Mood of Nation Survey: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచిపోయింది. ఈ 14 నెలల కాలంలో అత్యంత కీలకమైన పరిణామాలు జరిగాయి. ప్రధానంగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక సంఘర్షణ, అధిక టారిఫ్‌ల (Trump’s tariffs) కారణంగా అమెరికాతో దౌత్య సంబంధాలు సున్నితంగా మారాయి. ఇట్లాంటి పరిస్థితిలో, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి?, మోదీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందా?, విపక్షాలు పుంజుకుంటాయా?.. రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఈ సందేహాలపై ‘ఇండియా టుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్’ (Mood of Nation Survey) నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి.
ఎన్డీయేకి 324 సీట్లు..
ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి ఏకంగా 324 సీట్లు వస్తాయని ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే అంచనా వేసింది. ఇటీవలే మూడు ప్రధానమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఎన్డీఏ (NDA) కూటమి ఊపమీద ఉందని విశ్లేషించింది. 2024-పార్లమెంట్ ఎన్నికల్లో 234 సీట్లు గెలిచి ఎన్డీఏకి కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, ఇప్పుడే ఎన్నికలు జరిగితే 208 సీట్లకు పడిపోతుందని అంచనా వేసింది.
Read Also- Dharmapuri Heavy Rains: భారీ వర్షాలు వర్షాలు.. ధర్మపురిలో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి
ఈ సర్వేను జులై 1 నుంచి ఆగస్టు 14, 2025 మధ్య కాలంలో నిర్వహించినట్టు ఇండియా టుడే తెలిపింది. మొత్తం 2,06,826 మందితో మాట్లాడామని, వీరిలో 54,788 మంది తాజా సర్వేలో ప్రశ్నించామని, మిగతా 1,52,038 మంది అభిప్రాయాలను సీవోటర్ రెగ్యులర్ ట్రాకర్ డేటా ఆధారంగా తీసుకున్నామని తెలిపింది. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయి. సింగిల్‌గా అధికారాన్ని చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ 272 సీట్లకు బీజేపీ ఆమడ దూరంలో నిలిచింది. అయితే, ఎన్డీఏ భాగస్వాములతో కలుపుకొని మొత్తం 293 సీట్లు వచ్చాయి. దీంతో మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యిన విషయం తెలిసిందే.
Read Also- Chiranjeevi vs Prabhas: చిరంజీవికి పోటీగా ప్రభాస్ సినిమా.. సంక్రాంతికి ఆసక్తికర పోరు!
పార్టీల వారీగా చూస్తే, ఒంటరిగా బీజేపీకి 260 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే అంచనా వేసింది. అంటే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిగ్ ఫిగర్ 272 సీట్లు గెలుచుకోలేదని విశ్లేషించింది. ఫిబ్రవరి నెలలో బీజేపీకి ఒంటరిగా 281 సీట్లు వస్తాయని అంచనా వేయగా, ఇప్పుడు ఆ అంచనా సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఫిబ్రవరి సర్వేలో ఎన్డీయే కూటమికి మొత్తంగా 343 సీట్లు వస్తాయని లెక్కగట్టిన విషయం తెలిసిందే. కాగా, లోక్‌సభ ఎన్నికల తర్వాత విపక్షాలు సత్తా చాటడంలో విఫలమవుతున్నాయి. ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమయ్యాయి. తాజాగా, ఇండియా టుడే – సీవోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలోనూ ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.