Donald Trump: గత దశబ్దాల కాలంలో ఎన్నడు లేనంతగా భారత్ – అమెరికా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రతీకార సుంకాల నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) వ్యూహాత్మకంగా చైనా (China), రష్యా (Russia)లకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలో భారత్ – అమెరికా తిరిగి దగ్గర కాలేవా? అన్న ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ తనకు ఎప్పటికీ స్నేహితుడేనని.. భారత్ తో బంధాన్ని పునరుద్దరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.
ట్రంప్ ఏమన్నారంటే?
మీరు భారత్ తో సంబంధాలను పునఃప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్రంప్ ను ప్రశ్నించింది. దానికి ట్రంప్ సమాధానం ఇస్తూ.. ‘నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. నేను ఎప్పుడూ మోడీ గారితో స్నేహితుడిగానే ఉంటాను. ఆయన గొప్ప ప్రధాన మంత్రి. కానీ ఆయన ఇప్పుడు చేస్తున్న పని నాకు నచ్చడం లేదు. అయితే భారత్-అమెరికా మధ్య సంబంధం చాలా ప్రత్యేకమైనది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరుగుతుంటాయి’ అని ట్రంప్ బదులిచ్చాడు.
Trump:
I will always be friends with Modi. He is great. I just don’t like what he is doing at this particular moment.
India and the US have a special relationship. We just have “moments” on occasion. There is nothing to worry about. pic.twitter.com/4wvCch8BIH
— Clash Report (@clashreport) September 5, 2025
దానిపై ట్రంప్ అసంతృప్తి
మరో ప్రశ్నకు సమాధానంగా భారత్‌తో పాటు ఇతర దేశాలతో జరుగుతున్న వాణిజ్య చర్చల గురించి ట్రంప్ మాట్లాడారు. చర్చలు బాగా సాగుతున్నాయని చెప్పారు. అయితే యూరోపియన్ యూనియన్ గూగుల్‌పై విధించిన భారీ జరిమానాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అమెరికాతో వాణిజ్య సంబంధాలపై ఇతర దేశాలతో చర్చలు జరుగుతున్నాయి. పరస్పర అంగీకారంతో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ యూరోపియన్ యూనియన్ ప్రవర్తనపై అసంతృప్తి ఉంది. గూగుల్ మాత్రమే కాదు, మా ఇతర పెద్ద కంపెనీల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
‘భారత్ అలా చేయడంతో.. నిరాశ చెందా’
చైనా కుట్రల వల్ల భారత్, రష్యాను కోల్పోయామని చేసిన పోస్ట్ పైనా ట్రంప్ కు ప్రశ్న ఎదురైంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ ‘నేను అలా అనుకోవడం లేదు. కానీ రష్యా నుంచి భారత్ ఇంత ఎక్కువ చమురు కొనుగోలు చేస్తుందనే విషయం నాకు నిరాశ కలిగించింది. దాన్ని వారికి తెలిపాను. మేము భారత్‌పై 50 శాతం భారీ సుంకం విధించాం. నేను మోదీ గారితో చాలా సాన్నిహిత్యంగా ఉంటాను.. ఇది మీకు తెలిసిందే. ఆయన కొన్ని నెలల క్రితం ఇక్కడికి వచ్చారు. మేము రోజ్ గార్డెన్‌లో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేశాం’ అని ట్రంప్ చాలా పాజిటివ్ గా మాట్లాడారు. భారత్, రష్యాను కోల్పోయామని పోస్ట్ పెట్టిన కొద్ది గంటల వ్యవధిలోనే భారత్ గురించి ట్రంప్ సానుకూలంగా మాట్లాడటం గమనార్హం. అయితే ఇటీవల ప్రధాని మోదీ చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. చైనా అధ్యక్షుడు జినిపింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కలిసి ఒకే ఫ్రేమ్ లో మోదీ నవ్వుతూ కనిపించారు. ముగ్గురు దేశాధినేతలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ, ఆలింగనాలు చేసుకోవడం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీంతో ట్రంప్ దెబ్బకు దిగొచ్చాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?
భారత్ స్పందన ఇదే
ఇదిలా ఉంటే వాషింగ్టన్-దిల్లీ సంబంధాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ స్పందించారు. ‘అమెరికా-భారత్ ద్వైపాక్షిక బంధం మాకు అత్యంత ప్రాముఖ్యం కలిగినది. మా రెండు దేశాల మధ్య సమగ్ర గ్లోబల్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ఇది మా ఉమ్మడి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలు, బలమైన ప్రజా సంబంధాలపై ఆధారపడి ఉంది. ఈ భాగస్వామ్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ బలంగా కొనసాగింది. పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా ఈ సంబంధం ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. అలాగే అమెరికాతో వాణిజ్య సమస్యలపై భారత్ నిరంతరం చర్చలు కొనసాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు.