Gadwal( image CRDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Gadwal: గద్వాల నడిబొడ్డున ఆనాటి పెద్దలు ఆధ్యాత్మిక భావనతో బావి తరాలకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో పట్టా భూమిని దేవాదాయ శాఖకు అప్పజెప్పారు. కాలం గడిచే కొద్దీ ఆ భూమి, బావి నిరుపయోగంగా ఉండడంతో అక్రమార్కుల కన్ను ఈ భూమిపై సైతం వేశారు. అప్పటికే కొన్ని దేవదాయ శాఖ కింద నిర్మించిన దుకాణాలు ఉండగా దానికి ఆనుకొని ఉన్న కాలేజ్ స్థలంతో పాటు బావిని సైతం పూర్తి ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ లోనే నిర్మించుకునే సాహసానికి ఈ కబ్జాదారులు ఒడిగట్టారు. గద్వాల నడిబొడ్డున ఇంత జరుగుతున్న పర్యవేక్షించాల్సిన దేవాదాయశాఖ అధికారులు మిన్నకుండి కేవలం తమ వాటాలకే పరిమితమై భవిష్యత్తు తరాల కోసం విలువైన భూమిని ఇచ్చిన వారి ఆశలను, ఆశయాలను,విశాల దృక్పథాన్ని వమ్ము చేస్తూ, కేవలం ధనార్జనే ధ్యేయంగా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నడంపై స్థలం ఇచ్చిన దాతల వారసుల తో పాటు పట్టణ ప్రజలు సైతం వారి తీరుని ఎండగడుతున్నారు.

Also Read: Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

స్థలం కబ్జారాయుళ్ల చేతుల్లోకి

రూ.10 కోట్లు విలువ చేసే ఎండోమెంట్ స్థలం అన్యాక్రాంతమైంది. ఖాళీ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ ఉన్న బావిని పూడ్చేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు. ఇంత జరుగుతున్నా ఎండోమెంట్ అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కొన్నేండ్ల కింద ఉత్తనూర్ వెంకట్ రెడ్డి, ఉత్తనూర్ పాపిరెడ్డి తమ స్థలాన్ని ఎండోమెంట్ కు డొనేట్ చేశారు. కానీ, ఇప్పుడు ఆ స్థలం కబ్జారాయుళ్ల చేతుల్లోకి వెళ్లిపో యింది. తమ పూర్వీకులు సదుద్దేశంతో స్థలాన్ని డొనేట్ చేస్తే, ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం తో ఆ స్థలం అన్యాక్రాంతమైందని స్థలాన్ని డొనేట్ చేసిన వారి వారసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థలాన్ని కాపాడకపోతే తమకు తిరిగి ఇవ్వాలని దాతల వారసులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కబ్జాలో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు.

ఉన్నతాధికారులు దృష్టి సారించక

రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో 704 ఆలయాల కింద 91,827 ఎకరాల భూమి ఉంది. వివిధ జిల్లాల్లో రూ.వందల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. వీటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే ఆక్రమణదారులపై చట్టపరంగా చర్యలకు దిగాలి. జిల్లాలో ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కబ్జాలకు పాల్పడిన సందర్భంలో శాఖకు చెందిన భూమిని చట్టపరంగా సర్వే జరిపించి.. హద్దుల నిర్ధారణతో స్వాధీనం చేసుకొనేందుకు సొంత శాఖలో తహసీల్దార్లు ఉంటారు. వీరంతా రెవెన్యూ నుంచి డిప్యుటేషన్పై దేవాదాయశాఖకు వస్తారు. వీరు రెండేసి ఉమ్మడి జిల్లాల పరిధిలోని భూవివాదాలను పర్యవేక్షించాలి. కానీ వీరంతా హైదరాబాద్లో రాష్ట్ర కార్యాలయాల్లో ఉంటూ.. క్షేత్రస్థాయిలో పట్టించుకోవటం లేదు. ఇది కాస్త కబ్జాదారులకు అనుకూలంగా మారుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకొని పకడ్బందీగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని ఆయా ఆలయాల అర్చకులు, స్థానిక భక్తులు కోరుతున్నారు.

