Indore Woman: మధ్యప్రదేశ్ లో విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. ఇండోర్ లో ప్రియుడితో వెళ్లిపోయిన బీబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థిని.. మరొకరిని వివాహం చేసుకొని అందరికీ షాకిచ్చింది. రైలులో పరిచయమైన ఎలక్ట్రిషియన్ ను పెళ్లాడి.. అతడితో కలిసి తిరిగి ఇంటికి వచ్చింది. ఈ ఘటన 18 ఏళ్ల క్రితం విడుదలైన ‘జబ్ వి మెట్’ సినిమాలోని కరీనా కపూర్ – షాహిద్ కపూర్ పాత్రలను గుర్తు చేస్తుండటంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రద్ధా (Shraddha) అనే యువతి.. సార్థక్ అనే వ్యక్తిని ఇష్టపడింది. అతడ్ని పెళ్లాడేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో సార్థక్ రైల్వే స్టేషన్ కు రాకపోవడంతో ఆమె ఒంటరిగానే రట్లం (Ratlam)కు వెళ్లే రైలు ఎక్కింది. రైలులో ఆమెకు కరణ్ దీప్ (Karandeep) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొద్దిసేపట్లోనే కరణ్ దీప్ కు ఇంప్రెస్ అయిన ఆమె.. సార్థక్ ను కాకుండా అతడ్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో రట్లంలో రైలు దిగిన వెంటనే.. వారిద్దరు కలిసి మందసౌర్ కు వెళ్లారు. అక్కడి నుంచి 250 కి.మీ దూరంలో ఉన్న మహేశ్వర్ ఆలయానికి చేరుకొని అక్కడే వివాహం చేసుకున్నట్లు శ్రద్ధా తెలిపింది.
సార్థక్ ఏం చెప్పాడంటే?
వివాహం అనంతరం శ్రద్ధా, కరందీప్ నేరుగా వచ్చి ఇండోర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. పైన పేర్కొన్న విషయాలన్ని శ్రద్ధా పోలీసులకు తెలియజేసింది. దీంతో ఆశ్చర్యపోయిన పోలీసులు.. శ్రద్ధా మాటల్లోని నిజా నిజాలు తెలుసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో శ్రద్ధా మాజీ బాయ్ ఫ్రెండ్ సార్థక్ ను సంప్రదించారు. అయితే గత కొన్ని రోజులుగా తాను శ్రద్ధాకు దూరంగా ఉంటున్నట్లు అతడు తెలిపాడు. దీంతో సార్థక్ తో లేచిపోవాలన్న శ్రద్ధా ప్లాన్ ఒట్టి కట్టుకథేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
శ్రద్ధా తండ్రి ఆవేదన
మరోవైపు ఎలక్ట్రిషియన్ ను కూతురు పెళ్లిచేసుకొని రావడంపై శ్రద్ధా తండ్రి తివారి షాక్ కు గురయ్యారు. ‘ఇంటి నుంచి వెళ్లిపోయాక శ్రద్ధా నన్ను సంప్రదించింది. ఈ పెళ్లిని నేను అంగీకరించనని చెప్పాను. ఇంటికి తిరిగి రావాలని సూచించాను. ఇందుకోసం డబ్బులు సైతం ఆమెకు పంపాను. కానీ ఆమె కరణ్ దీప్ తోనే ఉండిపోయింది’ అని తండ్రి వాపోయారు. అంతేకాదు తన కుమార్తె మానసిక స్థితి బాగోలేదని అనుమానం వ్యక్తం చేశారు. ‘శ్రద్ధా ఆత్మహత్య చేసుకోవాడనికి స్టేషన్ కు వెళ్లిందని కరణ్ దీప్ చెప్పాడు. నా కూతురు మానసికంగా బలంగా లేదు’ అని తివారి తెలిపారు.
Also Read: Cardiac Surgeon dies: ఆస్పత్రిలో రౌండ్స్ చేస్తూ.. గుండె పోటుతో మరణించిన.. 39 ఏళ్ల హార్ట్ స్పెషలిస్ట్
అంగీకరించాలా? వద్దా?
ఆగస్టు 23 తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో శ్రద్ధా ఇంటి నుంచి వెళ్లిపోతుండటం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. కనీసం మెుబైల్ కూడా తీసుకెళ్లకపోవడంతో పోలీసులకు ఆమెను వెతకడం కష్టంగా మారిపోయింది. శ్రద్ధా ఆచూకీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరక్క పోలీసులు, ఆమె తల్లిదండ్రులు ఇబ్బందులు బడ్డారు. చివరికీ శ్రద్ధానే నేరుగా కరణ్ దీప్ తో కలిసి పోలీసుల వద్దకు రావడంతో ఆశ్చర్యపోయారు. అయితే కరణ్ దీప్ తో కుమార్తె పెళ్లిని అంగీకరించాలా? లేదా? అన్న సంశయంలో ప్రస్తుతం శ్రద్ధా తల్లిదండ్రులు ఉన్నారు.