Khammam: ఖమ్మం (Khammam) జిల్లా సత్తుపల్లి (Sathupalli) పట్టణం లో నీలాద్రి అర్బన్ పార్కులో జింక ఒకటి అడవి ప్రాంతాన్ని వీడి జనావాసాల్లోకి వచ్చి ప్రాణాపాయానికి గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జనావాసాల్లో సంచరిస్తున్న కుక్కలు జింకను వేటాడగా, అక్కడ ఉన్న సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది తక్షణమే స్పందించి జింక ప్రాణాలను కాపాడారు. ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో జింక జే.వి.ఆర్ ఓ.సి మెయిన్ గేట్ వద్దకు చేరింది. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది కుక్కలను తరిమి జింకను రక్షించారు. అనంతరం జింకకు ప్రధమ చికిత్స అందించి, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చికిత్స అనంతరం జింకను తమ వాహనంలో ఎక్కించుకొని తిరిగి అడవి ప్రాంతంలో వదిలేశారు. జింకను కుక్కల బారి నుండి కాపాడిన వారిలో యాక్టింగ్ జూనియర్ ఇన్స్పెక్టర్ బందెల విజేందర్, జోసెఫ్, బాజిత్, సుధాకర్, అయ్యప్ప, ప్రభాకర్, రామకృష్ణ తదితరులు ఉన్నారు. అడవి జంతువుల సంరక్షణపై ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
Also Read: Viral News: సినిమా పిచ్చోళ్లు అంటే వీళ్లేనేమో.. టికెట్ల కోసం 7 ఏళ్ల బిడ్డను వదిలేశారు!
వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల ఆందోళనలు
సత్తుపల్లి పట్టణంలో వేటగాళ్ల బెడద పెరుగుతుండటంతో అడవి జంతువులు ప్రాణాపాయానికి గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవి ప్రాంతాలకు దౌర్జన్యంగా చొరబడి, వుచ్చులు వేసి జంతువులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా వుచ్చుల్లో చిక్కుకొని జంతువులు చనిపోయిన ఘటనలు అనేకసార్లు జరిగాయి. అయినప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అడవి ప్రాంతాల్లో టహల్లు నిర్వహణలో లోపాలు, సరైన పర్యవేక్షణ లేకపోవడం, జంతువుల సంరక్షణపై అవగాహన లోపించడం వల్ల ఇటువంటి ఘటనలు కొనసాగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ప్రతి అడవి ప్రవేశ ద్వారం, మరియు పార్కు లో గల నీటి ప్రదేశాలు, జంతువులు సంచరించే మార్గాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వేటగాళ్లను ముందుగా గుర్తించడానికి, జంతువుల సంచారాన్ని పర్యవేక్షించడానికి, ప్రమాదాలను నివారించడానికి ఇవి ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ప్రాణహానిని తగ్గించడంతో పాటు, వేటగాళ్లపై కేసులు నమోదు చేయడానికి ఆధారాలు లభిస్తాయని వారు పేర్కొంటున్నారు.
సీసీ కెమెరాల అవసరం – ముందస్తు చర్యలే కీలకం
ప్రభుత్వం, అటవీ శాఖ తక్షణంగా ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “ప్రాణాలు పోయిన తర్వాత కాదు, ముందుగానే జాగ్రత్త పడాలి. ప్రతి చోట సీసీ కెమెరాలు అమర్చితేనే వేటగాళ్లకు అడ్డుకట్ట వేసి, వన్యప్రాణులను కాపాడగలం” అని స్థానికులు స్పష్టంగా పేర్కొంటున్నారు. అడవి సంరక్షణపై సమగ్రంగా చర్యలు తీసుకోకపోతే వన్యప్రాణులు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వన్యప్రాణులను వేటాడితే పడే శిక్షలు – చట్టపరమైన చర్యలు
వన్యప్రాణులను వేటాడటం, అక్రమంగా పట్టుకోవడం, వాటిపై హింస చేయడం భారత వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. ఈ చట్టం ప్రకారం వన్యప్రాణిని వేటాడితే గరిష్టంగా 3 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. నేరానికి సంబంధించిన పరిస్థితిని బట్టి ₹25,000 నుండి ₹1,00,000 వరకు జరిమానా కూడా విధించవచ్చు.కొన్ని ప్రత్యేక జాతుల విషయంలో శిక్ష మరింత కఠినంగా ఉండే అవకాశం ఉంది.
వేట కోసం ఉపయోగించే సాధనాలను స్వాధీనం చేసుకోవడం, కేసులు నమోదు చేయడం వంటి చర్యలు కూడా తీసుకోబడతాయి. ఈ నేపథ్యంలో, వేటగాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ప్రజలు, పర్యావరణ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జింక ప్రాణాలను కాపాడిన ఘటన అడవి జంతువుల సంరక్షణ ఎంత ముఖ్యమో తెలియజేసింది. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వన్యప్రాణులు ప్రాణాపాయానికి గురవుతున్నాయి. వేటగాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రతి అడవి మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణంగా స్పందించి, వన్యప్రాణులను కాపాడేందుకు సమగ్ర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
Also Read: Ponnam Prabhakar: రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ధోభిఘాట్: మంత్రి పొన్నం ప్రభాకర్