Crime News: మార్ఫింగ్ చేసిన ఫోటోలతో యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు డిమాండ్ చేస్తున్న ఇద్దరిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. అల్వాల్ ప్రాంతంలో నివాసముంటున్న ఓ యువతి స్థానికంగా ఉన్న జిమ్ కు ప్రతీరోజూ వెళుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ రవి ఎలియాస్ రఫీ ఆమెకు పరిచయమయ్యాడు. యువతితో మాటలు కలిపిన రవి స్నేహాన్ని పెంచుకున్నాడు. ఆ తరువాత యువతి ఫోటోలు తీసుకుని వాటిని అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేశాడు. తనకు 10లక్షల రూపాయలు ఇవ్వాలని.. లేనిపక్షంలో ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టాడు.
దీనికి రవి సోదరుడు రూపేష్ కూడా సహకరించాడు. రోజురోజుకు వీరిద్దరి వేధింపులు అధికం అవుతుండటంతో బాధితురాలు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు రవి, రూపేశ్ లను అరెస్ట్ చేశారు. విచారణలో రవి నిత్య పెళ్లి కొడుకు అని వెల్లడైంది. కట్నం కోసం తనకు వివాహం కాలేదని నమ్మిస్తూ ముగ్గురిని పెళ్లి చేసుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది.
Also Read; Drugs Seized: ఈ డ్రగ్ వాడితే.. డా.సమరంతో పనిలేదట.. నైజీరియన్ అరెస్ట్
80తులాల బంగారు నగల చోరీ
హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 80 తులాల బంగారు నగలు తస్కరించారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ దొంగతనం కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేజ్ లో నివాసముంటున్న ప్రభాకర్ చారి ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి రిటైరయ్యారు.
ఇటీవల దైవ దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లారు. కాగా, గురువారం రాత్రి తలుపులకు ఉన్న తాళాలను విరగ్గొట్టి లోపలికి చొరబడ్డ దొంగలు బీరువాలో దాచి పెట్టిన 80 తులాల బంగారు ఆభరణాలను తస్కరించి ఉడాయించారు. శుక్రవారం తలుపులు తెరిచి ఉండటం చూసిన స్థానికులు ప్రభాకర్ చారితోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Kadiyam Srihari: కవిత వల్లే పార్టీకి రాజీనామా చేశా.. కడియం సంచలన కామెంట్!