Crime News: జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ అదే ఆసుపత్రిలో కాంపౌండర్/ఓటీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మహారాష్ట్రకు(MH) చెందిన పెద్ది దక్షన్ మూర్తి @ దక్షిణామూర్తి(Dakshinamurthy) (23)ని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలు కరీనగర్ సీపీ గౌస్ అలాం(CP Ghaus Alam) వెల్లడించారు. బాధితురాలు తన తల్లితో కలిసి గత శనివారం రాత్రి ఆసుపత్రికి వచ్చింది. ఆమెను ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు, అయితే ఆమె తల్లి వెయిటింగ్ హాల్‌లో నిద్రించింది. ఈ అదును చూసి ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న దక్షిణ్ మూర్తి అనే వ్యక్తి తెల్లవారుజామున యువతికి మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. మత్తు తగ్గిన తర్వాత యువతికి అస్వస్థతగా అనిపించడంతో తల్లికి విషయం చెప్పింది.
వెంటనే కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు క్రైమ్ నెంబర్ 343/2025, సెక్షన్ 64(2)(e) BNS, 2023 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వెంటనే ఆసుపత్రికి వెళ్లి సాక్షులను విచారించారు. టెక్నికల్ ఆధారాలను సేకరించారు. ఆధారాలన్నీ పరిశీలించిన అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Also Read: Pig Kidney Transplant: వైద్య రంగంలో సంచలనం.. 54 ఏళ్ల వ్యక్తికి.. పంది కిడ్నీ అమర్చిన వైద్యులు
నిందితుడి నేపథ్యం
నిందితుడు పెద్ది దక్షన్ మూర్తి(Peddi Dakshan Murthy) (23) @ దక్షిణామూర్తి, తండ్రి పోచన్న, వయసు 23 సంవత్సరాలు. అతను మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లా, సిరోంచ తాలూకా, లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందినవాడు. అతను ఇంటర్మీడియట్ (బైపిసి) వరకు చదువుకుని, నాలుగు సంవత్సరాల క్రితం కరీంనగర్ వచ్చాడు. మొదట ఆర్కిడ్ ఆసుపత్రిలో వార్డ్ బాయ్‌గా పని చేసి, ఆ తర్వాత హరిణి ఆసుపత్రిలో మేల్ స్టాఫ్ నర్సుగా చేరాడు. అయితే, తరచుగా మద్యం సేవించి డ్యూటీకి రావడం వల్ల అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం స్వగ్రామానికి వెళ్లి తిరిగి కరీంనగర్ వచ్చి ఈ ఆసుపత్రిలో కాంపౌండర్‌గా చేరాడు. నిందితుడు తరచుగా అశ్లీల వెబ్‌సైట్లు చూస్తూ, మద్యం సేవించి విధులకు హాజరయ్యేవాడు అని పోలీసులు తెలిపారు.
హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు
దర్యాప్తులో భాగంగా, ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్లు తేలితే సంబంధిత అధికారులకు నివేదిక పంపి తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
యువతకు సూచన
ఈ సందర్భంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, వాటికి బానిసలు కావద్దని పోలీసులు సూచించారు. ఈ కేసులో నిందితుడు చెడు అలవాట్లకు బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడు అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు.