India–US partnership: చైనాలోని తియాంజిన్ నగరంలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లతో ఆప్యాయ పలకరింపులు, హత్తుకోవడాలు, అసాధారణ రీతిలో మోదీ-పుతిన్ ఒకే కారులో ప్రయాణించి చర్చలు జరిపిన పరిణామాలను నిశితంగా గమనించిన అగ్రరాజ్యం అమెరికా ఆసక్తికర రీతిలో స్పందించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీమ్‌లో కీలక సభ్యుడు, ఆ దేశ విదేశాంగమంత్రి మార్కో రూబియో, భారత్-అమెరికా సంబంధాలను 21వ శతాబ్దానికే నిర్వచనీయ మైత్రి అని (India–US partnership) వ్యాఖ్యానించారు.
ఇరుదేశాల మధ్య సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. “మన ఇరుదేశాల బంధాలను ముందుకు తీసుకెళ్తున్న ప్రజలు, పురోగతి, అవకాశాలను ఈ నెలలో ప్రత్యేకంగా గుర్తుచేయదలిచాం. ఆవిష్కరణల నుంచి పారిశ్రామిక, రక్షణ, ద్వైపాక్షిక సంబంధాల వరకు, ఇరుదేశాల ప్రయాణాన్ని ఉత్తేజపరుస్తున్నది ప్రజల మధ్య బలమైన స్నేహమే” అని రూబియో వ్యాఖ్యానించారంటూ అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేసింది. ఎస్‌సీవో సదస్సులో పాల్గొన్న తర్వాత, ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల పరస్పర భేటీకి కొన్ని నిమిషాల ముందు అమెరికా ఈ ప్రకటన చేసింది.
యూరప్, ఆసియాలో అత్యంత శక్తిమంతమైన రష్యా, చైనా, భారత్ దేశాల అధినేతలు ఒకే వేదికపై సమావేశమైన నేపథ్యంలో, అమెరికా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా 50 శాతం అధిక సుంకాలు విధించిన నేపథ్యంలో మోదీ చైనా వెళ్లి జిన్‌పింగ్, పుతిన్‌లతో భేటీ కావడాన్ని అమెరికాతో పాటు యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును ఆపకపోవడాన్ని కారణంగా చూపుతూ భారత ఎగుమతులపై అమెరికా ఈ భారీ టారిఫ్‌లు విధించింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని కారణంగా చూపి పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించినా, 140 కోట్ల మంది జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, తక్కువ రేటుకే లభిస్తున్న రష్యా ముడిచమురును కొనుగోలు చేస్తున్నామని భారత్ స్పష్టంగా చెబుతోంది. అమెరికా విధించిన టారిఫ్‌లు అన్యాయమైనవని, అనవసరమైనవని, హేతుబద్ధత లేదని కేంద్ర ప్రభుత్వం అభివర్ణించింది. దేశ ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎలాంటి చర్యలకూ తలొగ్గబోమని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also- Rohit Sharma: రోహిత్ శర్మకు ‘బ్రాంకో’ ఫిట్‌నెస్ టెస్ట్.. రిజల్ట్ ఏం వచ్చిందంటే?
కాగా, తియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ పరస్పరం కరచాలనాలు చేసుకోవడం, చిరునవ్వులు చిదించడం, హత్తుకోవడం, జబ్బలు చరుచుకోవడం ద్వారా బలమైన మైత్రిని ప్రదర్శించారు. ప్రధాని మోదీ, పుతిన్ మరోసారి ఇరుదేశాల బలమైన స్నేహ సంబంధాన్ని చాటిచెప్పడంతో, అమెరికా బెదిరింపులకు భారత్ తలొగ్గదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు అయిందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
The partnership between the United States and India continues to reach new heights — a defining relationship of the 21st century. This month, we’re spotlighting the people, progress, and possibilities driving us forward. From innovation and entrepreneurship to defense and… pic.twitter.com/tjd1tgxNXi
— U.S. Embassy India (@USAndIndia) September 1, 2025