Rail Ticket Booking: యూటీఎస్ మొబైల్ యాప్‌తో టిక్కెట్ల బుకింగ్
జనరల్ టికెట్ల కోసం ఏర్పాటు
పండుగల దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి
రైలు వినియోగదారులను ప్రోత్సహిస్తున్న దక్షిణ మధ్య రైల్వే
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రైల్వే స్టేషన్ ఆవరణలో ఎంపిక చేసిన వ్యక్తులు ధరించిన జాకెట్ల వెనుక భాగంలో ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను ‘యూటీఎస్’ యాప్‌తో స్కాన్ చేసి జనరల్ టికెట్లు (Rail Ticket Booking) కొనుగోలు చేసే విధానాన్ని ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. టిక్కెట్లను సౌకర్యవంతంగా కొనుగోలు చేసేందుకు యూటీఎస్ మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది. ఆధునిక టికెటింగ్ వ్యవస్థలో యూటీఎస్ యాప్ ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. రైల్వేలలో ప్రయాణించే అన్‌రిజర్వ్డ్ ప్రయాణికులకు వరంగా మారింది. యూటీఎస్ మొబైల్ యాప్‌తో అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ల అమ్మకాన్ని ప్రోత్సహించవచ్చు. అంతేకాదు, మొబైల్ యాప్ గురించి రైల్వే ప్యాసింజర్లకు మరింత చేరువ చేసేందుకు జోన్ ఈ చర్యలు తీసుకుంటోంది. రాబోయే పండుగ సీజన్‌లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, స్టేషన్ ప్రాంతాలలో యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్ల కొనుగోలును ప్రోత్సహించడానికి దక్షిణ మధ్య రైల్వే ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రెట్రో రిఫ్లెక్టివ్ జాకెట్లు వెనుక వైపున క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. ప్రయాణికులు దీనిని స్కాన్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
యూటీఎస్ యాప్ లేదా రైల్ వన్ యాప్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా జనరల్ టిక్కెట్లను కొనుగోలు చేసే సౌకర్యం ఏర్పాటు చేసింది. స్టేషన్ కాన్కోర్స్ ప్రాంతంలో యూటీఎస్ మొబైల్ యాప్‌ను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా కేటాయించిన వ్యక్తులు ఈ జాకెట్లను ధరించి అందుబాటులో ఉంటున్నారు. యూజర్లు యూటీఎస్లే దా రైల్ వన్ మొబైల్ అప్లికేషన్‌తో జాకెట్ వెనుక భాగంలో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. యూటీఎస్ యాప్ ద్వారా అప్లికేషన్ వినియోగం, టికెట్ల కొనుగోలు చేయడంతో కలిగే ప్రయోజనాల గురించి సిబ్బంది వారికి మార్గనిర్దేశం వివరించారు. ఈ యాప్ యూజర్-ఫ్రెండ్లీగా ఉంది. ముఖ్యంగా క్యూఆర్ కోడ్ ఆధారిత టికెటింగ్ గురించి ప్రయాణీకులలో అవగాహన కల్పించడంలో సహాయపడుతుంది. ఇది టికెట్ కౌంటర్ల వద్ద క్యూను తగ్గించడానికి, నగదు రహిత, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఇది దోహదపడుతోంది.
ఈ సౌకర్యం జోన్‌లోని 6 డివిజన్‌లలోని ప్రధాన స్టేషన్లు అయి సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు , తిరుపతి, నాందేడ్ మొదలైన వాటిలో ప్రవేశపెట్టారు. జనరల్ టికెట్ల కొనుగోలుకు మొదట విధించిన దూర పరిమితులను సడలించారు. రైలు వినియోగదారులు ఇప్పుడు స్టేషన్ ప్రాంగణం, రైల్వే ట్రాక్ నుంచి 5 మీటర్ల దూరంలో ఉన్న ఏ ప్రదేశం నుంచి అయినా టికెట్స్ కొనుగోలు చేయవచ్చు. సరళంగా చెప్పాలంటే, ప్యాసింజర్ తమ ఇంటి నుంచే తమ టిక్కెట్లను (జర్నీ/ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు రెండూ) బుక్ చేసుకోవచ్చు. అన్‌రిజర్వ్డ్ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి పొడవైన క్యూలలో నిలబడకుండా రైలులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పించారు. స్టేషన్ కాన్కోర్స్ ప్రాంతంలో ఉన్న ప్రయాణీకులు ఈ క్యూ. ఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ప్రయాణీకులు ఆర్-వాలెట్, పే-టీఎం, యూపీఐ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ డిజిటల్ మోడ్‌ల ద్వారా చెల్లించవచ్చు. ఆర్-వాలెట్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసినప్పుడు 3 శాతం బోనస్ ప్యాసింజర్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది.