Khairatabad Ganesh 2025: హైదరాబాద్ లో ఇవాళ వందలాది గణనాథుల నిమజ్జనాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నగరం నలుమూల నుంచి హుస్సేన్ సాగర్ వద్దకు పెద్ద ఎత్తున వినాయకుడి విగ్రహాలు ఊరేగింపుగా తరలివస్తున్నాయి. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ భారీ గణేశ్ సైతం ట్యాంక్ బండ్ వద్దకు తరలివచ్చారు. ఈ భారీ గణనాథుడ్ని బాహుబలి క్రేన్ సాయంతో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. కన్నుల పండుగగా సాగిన ఈ నిమజ్జన ప్రక్రియను చూసేందుకు వేలాది మంది ప్రజలు ట్యాంక్ బండ్ వద్దకు తరలివచ్చారు.
ఘనంగా శోభయాత్ర.
అంతకుముందు ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. 69 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని పోలీసులు నిర్దేశించిన రూట్ మ్యాప్ ప్రకారం యాత్రగా తీసుకెళ్లారు. ఖైరతాబాద్ బడా గణేష్ మండపం నుంచి పాత పీఎస్ సైఫాబాద్ → ఇక్బాల్ మినార్ →తెలుగు తల్లి → అంబేద్కర్ విగ్రహం మీదుగా ఈ భారీ గణనాథుడ్ని హుస్సేన్ సాగర్ వద్దకు తీసుకొచ్చారు. దారి పొడవున వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రను తిలకించారు. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనంతో ఈ ప్రక్రియ ముగిసింది.
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి #KhairatabadGanesh2025 #khairathabadganesh pic.twitter.com/dvEw6cN3Yg
— BIG TV Breaking News (@bigtvtelugu) September 6, 2025
Also Read: Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!
బడా గణేశ్ ప్రత్యేకలు ఇవే
ఏడు దశాబ్దాల నుంచి ఖైరతాబాద్ లో భారీ గణనాథుడు కొలువు దీరుతున్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి గణపతిగా విఘ్వేశ్వరుడ్ని ఏర్పాటు చేశారు. గణనాథుడి విగ్రహాన్ని 3 తలలతో నిల్చున్న భంగిమలో నిర్మించారు. అలాగే తలపై పడగ విప్పిన 5 సర్పాలు, 8 చేతులతో గణనాథుడు దర్శనమిచ్చారు. కుడివైపు చేతుల్లో ఆయుధం, సుదర్శన చక్రం, అభయహస్తం, రుద్రాక్షమాలను పెట్టారు. ఎడమవైపు చేతుల్లో పైనుంచి పద్మం, శంఖం, లడ్డూ ఉన్నాయి. విగ్రహం దిగువ కుడివైపు పూరీ జగన్నాథ స్వామి, ఎడమవైపు శ్రీలలితా త్రిపురసుందరి విగ్రహాలు ఏర్పాటు చేశారు.
Also Read: Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?
ఏడాదికి ఒక్కో అడుగు పెరుగుతూ..
ఖైరతాబాద్ గణనాథుడికి ఘనమైన చరిత్ర ఉంది. 1954 నుంచి ఇక్కడ గణనాథుడ్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ ఉద్యమకారుడు బాల గంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపు.. ఖైరతాబాద్ లో ఈ గణేశ్ విగ్రహం ఏర్పాటుకు పునాది వేసింది. నగరానికి చెందిన సింగరి శంకరయ్య 1954లో తొలిసారి ఒక అడుగుతో ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలా ఏటా ఒక్కో అడుగు చొప్పున విగ్రహాం ఎత్తు పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాదికి 71 ఏళ్లు అవ్వగా.. విగ్రహం ఎత్తు కూడా 69 అడుగులకు చేరింది.