Virat – Rohit: ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat – Rohit) తమ క్రికెట్ కెరీర్లలో కీలకమైన దశలో ఉన్నారు. వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్నా.. భవిష్యత్తు కొంత స్పష్టత లేదని చెప్పుకోవాలి. 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు కొనసాగాలని ఇద్దరూ భావిస్తున్నారు. అనేక మంది క్రికెట్ నిపుణులు కూడా ఇదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బీసీసీఐ అవకాశం ఇస్తుందా, లేదా అనేది సందేహాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ఆసక్తికరమైన చేశారు. రోహిత్, కోహ్లీ తమ కెరీర్లపై లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. టాప్ క్రికెటర్లు ఇద్దరూ కష్టాలను ఎదుర్కొంటూ, వన్డేల్లో మెరవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు.
Read Also- Karimnagar District: ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న యువతిపై లైంగిక దాడి!
‘‘మనసులో ‘నేనే దేవుడు, నేనే గొప్ప’ అని అనుకుంటుంటారు. ఆటకంటే ఎవరూ గొప్పవాళ్లు కాదు. నిరంతరం చక్కటి ప్రదర్శన చేయాల్సిందే. విరాట్, రోహిత్ ఇద్దరూ గొప్ప ప్రతిభ ఉన్న ఆటగాళ్లే. అయినాసరే నేనేం చెబుతానంటే, ఉదయం 5 గంటలకు లేవండి, ట్రైనింగ్‌కి వెళ్దాం అని అంటాను. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆడినప్పుడు బ్యాట్‌కు, బంతికి చాలా దూరం ఉండేది. అప్పుడు ఎవరు అతడిని పిలిచి తప్పుగా ఆడుతున్నావని చెప్పలేదు. ఇక, ఉదయం 5 గంటలకు నిద్రలేవమని రోహిత్‌కి ఇప్పుడు ఎవరు చెబుతారు?. 10 కిమీ రన్నింగ్ చేయాలంటూ అతడిని ఎవరు పర్యవేక్షిస్తారు. అందుకే, నేనేమంటానంటే ఆటకంటే ఎవరూ గొప్పవాళ్లు కాదు. నిరంతరం రాణిస్తూ ఉండాల్సిందే. ఆడిన 10 మ్యాచుల్లో 5 మ్యాచుల్లో విఫలమవుతున్నారు ఎందుకు?. డాన్ బ్రాడ్‌మాన్ సగటు ఎందుకు 99.9 పరుగులుగా ఉంది?. మరి మీ సగటు 54-55 పరుగులు మాత్రమేనా?. దీనిర్థం ఎక్కువసార్లు విఫలమవుతున్నారనే కదా. సచిన్ ఎందుకు 43 ఏళ్ల వయసు వరకు క్రికెట్ ఆడాడు. ఎందుకంటే, ఆయన ఎప్పుడూ ఒదిగి ప్రాక్టీస్ చేసుకునేవాడు. ముంబై కోసం రంజీలో కూడా ఆడేవాడు’’ అని యోగ్‌రాజ్ సింగ్ గుర్తుచేశారు.
Read Also- Nandamuri Balakrishna: అక్కడ బెల్ మోగించిన తొలి సౌత్ ఇండియన్ స్టార్‌గా బాలయ్య రికార్డ్!
సరిగ్గా ప్రదర్శన చేయకపోతే, ఆడకూడదని జనాలు కోరుకుంటారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. చక్కటి ప్రదర్శన చెయ్యి, లేదంటే, జట్టుని వదిలిపెట్టు అని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌కి చంద్రకాంత్ పండిట్ చెప్పిన మాటలు తనకు ఇంకా గుర్తొస్తున్నాయని అన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ప్రస్తుత స్థితిగతులపై మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇన్‌సైడ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. మొత్తంగా ఇద్దరూ అసాధారణమైన ప్రతిభ కలిగిన ఆటగాళ్లే అయినప్పటికీ, ఇద్దరూ నిరంతర ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని యోగ్‌రాజ్ సింగ్ గుర్తుచేశారు.
కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఇటీవలే బీసీసీఐ ఫిట్‌నెస్ పరీక్షను ఎదుర్కొన్నారు. ఇద్దరూ పాసయ్యారు. అయితే, జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటూ నిరంతరం క్రికెట్ ఆడుతుండడం, మరీ ముఖ్యంగా దేశవాళీ క్రికెట్ ఆడడం చాలా ముఖ్యం.