OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నుంచి కూడా గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆయన తాజా చిత్రం ‘ఓజీ’ (OG Movie) విడుదలకు ముందే రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి, అలాగే ప్రత్యేక ప్రీమియర్ షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల ధరలను పెంచుకునేలా వెసులుబాటు కల్పించడంతో పాటు, స్పెషల్ ప్రీమియర్ ధరను రూ. 1000గా నిర్ణయించింది. అయితే ఈ ప్రీమియర్ తెల్లవారు జామున ఉదయం 1 గంటకు ప్రదర్శించాలని, రోజుకు 5 ఆటలకు మించకుండా ఉండాలనేలా కండీషన్స్ పెట్టిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణ ప్రభుత్వం అలాంటి షరతులేం పెట్టలేదు. ఒక రోజు ముందే ప్రీమియర్‌కు అనుమతి ఇవ్వడంతో.. ఫ్యాన్స్ తెలంగాణ గవర్నమెంట్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు.
Also Read- Kantara Chapter 1: ‘ఓజీ’ ట్రీట్ అయిన వెంటనే ‘కాంతార 2’ ట్రీట్.. ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఏముందంటే..
ఈ సినిమా సెప్టెంబర్ 25న అధికారికంగా విడుదల కాబోతుండగా, సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షోలకు టికెట్ ధర రూ.800గా నిర్ణయించింది. అంతేకాకుండా, సినిమా విడుదలైన తొలి 10 రోజుల పాటు (సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు) టికెట్ ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.150 పెంచుకోవచ్చని జీవోలో పేర్కొంది. ఈ టికెట్ ధరల పెంపుతో సినిమా వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు చేసిన ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటి సపోర్ట్ అందించింది. ఇక ఏపీలో సింగిల్ స్క్రీన్‌లో రూ. 125, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 150 పెంచుకునేలా ఏపీ గవర్నమెంట్ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.
Also Read- Manchu Lakshmi: ఇంటర్వ్యూ కాదు.. ఆ జర్నలిస్ట్ నాపై దాడి చేశాడు.. మంచు లక్ష్మి ఫిర్యాదు వైరల్!
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు థ్యాంక్స్ చెప్పిన టీమ్
‘ఓజీ’ సినిమా పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించగా, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. ఏపీ ప్రభుత్వానికి చిత్ర నిర్మాతలు ధన్యవాదాలు తెలిపినట్టే.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ ధరల పెంపు నిర్ణయం సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలు తీసుకురానుందనేలా టాక్ నడుస్తుంది. అయితే ఏదైనా సినిమా టాక్‌ని బట్టే ఉంటుందని గమనించాలి. ఇక ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో అభిమానులు కూడా పెరిగిన ధరల గురించి పట్టించుకోకుండా తమ అభిమాన నటుడి సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సంచలనం సృష్టిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు