Engineering Fee Hike: ఇంజినీరింగ్ ఫీజుల పెంపును ఈ విద్యాసంవత్సరం నుంచి నిర్వహించాలా? లేదా? వచ్చే విద్యాసంవత్సరం నుంచి నిర్వహించాలా? అనే అంశంపై త్వరలోనే క్లారిటీరానుంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన కమిటీ పెంపునకే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచే దీన్ని అమలుచేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దాదాపు ఈ నెలాఖరు నాటికి ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. వచ్చే వారంలో కమిటీ సభ్యులు భేటీ అవ్వనున్నారు. ఈ భేటీ అనంతరం నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. సర్కార్ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ విద్యాసంవత్సరం నుంచే ఫీజుల పెంపు జరిగినట్లయితే పేద, మధ్య తరగతి కుటుంబాలపై మరింత ఆర్థిక భారం పడే అవకాశాలున్నాయి.
హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు..
ఇంజినీరింగ్(Engineering)లో ఈ ఏడాది పాత ఫీజులే కొనసాగించాలని జూన్ 30న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇంజినీరింగ్ కాలేజీల్లో గత బ్లాక్ పీరియడ్ ఫీజులే 2025-26కు వర్తిస్తాయంటూ సర్కార్ జారీ చేసిన జీవో(GO) 26ను సవాలు చేస్తూ గురునానక్, గోకరాజు రంగరాజు కాలేజీలతో పాటు సుమారు 11 కళాశాలలు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశాయి. విచారణ జరిపిన న్యాయస్థానం కాలేజీల ఫీజుల నిర్ధారణ కోసం సమర్పించిన ప్రతిపాదనలపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని టీఏఎఫ్ఆర్‌సీకీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ఈనేపథ్యంలో తెలంగాణలో ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల నిర్ణయం కోసం కొత్త పారామీటర్లను సూచించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఇటీవల ఏర్పాటు చేసింది.
Also Read: Kavitha: ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ .. కవిత సంచలన కామెంట్స్
నాణ్యమైన విద్య అందిస్తున్నాయా?
ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసి, సుప్రీంకోర్టు(Supreme Court), హైకోర్టు(High Courts)ల తీర్పులను పరిగణనలోకి తీసుకుని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. టీఏఎఫ్ఆర్సీ(TAFRC) విజ్ఞప్తి, హై కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని వేసింది. కాగా ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఫీజుల నిర్ధారణపై ఉన్న నియమాలను ప్రభుత్వం సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఫీజుల పెంపునకు నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల హాజరు వంటి పలు నిబంధనలను విధించింది. ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఫేషియల్ రికగ్నైజేషన్(Facial recognition) అమలు, ఆధార్(Adhar) ఆధారిత ఫీజుల చెల్లింపులు సహా విద్యార్థులను పరిశోధనలవైపు ప్రోత్సహిస్తున్నారా అనే అంశాల్ని పరిగణలోకి తీసుకోనుంది. కాలేజీలు నాణ్యమైన విద్య అందిస్తున్నాయా? లేదా? ఆ కాలేజిల్లో విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? అనే అంశాలపైనా దృష్టి సారించనుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ వచ్చేవారంలో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఆపై సర్కార్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులను సర్కార్ కోర్టుకు సమర్పించనుంది. ఏ విద్యా సంవత్సరం నుంచి ఫీజులు అమలుచేయాలనేది కోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉండనుంది.
Also Read: Singareni Employees: గుడ్ న్యూస్.. సింగరేణి ఉద్యోగులకు ప్రమోషన్లు!