KTR vs Bandi Sanjay: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పది కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై డిసెంబర్ 15న కోర్టు విచారణ జరుపనుంది.
పరువు నష్టం దావా ఎందుకంటే?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఆగస్టు 8న బండి సంజయ్ నుంచి వాంగ్మూలం తీసుకున్న విషయం తెలిసిందే. దిల్ కుశ గెస్ట్ హౌస్ లో సిట్ విచారణకు హాజరైన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావువి తప్ప అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని వ్యాఖ్యానించారు. ట్యాపింగ్ భయంతో మాజీ మంత్రి హరీష్ రావు ఏడాదిపాటు ఫోన్ నే వాడలేదని చెప్పారు. మావోయిస్టుల నియంత్రణ కోసం వాడుకోవాల్సిన ఎస్ఐబీని కేసీఆర్, కేటీఆర్ రాజకీయ నిఘా కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేసిన @KTRBRS
భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే శ్రీ కేటీఆర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్, మరియు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై హైదరాబాద్ సిటీ సివిల్… pic.twitter.com/xAFGmUnc5k
— BRS Party (@BRSparty) September 15, 2025
‘సీఎం రేవంత్ ఫోన్ ట్యాప్ చేశారు’
రాజకీయ నాయకులు, వ్యాపారులు, న్యాయవాదులు, సినీ ప్రముఖులు, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్ లను ట్యాప్ చేశారని ఆ సందర్భంగా బండి సంజయ్ ఆరోపించారు. టీజీఎస్పీసీ పేపర్ లీకేజీ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ ను సైతం ట్యాప్ చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఫోన్ ను కూడా ట్యాప్ చేశారన్నారు. చివరకు భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో వాట్సాప్, సిగ్నల్, ఫేస్ టైంలో మాత్రమే మాట్లాడుకునే పరిస్థితి ఉండేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసి కేటీఆర్ కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. ఓ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి చెందిన 7 కోట్ల రూపాయలను పట్టుకున్నారన్నారు. ఇలా సీజ్ చేసిన వందల కోట్లు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.
ఆగస్టు 11న లీగల్ నోటీస్…
తన ప్రతిష్టను దెబ్బ తీసేలా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగస్టు 11న తన న్యాయవాదులతో లీగల్ నోటీసులు పంపించారు. బండి సంజయ్ తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని తెలియ చేశారు. అయితే, బండి సంజయ్ క్షమాపణలు చెప్పేదే లేదని స్పష్టంగా ప్రకటించారు. దాంతో కేటీఆర్ తాజాగా సిటీ సివిల్ కోర్టులో 10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. దీంట్లో ప్రతివాదులుగా బండి సంజయ్ తోపాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను చేర్చారు.
Also Read: Akshaya Patra: మహా అద్భుతం.. అక్షయపాత్ర గురించి.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
పిటిషన్ లో ఏం చెప్పారంటే?
రాజకీయ కక్షతో తనపై అసత్య ఆరోపణలు చేశారని పిటిషన్ లో కేటీఆర్ పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రజా ప్రతినిధుల విశ్వసనీయ, గౌరవాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయన్నారు. ఆన్ లైన్ ప్లాట్ ఫాంలు, మీడియా పోర్టల్ ల నుంచి తనకు పరువు నష్టం కలిగేలా ఉన్న కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్ పై సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డిసెంబర్ 15న విచారణ జరుపనున్నారు.