Modi Manipur Visit: కుకీ-మైతేయ్ తెగల ప్రజల మధ్య 2023 మే నెలలో ప్రారంభమైన సామూహిక హింసాత్మక ఘటనలు మణిపూర్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. చరిత్రలో కనీవినీ ఎరుగని భయంకరమైన ఘటనలు అనేకం జరిగాయి. అయితే, మణిపూర్‌లో హింస ప్రారంభమైన తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో (Modi Manipur Visit) పర్యటించబోతున్నారు. శనివారం (సెప్టెంబర్ 13) ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని మణిపూర్ చీఫ్ సెక్రటరీ పునీత్ కుమార్ గోయల్ శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించారు. ప్రధాని పర్యటనపై కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ, అధికారిక ప్రకటన లేకపోవడంతో సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజా ప్రకటనతో అనుమానాలు తొలగిపోయాయి.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రధాని మోదీ తొలుత మిజోరంలోని ఐజాల్ వెళ్తారు. అక్కడి నుంచి మణిపూర్‌లోని చురాచాంపూర్ జిల్లాకు శనివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో చేరుకుంటారు. కుకీ-మైతేయ్ తెగల మధ్య హింసాత్మక ఘర్షణల కారణంగా వలస వెళ్లిన జనాలతో మోదీ మాట్లాడనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే రూ. 7,300 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ‘పీస్ గ్రౌండ్’ వేదికగా జరగనున్న బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
చురాచాంపూర్ ఎందుకు?
ప్రధాని మోదీ పర్యటనకు మణిపూర్‌లోని చురాచాంపూర్‌ను ఎంపిక చేసుకోవడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 2023లో మణిపూర్‌లో చెలరేగిన సామూహిక హింసలో ఈ జిల్లా అత్యధికంగా ప్రభావితమైంది. నాటి అల్లర్లలో కనీసం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తమ నివాసాలు కోల్పోయి బాధితులుగా మారి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.
Read Also- Firecrackers Policy: టపాసులపై సుప్రీంకోర్టు అనూహ్య వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా నిషేధం!
కాగా, చురాచాంపూర్ జిల్లాలో కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కి వెళ్లనున్నారు. అక్కడ రూ.1,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చురాచాంపూర్‌లో కుకి వర్గం ప్రజలు ఎక్కువగా ఉండగా, ఇంఫాల్‌లో మైతేయ్ వర్గం వారు ఆధిపత్య సంఖ్యలో ఉన్నారు. రాష్ట్ర రాజకీయ పరంగా సమతుల్యత కోసం మోదీ వ్యూహాత్మకంగా రెండు ప్రాంతాలను ఎంచుకున్నారు. ప్రధాని పర్యటనపై
మణిపూర్ చీఫ్ సెక్రటరీ పునీత్ కుమార్ గోయల్ మాట్లాడుతూ, ప్రధాని పర్యటన రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితులు, వేగవంతమైన అభివృద్ధికి బాటలు వేస్తుందనే నమ్మకం ఉందన్నారు.
ప్రతిపక్షాల విమర్శల దాడి
మణిపూర్‌లో హింసా ఘటనలు 2023 మే 3న ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత తొలిసారి మణిపూర్ వెళుతున్న ప్రధాని మోదీపై విపక్ష పార్టీలు విమర్శల దాడి చేశాయి. ఇంత ఆలస్యంగానా? అని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కెషామ్ మేఘచంద్ర శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని పర్యటన కండితుడుపు చర్య. కొన్ని నెలలుగా శరణార్థ శిబిరాల్లో ఉన్న బాధితులు ఉంటున్నారు. శాంతి, పునరావాసం, న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. శాంతిని నెలకొల్పేందుకు మోదీ పర్యటనకు ముందు ప్రకటించి వస్తే బాగుండేది. అన్ని వర్గాల ప్రతినిధులతో చర్చలు లేకపోవడం బాధాకరం’’ అని మేఘచంద్ర వ్యాఖ్యానించారు.
Read Also- Lawyers Fight: హైకోర్టులో షాకింగ్ ఘటన.. జడ్జి ముందే గొడవ పడ్డ లాయర్లు.. వీడియో వైరల్