Renu Agarwal Murder Case: సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్(Renu Agarwal) హత్య కేసులో సైబరాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నగదు నగల కోసం ఈ ఘాతుకానికి ఒడిగట్టి రాంచీ పారిపోయిన ఇద్దరు ప్రధాన నిందితులతోపాటు వారికి సహకరించిన మరొకరిని క్కాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో అరెస్ట్ చేశారు. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి మీడియా సమావేశంలో బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్, రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ లతో కలిసి వివరాలు వెల్లడించారు.
కూకట్ పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్ మెంట్ లో ఉంటున్న రేణు అగర్వాల్ ఈనెల 10న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. రేణు అగర్వాల్ (Renu Agarwal) ఇంట్లో ఇటీవలే పనికి కుదిరిన హర్ష్ కుమార్ (20), ఇదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న హతురాలి బంధువు ఇంట్లో పని చేస్తున్న రోషన్ సింగ్ (22) కలిసి ఈ కిరాతకానికి ఒడిగట్టారు. లాకర్ కు ఉన్న డిజిటల్ లాక్ కోడ్ చెప్పలేదని ప్రెషర్ కుక్కర్ తో రేణు అగర్వాల్ తలపై పలుమార్లు కొట్టటంతో కత్తులతో గొంతు కోసం దారుణంగా హతమార్చారు. ఆ తరువాత కొంత నగదు, దొరికిన నగలతో కలిసి రాకేశ్ అగర్వాల్ కు చెందిన స్కూటీపై పారిపోయారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా రేణు అగర్వాల్ నుంచి సమాధానం లేకపోవటంతో ఇంటికి వచ్చిన రాకేశ్ అగర్వాల్ భార్య దారుణ హత్యకు గురై ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించాడు.
Also Read: Ameer Ali Khan: మతసామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. మాజీ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు
ప్రత్యేక బృందాలు…
సంచలనం సృష్టించిన చిన్నరి సహస్ర హత్యను మరిచి పోక ముందే బాలానగర్ జోన్ లో జరిగిన ఈ దారుణం అన్ని వర్గాల్లో తీవ్ర కలవరాన్ని సృష్టించింది. ఈ క్రమంలోబాలానగర్ జోన్ డీసీపీ కే.సురేష్ కుమర్ నిందితులను పట్టుకునేందుకు అయిదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించగా రోషన్, హర్షలు స్కూటీపై హఫీజ్ పేట రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇద్దరు నిందితులు రైల్లో తమ సొంత రాష్ట్రమైన జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి పరారై ఉండవచ్చని అంచనా వేసిన అధికారులు అక్కడికి కూడా ప్రత్యేక బృందాలను పంపించారు.
పోలీసులను చూసి…
అయితే, సికింద్రాబాద్ స్టేషన్ లో రైలు ఎక్కి జార్ఖండ్ పారిపోవాలని రోషన్, హర్షలు ఎంఎంటీఎస్ రైల్లో హఫీజ్ పేట్ నుంచి సికింద్రాబాద్ వెళ్లారు. స్టేషన్ లో పోలీసుల నిఘాను గమనించి తిరిగి హఫీజ్ పేట స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఓ క్యాబ్ ను బుక్ చేసుకుని రాంచీకి పారిపోయారు. అయితే, ఇళ్లకు వెళితే పోలీసులు పట్టుకుంటారని ఓయో హోటల్లో గది అద్దెకు తీసుకుని ఉన్నారు.
సోషల్ మీడియాలో చూసి…
కాగా, రేణు అగర్వాల్ హత్యకు సంబంధించిన వార్తా కథనాలతోపాటు రోషన్, హర్ష ఫోటోలను వారిని తన క్యాబ్ లో రాంచీకి తీసుకెళ్లిన డ్రైవర్ చూశాడు. వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాలు రాంచీ చేరుకుని ఓయో హోటల్లో ఉన్న రోషన్, హర్షలను అరెస్ట్ చేశారు. వీళ్లు దోచుకున్న సొత్తును దాచి పెట్టటానికి సహకరించిన రోషన్ సోదరుడు రాజు వర్మను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి బంగారు నగలు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, ఖరీదైన 16 రిస్ట్ వాచీలు, ఈ మొబైల్ ఫోన్లు, రేణు అగర్వాల్ కుటుంబం ఉంటున్న ఫ్లాట్ తాళం చెవులు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
పథకం ప్రకారమే…
రోషన్, హర్షలు పక్కగా రూపొందించుకున్న పథకం ప్రకారం ఈ హత్య చేసినట్టు విచారణలో వెల్లడైందని కమిషనర్ అవినాష్ మహంతి చెప్పారు. స్వాన్ లేక్ అపార్ట్ మెంట్ లోనే ఉంటున్న రేణు అగర్వాల్ బంధువుల ఇంట్లో రోషన్ కొన్నేళ్లుగా పని చేస్తున్నట్టు తెలిపారు. తరచూ రేణు అగర్వాల్ ఫ్లాట్ కు కూడా వెళ్లి వచ్చే వాడన్నారు. ఈ క్రమంలో రేణు అగర్వాల్ ఇంట్లో పెద్ద మొత్తాల్లో నగదు, ఆభరణాలు ఉన్నట్టుగా అతనికి తెలిసిందని చెప్పారు. వాటిని దోచుకోవటానికి రాంచీలో తన స్నేహితుడైన హర్షను కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ పిలిపించి రేణు అగర్వాల్ ఇంట్లో పనికి కుదిర్చాడని తెలిపారు. ఆ తరువాత రూపొందించుకున్న పథకం ప్రకారం ఈనెల 10న రేణు అగర్వాల్ ను హత్య చేసి సొత్తుతో పారిపోయాడని వివరించారు.
Also Read: SPDCL CMD Orders: జీరో ఫిర్యాదులే లక్ష్యంగా పని చేయాలి.. ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశం