Bhadradri Kothagudem: పినపాక నియోజకవర్గంలోని మణుగూరు కేంద్రంగా, పగిడేరు గ్రామం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతోంది. భూమి లోతుల్లోంచి ఉబికి వచ్చే వేడి నీటి(Hot water)ని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే పథకం, జియో థర్మల్ పవర్ ప్లాంట్(Geothermal Power Plant) ఇక్కడ విజయవంతమవుతోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు, గ్రామ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం ఇవన్నీ కలసి పగిడేరు అనే చిన్న గ్రామాన్ని పెద్ద మార్పు వైపు నడిపిస్తున్నాయి. ఈ విప్లవాత్మక మార్పుపై స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం..
వేడినీడితో విద్యుత్ తయారీ..
భూమి గర్భం నుంచి సహజంగా ఉబికి వచ్చే వేడి నీటిని విద్యుత్తుగా మార్చే సంకల్పం జరుగుతోంది. సింగరేణి సంస్థ(Singareni Institute) కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ(Union Ministry of Coal) సహకారంతో పగిడేరు గ్రామంలో 20 కిలోవాట్ల పైలట్ జియో థర్మల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో ఇప్పుడు దీన్ని 122 మెగావాట్ల స్థాయికి విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కేవలం పరిశ్రమల కధ కాదు. పగిడేరు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న ఆశాకిరణం.1980లో బొగ్గు నిక్షేపాల కోసం వేసిన బోర్ల నుంచే వేడి నీరు ఉబికి రావడం మొదలైంది. అప్పట్లో సాగునీటికి ఎండాకాలంలో ఇబ్బంది పడిన గ్రామస్తులకు నీటిని అందించింది. ఇప్పుడు ఆ నీరే ఆయువు గాలిగా మారింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(Geological Survey of India) నివేదిక ప్రకారం, మణుగూరు ఏరియాలో 122 మెగావాట్ల జియో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి.
మొత్తం 3567 మెగావాట్ల సామర్థ్యం
మొత్తం 3567 మెగావాట్ల సామర్థ్యం ఉన్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి రూ.2.42 కోట్ల గ్రాంట్ కేటాయించబడింది. పర్యావరణానికి హాని చేయకుండా విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ మోడల్ దేశంలోనే విస్తృతంగా తీసుకురావడానికి ఇది ఆదర్శమవుతోంది. ఇక ఇది విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాదు.
Also Read: Revanth Reddy: గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి… అధికారులకు సీఎం ఆదేశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్..
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(Collector Jitesh V Patil) ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే దిశగా ఇప్పటికే రెండు సార్లు పర్యటించారు. వేడి నీటి ఊటలు, ప్రకృతియందు ప్రత్యేకత.. ఇవన్నీ కలసి పగిడేరు ప్రాంతాన్ని పర్యాటక గమ్యస్థానంగా మలచే అవకాశం ఉంది.
ఈ బోర్లు వచ్చాక మా గ్రామం మొత్తం మారిపోయింది. మునుపు నీటి కోసం తిప్పలు పడేవాళ్లం. ఇప్పుడు తాగు నీరు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి అన్నీ దొరకడమే కాదు, ప్రజలకు ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి వచ్చిందని అక్కడి మాజీ సర్పంచి తాటి బిక్షం అన్నారు. ఈ ప్రాజెక్ట్ వలన మా ఊరికి పేరు వస్తోందని, మా పిల్లలు ఇక బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉద్యోగాలు దొరుకుతాయని నమ్మకం కలిగిందని గ్రామస్తుడు శ్రీనివాస్ తెలిపాడు.
పగిడేరు గ్రామం ఇప్పుడు మారుతోంది. విద్యుత్ ప్లాంట్ తో పాటు పర్యాటకంగా అభివృద్ధి అయితే మా గ్రామం పూర్తిగా అభివృద్ధి పథంలోకి వస్తుంది.” వేలాది గ్రామాల అభివృద్ధికి ఇదొక ఆదర్శంగా నిలుస్తోంది. పర్యావరణ హానికరం కాని, పునరుద్ధరణీయ ఇంధన వనరులను వినియోగించి గ్రామీణ అభివృద్ధిని సాధించగల ఈ తరహా ప్రాజెక్టులు మరిన్ని రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పగిడేరు గ్రామం ఇప్పుడు దేశానికే మార్గదర్శకంగా మారుతోందని, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్ అన్నారు.
Also Read: Viral News: ఒక మహిళ, ఇద్దరు పురుషుల్ని ఒకే స్థంభానికి కట్టేసి కొట్టారు.. కారణం ఏంటంటే?
