Private school fee: బెంగళూరు నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ స్కూల్ ఫీజు వివరాలకు (Private school fee) సంబంధించిన స్క్రీన్‌షాట్ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. 1వ తరగతి (1st Grade) విద్యార్థుల వార్షిక ట్యూషన్ ఫీజు రూ.7.35 లక్షలు అని అందులో ఉంది. ఇక, 11, 12వ తరగతుల (ఇంటర్) విద్యార్థులకైతే ఏకంగా రూ. 11 లక్షలు వరకు తీసుకుంటామని స్కూల్ యాజమాన్యం ఫీజు స్ట్రక్చర్‌లో పేర్కొంది. ఇవి కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే. అదనంగా ట్రాన్స్‌పోర్ట్, పుస్తకాలు, యూనిఫాం, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వంటి వాటి కోసం ప్రత్యేకంగా చెల్లించాల్సి ఉంటుంది. అవి కూడా కలిపితే ఒకటో తరగతి పిల్లాడి చదువుకు ఈ స్కూల్లో ఏకంగా రూ.8 లక్షలకు పైగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డీ.ముతుకృష్ణన్ అనే ఫైనాన్షియల్ ప్లానర్.. స్కూల్ ఫీజుల స్క్రీన్‌షాట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. దీంతో, ఇది వైరల్‌గా మారింది.
‘‘ఇది స్వేచ్ఛాయుతమైన మార్కెట్. స్కూల్ ఫీజుల ధరలు వ్యక్తులకు సంబంధించిన అంశం. తమకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవడం కస్టమర్ల స్వేచ్ఛ. ఇది కూడా చాలా సిద్ధాంతాల మాదిరిగానే. కానీ, బెంగళూరు నగరంలో ఓ మంచి ఫీజు విధానం చూడండి. ఏడాదికి రూ.50 లక్షల ఆదాయం ఉన్న ఇద్దరు ఐటీ ఉద్యోగులు, కూడా ఇద్దరు పిల్లల్ని చదివించడం అసాధ్యంగా మారిపోయింది. భారత్ వైవిధ్యాలు కలిగిన దేశం’’ అంటూ ముత్తుకృష్ణన్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
ఈ పోస్ట్ చూసి చాలా మంది తల్లిదండ్రులు షాక్‌కు గురవుతున్నారు. చక్కటి విద్య అందుకునే జాబితాలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు లేకపోవడం శోచనీయమని అంటున్నారు. అయితే, విద్యారంగం స్వేచ్ఛాయుతంగా ఉండే మార్కెట్ అని, తల్లిదండ్రులు తమ ఆర్ధిక స్థోమతను బట్టి ఎలాంటి పాఠశాల కావాలో ఎంపిక చేసుకోవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ స్కూల్ ఫీజు దేశంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఖర్చులకు అద్దం పడుతోందని అంటున్నారు.
Read Also- Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ కోచ్ బాధ్యతల నుంచి ద్రవిడ్ తప్పుకోవడానికి అసలు కారణం ఇదా!
ఆశ్చర్యం వ్యక్తం చేసిన నెటిజన్లు..
ఎక్స్‌లో యూజర్ స్పందిస్తూ, ‘‘ఈ స్కూల్ అత్యంత సంపన్న కుటుంబాల పిల్లల కోసమే. ప్రతి కుటుంబానికీ తమ పిల్లలకు మంచి విద్య అందించాలని ఉంటుంది. మధ్యతరగతి వ్యక్తిగా నేనైతే, నా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చించను. ఎందుకంటే, అక్కడి చదువు వాతావరణం బాగోదు. ఎక్కడ చేర్పించాలనేది తల్లిదండ్రుల ఆప్షన్’’ అని ఒకతను రాసుకొచ్చాడు. మరో వ్యక్తి స్పందిస్తూ, ‘‘ఐటీ వాళ్లు రూ.50 వేల జీతం సంపాదిస్తే, ఆ స్థాయిలో టీచర్లు ఎందుకు సంపాదించకూడదు. కానీ, వాస్తవం ఏంటంటే, ఎక్కువ డబ్బు మేనేజ్‌మెంట్‌కి పోతుంది. ఇది చాలా అంశాలతో కూడిన వ్యవహారం. నా సలహా ఏంటంటే, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల్ని 2 ఏళ్లపాటు ప్రభుత్వ స్కూల్‌కి పంపించాలి. అప్పుడు ప్రైవేట్ స్కూళ్లు ఖాళీ భవనాల్లా మారిపోతాయి. సరిగ్గా లేవని వ్యవస్థను సమర్థిస్తోంది ప్రజలే’’ అని విమర్శించారు.
మరో యూజర్ స్పందిస్తూ, ఇలాంటివి ధనవంతుల స్కూళ్లు అని వ్యాఖ్యానించాడు. ముంబైలో కూడా మంచిగా చదువు చెప్పే స్కూళ్లు చాలానే అందుబాటులో ఉన్నాయని, అయితే, ఎక్కడ చదివించాలనేది పూర్తిగా వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. రెడ్డిట్‌లో గతంలో ఇదే తరహా పోస్ట్ వైరల్ అయింది. బెంగళూరులోని ఒక స్కూల్‌లో ప్రీ-నర్సరీ తరగతికి వార్షిక ఫీజు సుమారుగా రూ.1.85 లక్షలు ఉందనేది ఆ పోస్టు సారాంశం. ఈ పోస్టు కూడా గతంలో బాగా వైరల్ అయ్యింది.
Read Also- Crime News: భార్య, అత్తను చంపేసిన వ్యక్తి.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!