Haris Rauf controversy: ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాక్ పేసర్ హారిస్ రౌఫ్ ఓవరాక్షన్ చేశాడు. అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. భారత్ చేతిలో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయినప్పటికీ, బౌండరీ లైన్ వద్ద భారత అభిమానుల పట్ల రౌఫ్ దురుసుగా (Haris Rauf controversy) ప్రవర్తించాడు. భారతీయ అభిమానులను రెచ్చగొట్టేలా రౌఫ్ హావభావాలు ప్రదర్శించారు. ఆరు భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ కూల్చివేసిందనే అర్థం వచ్చేలా బౌండరీ లైన్ వద్ద సంకేతాలు చూపాడు. ఇండియన్ ఫ్యాన్స్ ‘కోహ్లీ, కోహ్లీ’ అని నినాదాలు చేయగా, రౌఫ్ ‘6-0’ అనే సంకేతాన్ని చూపించాడు. భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్టుగా ఇప్పటివరకు చిన్న ఆధారం కూడా లేదు. అయినప్పటికీ బౌండర్ లైన్ వద్ద రౌఫ్ చేసిన ఈ చిల్లర, ఆకతాయి చర్యపై భారత క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రౌఫ్ భార్య కూడా ఓవరాక్షన్
మ్యాచ్ ముగిసిన తర్వాత, హారిస్ రౌఫ్ భార్య ముజ్నా మసూద్ మాలిక్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. భారత యుద్ధ విమానాలను పాక్ కూల్చివేసిందన్నట్టుగా మైదానంలో రౌఫ్ ఇచ్చిన సంకేతాలను స్క్రీన్‌షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ‘మ్యాచ్ ఓడిపోయాం. కానీ, యుద్ధం గెలిచాం’’ అని టైటిల్ ఇచ్చింది. అయితే, ఇటు భారత్ అభిమానులతో పాటు పాక్‌లో కూడా విమర్శలు వ్యక్తమవడంతో పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఆమె డిలీట్ చేసింది.
ఇదిలావుంచితే, మ్యాచ్ సమయంలో హారిస్ రౌఫ్ భారత యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మతో కూడా మాటల యుద్ధానికి దిగాడు. రౌఫ్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత బౌండరీ కొట్టిన తర్వాత హారిస్ సహనం కోల్పోయాడు. క్రీజులో ఉన్న అభిషేక్ శర్మ, గిల్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే, భారత బ్యాటర్లు ఇద్దరూ కలిసి గట్టి సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
Read Also- BJP: త్వరలోనే స్థానిక ఎన్నికలు… కానీ, బీజేపీలో మాత్రం వింత పరిస్థితి?
మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ, పాకిస్థాన్ బౌలర్లు ఎలాంటి కారణం లేకుండానే భారత బ్యాట్స్‌మెన్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని అన్నాడు. ‘‘ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. వాళ్లు ఏ కారణం లేకుండా మాతో గొడవ పడడానికి ప్రయత్నించారు. నాకు అది అస్సలు నచ్చలేదు. అందుకే నేను వారిపై గొడవకు దిగాను. జట్టు కోసం ఇవ్వాల్సిన ప్రదర్శన ఇస్తానని అనుకున్నా. మేము (గిల్ గురించి) స్కూల్ డేస్ నుంచే కలిసి ఆడుతున్నాం. మేమిద్దరం కలిసి సాధించాలని అనుకున్నాం. ఆ అవకాశం వచ్చింది. నాకు స్ట్రైకింగ్ వచ్చేలా ఆడడం బాగా నచ్చింది. నా ఆట చక్కగా ఉందంటే దానికి జట్టు మద్దతు, విశ్వాసమే కారణం. నేను కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాను’’ అని చెప్పాడు.