Nitin Gadkari: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖా మంత్రి, బీజేపీ సీనియర్ నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తన మనసులో ఉన్న భావాలను కుండబద్ధలు కొట్టినట్టు మాట్లాడి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజకీయాలు, నాయకత్వం గురించి మాట్లాడుతూ, జనాల్ని బాగా మోసం చేయగలిగినవాడే గొప్ప నాయకుడు అవుతాడని వ్యాఖ్యానించారు. ప్రజలను వంచించి, నమ్మించగల నాయకుడే చాలా సందర్భాల్లో విజయం సాధిస్తాడని అన్నారు.
Read Also- Ambulance Vehicle: అంబులెన్స్ రాకతో అత్యవసర వైద్య సేవలు.. నిలుస్తున్న బాధితుల ప్రాణాలు!
తన వ్యాఖ్యను వివరిస్తూ, మాట్లాడేటప్పుడు తేలికగానే అనిపిస్తుందని, కానీ, చేయడం అంత సులభం కాదని అన్నారు. తాను పని చేస్తున్న రంగంలో నిజాన్ని పూర్తిగా చెప్పడాన్ని ఉత్సాహపరచబోరని, నిజాయితీగా మాట్లాడటం ఇక్కడ అవమానమవుతోందంటూ రాజకీయ రంగంపై ఛలోక్తులు విసిరారు. ఈ సందర్భంగా మరాఠీ భాషలో ఉన్న ఒక నానుడిని ఉదహరించారు. ‘హాసే, నావ్సే, గావ్సే’ అంటే ప్రతి ఒక్కరికి తనదైన శైలి, ఉద్దేశాలు ఉంటాయన్న అర్థమని గడ్కరి వివరించారు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ రంగంతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి.
Read Also- India–US partnership: చైనాలో మోదీ, పుతిన్ కలిసిన నిమిషాల వ్యవధిలోనే అమెరికా కీలక ప్రకటన
అయితే, నాయకుడు అనేవాడు జనాల్ని ఎంత మోసం చేసినా నిజానికి విలువ ఉంటుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ‘‘ఒక విషయం మాత్రం నిజం.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా, చివరికి గెలుపు సత్యం వైపే ఉంటుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. లక్ష్య సాధనలో షార్ట్‌కట్స్ వాడకూడదని ఆయన హెచ్చరించారు. ‘‘విజయాలు సాధించడానికి షార్ట్‌కట్స్ ఉంటాయి. రూల్స్, రెడ్ సిగ్నల్స్ అతిక్రమించి ముందుకు దూసుకెళ్లొచ్చు. కానీ, ఒక తత్వవేత్త.. ‘షార్ట్‌కర్ట్ విధానాలు నిన్ను తక్కువ చేస్తాయి అన్నారు’’ అని గడ్కరీ ప్రస్తావించారు. నిజాయితీ, వాస్తవికత, నిబద్ధత, సత్యం.. ఇవన్నీ సమాజంలో ఎల్లప్పుడూ ప్రాధాన్యత కలిగిన విలువలేనని గడ్కరీ పేర్కొన్నారు. మొత్తంగా, రాజకీయాలలో మాటల గారడీలతో ప్రజలను ఏమార్చుతున్నప్పటికీ, నిజాయితీగా బతకడం, నిజాలు మాట్లాడడం, నిబద్ధతతో పనిచేయడం వంటివి దీర్ఘకాలంలో స్థిరమైన గౌరవం, విజయాన్ని తీసుకొస్తాయన్నది ఆయన సందేశంగా కనిపిస్తోంది.
Read Also- Farmers Protest: ఆ జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు.. కలెక్టర్ రావాలని డిమాండ్