Crime News: పక్కాగా చేసిన రెక్కీ ప్రకారం నలుగురు దుండగులు పట్టపగలే దారి దోపిడీకి పాల్పడ్డారు. 40 లక్షల రూపాయలను లూటీ చేసి కారులో ఉడాయించారు. అయితే, మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో కారు బోల్తా పడటంతో 15లక్షల రూపాయలను అందులోనే వదిలేసి పరారయ్యారు. స్థానికంగా సంచలనం సృష్టించిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్(Hyderabad) లో ఉంటున్న రాకేశ్ అగర్వాల్(Rakesh Agarwal) స్టీల్ వ్యాపారి. వేర్వేరు జిల్లాలకు సరుకును సరఫరా చేస్తుంటాడు. సాయిబాబా, మణి అనే వ్యక్తులు రాకేశ్ అగర్వాల్ వద్ద ఉద్యోగులు. వికారాబాద్ లో ఉంటున్న ఓ కస్టమర్ నుంచి 40 లక్షల రూపాయలు రావాల్సి ఉండటంతో ఆ డబ్బు తీసుకుని రమ్మనమని రాకేశ్ అగర్వాల్ ఈ ఇద్దరిని పంపించాడు.
డ్రైవింగ్ చేస్తున్న అగంతకుడు..
ఈ మేరకు కారులో వికారాబాద్ వెళ్లిన సాయిబాబా(saibaba), మణిలు కస్టమర్ నుంచి 40 లక్షలు తీసుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. కాగా, వీరిని స్విఫ్ట్ డిజైర్ కారులో వెంబడిస్తూ వచ్చిన నలుగురు దుండగులు శంకర్ పల్లి మండలంలోని హుస్సేన్ పూర్ గ్రామ శివార్లలో అడ్డుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్న అగంతకుడు కారులోనే కూర్చుని ఉండగా మిగితా ముగ్గురు ముఖాలకు మాస్కులు వేసుకుని సాయిబాబా, మణి ఉన్న కారు వద్దకు వచ్చారు. డ్రైవర్ కళ్లల్లో కారం చల్లి వెనక సీట్లో ఉన్న సాయిబాబాపై బండరాయితో దాడి చేసి అతని వద్ద ఉన్న నగదు బ్యాగును లాక్కున్నారు. అనంతరం వచ్చిన కారులోనే అక్కడి నుంచి ఉడాయించారు.
Also Read: Anushka Shetty: సంచలన నిర్ణయం తీసుకున్న అనుష్క.. గుడ్ బై ? షాక్ లో ఫ్యాన్స్
15లక్షల రూపాయలను కారులోనే..
అయితే, నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత కొత్తపల్లి గ్రామ శివార్లలో దుండగులు వెళుతున్న కారు స్పీడ్ కారణంగా కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. అది చూసి స్థానికులు, దారిన వెళుతున్న వారు కారు వద్దకు వచ్చారు. ఇది గమనించిన దుండగులు హడావిడిగా కారు నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో 15లక్షల రూపాయలను కారులోనే వదిలేశారు. విషయం తెలియగానే రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణ గౌడ్, శంకర్ పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ లు అక్కడికి వచ్చారు. కారులో డబ్బు పంచుకుంటుండగా ప్రమాదం జరిగి ఉంటుందని, దాంతోనే 15లక్షలు వదిలేసి దుండగులు ఉడాయించారని భావిస్తున్నారు. ఇక, క్లూస్ టీం సిబ్బంది కారు నుంచి వేలిముద్రలను సేకరించారు. దుండగులను పట్టుకునేందుకు డీసీపీ శ్రీనివాస్ 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
Also Read: Japan Centenarians: పాపం జపాన్.. ప్రపంచ రికార్డు బద్దలుకొట్టినా.. సంతోషం లేకపాయే!