Modi – Trump: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (సెప్టెంబర్ 17) తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో భారత్-అమెరికా సంబంధాలను తిరిగి గాడిలో పెట్టాలన్న సంకల్పంతో ఉన్నట్లు పునరుద్ఘటించారు. అదే సమయంలో ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుగొనే దిశగా వాషింగ్టన్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
మీ లాగే నేను కూడా: మోదీ
తొలుత ప్రధాని మోదీ.. భారత్ – అమెరికా సంబంధాల గురించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ‘మీ లాగే నేను కూడా భారత్-అమెరికా సమగ్ర, గ్లోబల్ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారం దిశగా మీ ప్రయత్నాలకు మేము మద్దతు ఇస్తున్నాం’ అని రాసుకొచ్చారు.
Also Read: Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..
మోదీ.. నా స్నేహితుడు: ట్రంప్
మోదీ ఎక్స్ పోస్టుపై డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. వారి ఇరువురి మధ్య జరిగిన అద్భుతమైన ఫోన్ సంభాషణ గురించి ప్రస్తావించారు. భారత్ మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. మోదీ అద్భుతమైన పని చేస్తున్నారు అంటూ ట్రంప్ కొనియాడారు. ‘నా స్నేహితుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అద్భుతమైన ఫోన్ సంభాషణ జరిగింది. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన అద్భుతమైన పని చేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి మాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు నరేంద్ర’ అని ట్రంప్ రాసుకొచ్చారు.
Also Read: Telangana Tourism: హైదరాబాద్లో 12 వారసత్వ కట్టడాల అభివృద్ధికి ప్రణాళికలు.. అవి ఏమిటంటే..?
సమస్యల పరిష్కారం దిశగా..
భారత్ దిగుమతులపై కఠినమైన వాణిజ్య సుంకాలను ట్రంప్ విధించిన నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య ఇలాంటి సంభాషణ జరగడం ఆసక్తికరంగా మారింది. భారత్ – అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు పునఃప్రారంభం కావడం ద్వారా ఇరుదేశాలు.. విభేదాలను తగ్గించుకునే దిశగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే గతవారం వాణిజ్య చర్చల గురించి ప్రస్తావించిన ట్రంప్.. అడ్డంకులను తొలగించుకుందామని భారత్ కు పిలుపునిచ్చారు. దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు.