Attack on Minister: బిహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రావణ్ కుమార్‌కు (Attack on Minister) ఊహించని పరాభవం ఎదురైంది. ఓ గ్రామానికి చెందిన జనం ఆయనపై బుధవారం ఉదయం దాడికి పాల్పడ్డారు. గతవారం జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో రాష్ట్రంలోని నలంద జిల్లా జోగిపూర్ మలవాన్ అనే గ్రామానికి చెందిన తొమ్మిది మంది చనిపోయారు. ఈ దుర్ఘటన జరిగిన వారం రోజుల తర్వాత, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రి శ్రావణ్ కుమార్ బయలుదేరారు. స్థానిక ఎమ్మెల్యేను వెంటబెట్టుకొని జోగిపూర్ గ్రామానికి చేరుకున్నారు. అయితే, ప్రమాదం జరిగిన వారం తర్వాత పరామర్శకు వెళ్లడం, బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు నష్టపరిహారం అందకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రావణ్ కుమార్ గ్రామానికి చేరుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే గ్రామస్తులంతా ఆయనను చుట్టిముట్టి, ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు.
Read Also- Pushpa 2 Ganesh Mandapam: విచిత్ర మండపం.. పుష్ప 2 స్టైల్లో, బన్నీ విగ్రహంతో.. ఇలా ఉన్నారేంట్రా!
అక్కడి పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసులు మంత్రిని, ఎమ్మెల్యేను తీసుకొని బయలుదేరారు. అయినప్పటికీ, గ్రామస్తులు వదలలేదు. మంత్రి కాన్వాయ్‌ను దాదాపు ఒక కిలోమీటర్ మేర వెంబడించారు. మంత్రిపై దాడి యత్నం చేశారు. అయితే, అక్కడే ఉన్న పోలీసులు.. మంత్రి ఒంటిపై దెబ్బపడకుండా ఆపగలిగారు. కానీ, మంత్రిని కాపాడే క్రమంలో ఓ బాడీగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతుల కుటుంబాల పట్ల ప్రభుత్వ నేతలు ఎలాంటి సానుభూతి చూపలేదని, ఇంకా ఎలాంటి పరిహారం కూడా అందించలేదని గ్రామస్తులు మండిపడ్డారు.
Read Also- Tummala Nageswara RaoL: ప్రభుత్వ ఉద్యోగులపై మంత్రి తుమ్మల గరం గరం.. చర్యలు తప్పవని హెచ్చరిక..?
ఈ ఘటనపై స్థానిక ప్రభుత్వాధికారులు కూడా స్పందించారు. మంత్రి, ఇతర నేతలు అక్కడి నుంచి బయలుదేరారని, కాన్వాయ్ అక్కడి నుంచి కదిలిన తర్వాత.. గ్రామస్తులు మూడు కార్లను దాదాపు ఒక కిలోమీటరు వరకు వెంటాడారని తెలిపారు. పోలీసులు జనాలను చెదరగొట్టారని, ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారని వెల్లడించారు. ఈ ఘటనపై జేడీయూ పార్టీ అధికార ప్రతినిధి ధనంజయ్ దేవ్ స్పందించారు. స్థానికంగా ఉండే ఓ రాజకీయ నాయకుడి పని తీరు పట్ల స్థానికులు ఆగ్రహంతో ఉన్నారని, దాడికి పాల్పడడానికి ఇదే కారణమని వివరించారు.
Read Also- Heavy Rains: దంచికొడుతున్న వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
ఈ ఘటనపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కూడా స్పందించారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంగా అధ్వాన్నంగా ఉందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. నితీశ్ కుమార్ ప్రభుత్వం విద్యార్థులను, అంగన్వాడీ, ఆశా వర్కర్లను, సర్పంచులను ఇప్పటికే దండించిందని, ఇప్పుడు ప్రజల వంతు వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓట్ల కోసం వెళ్లినప్పుడు, ప్రజలు తరిమి తరిమి కొడతారని పేర్కొన్నారు.