపై స్టడీ చేసింది. కబ్జాలపై నివేదిక తయారు చేసింది.ఎవరు చేశారు? కబ్జాకు గురైన భూమి వెనక ఎవరి అండదండలు ఉన్నాయి? అన్యాక్రాంతమైన భూముల విలువ ఎంత? హైడ్రా ఏం చేయబోతుంది? అనే తదితర పూర్తి స్థాయి వివరాలను రిపోర్టు రూపంలో ప్రభుత్వానికి అందజేసింది.
దీన్నిపరిశీలించిన ప్రభుత్వం సీరియస్ గా డ్రైవ్ చేయాలని హైడ్రా (Hydra) ఆఫీసర్లకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. పదేళ్లలో ఈ కబ్జాలు పెరిగిపోయాయని సర్కార్ ఆగ్రహ వ్యక్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో గత కొంత కాలంగా భూ కబ్జాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. అన్యాక్రాంతమైన రూ.వేల కోట్ల విలువైన భూముల్ని కబ్జాకొరల నుంచి విడిపిస్తోంది. అయితే గతంలో హైదరాబాద్ వ్యాప్తంగా జరిగిన ప్రభుత్వ భూముల కబ్జా వెనుక బీఆర్ఎస్ కీలక నేత హస్తం ఉందని హైడ్రా విచారణలో వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయి బీఆర్ ఎస్ నేతల నుంచి కొందరు అగ్రనేతల వరకు ఈ కబ్జాలు వెనక ఉన్నట్లు హైడ్రా పరిశీలనలో తేలినట్లు ఓ ఆఫీసర్ వెల్లడించారు.
Also Read: Money Fraud: కాన్ఫరెన్స్‌లో అమిత్ షా, అజిత్ దోవల్ ఉన్నారంటూ మాట్లాడించి.. బంధువుకు కుచ్చుటోపీ
చెరువులు, ప్రభుత్వ భూములే టార్గెట్..?
హైదరాబాద్‌లోని చెరువులు, ప్రభుత్వ భూములే లక్ష్యంగా కీలక నేత అండదండలతో కొందరు బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయినట్టు స్పష్టమవుతోంది. తాజాగా గాజులరామారం ఉదంతం బీఆర్ఎస్ నేతల భూ దాహానికి నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని సర్వే నంబర్ 307లో రూ.15 వేల కోట్ల విలువచేసే 317 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా కాపాడింది. స్థానిక బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలోనే ఈ కబ్జాలు జరిగినట్టు స్థానిక ప్రజలు చెబుతున్నారు.అంతేకాకుండా రంగారెడ్డి జిల్లా కోహెడ, పోచారం మున్సిపాలిటీ, గచ్చిబౌలి, కూకట్పల్లి పరిధిలోకి అల్విన్ కాలనీ, హైదర్ నగర్, దుండిగల్, హెచ్ఎంటీ కాలనీ, రాజేంద్ర నగర్, మణికొండ లాంటి తదితర ప్రాంతాల్లో భూకబ్జాల వెనుక స్థానిక బీఆర్ఎస్ నేతల పాత్ర ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బతుకమ్మకుంట చెరువు ఆక్రమణల్లో బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి పేరు వినిపించిన విషయం తెలిసిందే. ఇలా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేతలు, వారి అనుయాయులు కబ్జా చేసిన 6 చెరువులును హైడ్రా ఇప్పటికే రక్షించింది. వాటికి పునరుజ్జీవం కల్పించింది. పదేళ్లుగా కబ్జాలపై సీరియస్ యాక్షన్ లేక, మానిటరింగ్ వ్యవస్థ లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని హైడ్రా వెల్లడిస్తున్నది.
రూ.50 వేల కోట్ల విలువైన భూముల పరిరక్షణ:
హైదరాబాద్‌లో కొంత మంది బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన రూ.50 వేల కోట్ల విలువైన 923 ఎకరాల భూముల్ని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుందని అధికారులు చెబుతున్నారు. గతంలో మున్సిపల్, హెచ్ఎండీఏ విభాగాలను పర్యవేక్షించిన మాజీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌లోని భూములను లూటీ చేశారని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ భూ బకాసురులు ప్రభుత్వ భూములను, చెరువు శిఖం భూములను యథేచ్ఛగా మింగేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు 424 ఎకరాల ప్రభుత్వ భూమి, 233 ఎకరాల చెరువులు, 218 ఎకరాల రహదారులు, 15 ఎకరాల నాళాలు, 25 ఎకరాల పార్కు స్థలాలను హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు భూకబ్జాలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతల చిట్టాను ప్రభుత్వానికి హైడ్రా అందించినట్టు తెలుస్తోంది.
పదేళ్లలో చెరువుల విధ్వంసం..సీఎస్ ఆర్ ముసుగు..?
తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2014 నుంచి 2023 మధ్యకాలంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 171 చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఈ కబ్జాల కారణంగా మొత్తం 386.65 ఎకరాల పూర్తిస్థాయి నీటి నిల్వ స్థలం అన్యాక్రాంతమైనట్టు వెల్లడైంది. ఈ భూముల్లో బీఆర్ఎస్ నేతలు వెంచర్లు వేసి సామాన్య ప్రజలకు విక్రయిస్తున్నారని, దీంతో బీఆర్ఎస్ నేతల భూదాహానికి సామాన్య ప్రజలు మూల్యం చేల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందనే చర్చ నడుస్తోంది. ఇక బీఆర్ఎస్ హయాంలో అనేక చెరువులు అన్యాక్రాంతంకాగా, 2023లో కేటీఆర్ సీఎస్ఆర్ కింద చెరువుల అభివృద్ధి అనే కొత్త నాటకానికి తెరలేపారనే విమర్శలు ఉన్నాయి. అప్పటికే కబ్జాలతో కుంచించుకుపోయిన చెరువుల మిగిలిన భాగాలను, అభివృద్ధి పేరుతో కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ సంస్థలకే అప్పగించి, జరిగిన కబ్జాలను చట్టబద్ధం చేసే కుట్రకు పాల్పడ్డారని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంత దోచేశారు?
హైడ్రా కేవలం ఏడాది కాలంలోనే ఒక్క హైదరాబాద్‌లోనే 923 ఎకరాల భూముల్ని ఇప్పటిదాకా కబ్జాకొరల నుంచి విడిపించింది. వీటి విలువ రూ.50 వేల కోట్లు ఉంటే, గత పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్ల ప్రజా సంపద అన్యాక్రాంతం అయ్యిందో అంచనా వేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వ ఆస్తులను రక్షించడంతోపాటు, వరద ముంపులేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, హైడ్రా తీసుకుంటున్న చర్యల పట్ల సిటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం కూడా కబ్జాల కు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందేనని స్ట్రిక్ట్ గా ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భూములను ఎంక్వైయిరీ చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
Also Read: 71st National Awards: జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు గ్రహీతల ఫస్ట్ రియాక్షన్.. ఏంటంటే?