నాడు దూరదృష్టితో భూదానం.. నేడు అక్రమార్కుల చేతుల్లోకి

మన తాతల కాలంలో ఆధ్యాత్మిక చింతనలో భాగంగా ఉన్న దాంట్లో భవిష్యత్తు తరాలకు ఇదే ఆనవాయితీని కొనసాగించాలని గృహ సంకల్పంతో కుటుంబాల భవిష్యత్తును సైతం పన్నంగా పెట్టి దూరదృష్టితో తమ పూర్వీకుల కష్టార్జితంగా వచ్చిన భూములను తమ పిల్లల భవిష్యత్తును సైతం పన్నంగా పెట్టి దేవాదాయ శాఖకు దారాదత్తం చేయగా నేటి తరం నాయకులు, అధికారులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అందుబాటులో ఉన్న సహజ వనరులను సైతం దోచుకునే పరిస్థితికి దిగజారుతున్నారు.

ఎండోమెంట్ ఆఫీ సర్లు పట్టించుకోవడం లేదు 

గద్వాలకు చెందిన ఉత్తనూర్ వెంకట్ రెడ్డి, పాపి రెడ్డి చిన్న అగ్రహారం సమీపంలో జానకమ్మ పేరిట పొలాన్ని, బావి. సత్రాన్ని దేవాదాయశాఖకు డొనేట్ చేశారు. కూరగాయల మార్కెట్, రాయల్ లాడ్జ్ సమీపంలో సర్వే నంబర్ 230లో 21 గుంటలు, 516లో 8 గుంటలు, 294లో 22 గుంటలతో పాటు బావి, ఖాళీ స్థలాన్ని అందజేశారు. ఆ స్థలం విలువ ప్రస్తుతం కోట్లకు చేరింది. దీనిని కాపాడాల్సిన ఎండోమెంట్ ఆఫీ సర్లు పట్టించుకోకపోవడంతో కొందరు వ్యక్తులు బావిని పూడ్చేసి, ఖాళీ స్థలాన్ని కలుపుకొని షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్నారు. ఇదంతా జరుగుతున్నా ఎండోమెంట్ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కిరాయి

దేవాదాయశాఖలోని ఓ ఉద్యోగి అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే దాతలు ఇచ్చిన స్థలంలో 70 శాతం వరకు కబ్జా చేయగా, మిగిలిన 30 శాతం స్థలంలో కొన్ని సంవత్సరాలుగా 8 దుకాణాలలో ఓనర్లు ఏండ్లుగా కిరాయి చెల్లించడం లేదు. ఈ ఏరియాలో ఒక్కో షాపునకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కిరాయి ఉంది. కానీ ఎండోమెంట్ పరిధిలోని షాపులకు కేవలం రూ. వెయ్యి మాత్రమే వసూలు చేస్తున్నారు.

ఈకిరాయి కూడా చెల్లించడం లేదని అంటున్నారు. ఓ దేవాదాయ శాఖ అధికారి ఈ దుకాణాలలోని ఒక దుకాణదారుడితో అంటగాగుతూ పలు దుకాణాల ఓనర్ల నుంచి దేవాదాయ శాఖకు చెందిన అధికారి రెండు, మూడు నెలలకోసారి మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. దేవాలయాల కోసం దాతలు ఇచ్చిన భూములను పరిరక్షించాల్సిన అధికారులు అక్రమార్కులకు అండగా ఉండి దాతల మనోభావాలు దెబ్బతీస్తున్న సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థలదాతల వారసులు కోరుతున్నారు.

స్వయంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం : మదనేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్

ఎండోమెంట్ శాఖకు సంబంధించిన జానకమ్మ సత్రం దగ్గర స్థలం కబ్జాకు గురైన విషయం నా దృష్టికి కూడా వచ్చింది. దీనిపై పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తాం. 8 షాపులకు రూ.వెయ్యి చొప్పున కిరాయి వస్తున్న మాట వాస్తవమే. కిరాయి పెంచేందుకు నోటీసులు ఇస్తాం. ఎండోమెంట్ స్థలం కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం, కబ్జా కోరల నుంచి దేవాదాయశాఖ భూమిని పరిరక్షిస్తాం.

 Also Read: Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Just In

01

Asia Cup Prediction: ఆసియా కప్‌లో టీమిండియాతో ఫైనల్ ఆడేది ఆ జట్టే!.. ఆశిష్ నెహ్రా అంచనా ఇదే

Ganesh Immersion 2025: హైదరాబాద్‌లో 2 లక్షల 54 వేల 685 విగ్రహాలు నిమజ్జనం.. జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడి

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు