Rare Disorder: సాధారణంగా మనుషులను ఎన్నో రకాల వ్యాధులు బాధిస్తుంటాయి. కొందరు శారీరకంగా సమస్యలు ఎదుర్కొంటే మరికొందరు మానసికంగా ఇబ్బందులు పడతారు. ఈ క్రమంలోనే ఓ మహిళకు వింత మానసిక సమస్య వచ్చింది. దాని కారణంగా ఆమెకు ఎదురైన అనుభవాలను తెలియజేయగా.. యావత్ ప్రపంచమే నివ్వెరపోతోంది. తనకు మనుషుల ముఖాలు.. వక్రీభవించి డ్రాగన్స్, దెయ్యాల్లా కనిపిస్తున్నాయని ఆ యువతి పేర్కొంది.
వివరాల్లోకి వెళ్తే..
ప్రముఖ అంతర్జాతీయ మీడియా ది లాన్సెట్ ప్రచురించిన కథనం ప్రకారం.. ఓ మహిళకు ఈ అరుదైన సమస్య వచ్చింది. ఆమెకు తరచూ మనుషుల ముఖాలు డ్రాగన్‌లాంటి రూపాల్లోకి మారి రోజులో ఎన్నోసార్లు భ్రమ కల్పిస్తున్నాయి. ఆమె మాటల ప్రకారం ‘నేను అసలు ముఖాలను గుర్తించగలను. కానీ కొద్ది నిమిషాల తర్వాత అవి నల్లబడిపోతాయి. పొడవైన చెవులు, బయటకు వచ్చిన ముక్కు, పాముల్లాంటి చర్మం, పసుపు, ఆకుపచ్చ, నీలం లేదా ఎరుపు రంగులో పెద్ద కళ్లు కనిపిస్తాయి. రోజులో చాలాసార్లు ఇలాంటి డ్రాగన్ ముఖాలు నాకు ఎదురవుతుంటాయి’ అని తెలిపింది.
వందేళ్లలో 100 మంది కంటే తక్కువే!
మహిళకు వచ్చిన ఈ అరుదైన సమస్యను ‘డీమన్ ఫేస్ సిండ్రోమ్’ లేదా ‘ప్రోసోపోమెటామార్ఫోప్సియాస్’ (Demon face syndrome Or prosopometamorphopsias) అని పిలుస్తారు. ఇది చాలా రేర్ గా కనిపించే నాడీ సంబంధ వ్యాధి. దీని బాధితులు మనుషుల ముఖాలను వక్రీభవించినట్టుగా భయంకరంగా లేదా దెయ్యంలా చూస్తారు. వాస్తవానికి ఇతరులకు ఆ ముఖాలు సాధారణంగానే కనిపిస్తాయి. ఓ నివేదిక ప్రకారం ఇలాంటి సమస్య.. గత వందేళ్లల్లో ప్రపంచవ్యాప్తంగా 100 కంటే తక్కువ మందికే ఎదురైంది.
వ్యాధికి గల కారణాలు
ప్రోసోపోమెటామార్ఫోప్సియాస్ రుగ్మత చాలా అరుదైనది కావడంతో ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. ఈ వ్యాధి గల కారణాలను శాస్త్రవేత్తలు పూర్తిగా గుర్తించలేదు. అయితే ఓ నివేదిక ప్రకారం ఈ వ్యాధికి గల కొన్ని కారణాలు బయటకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మెదడు నష్టం (Brain damage): ముఖాలను గుర్తించడం, ప్రాసెస్ చేయడం కోసం మెదడులోని కొన్ని నెట్‌వర్కులు పనిచేస్తాయి. వీటికి నష్టం జరిగితే ముఖాలు వక్రీభవించి కనిపిస్తాయి.
స్ట్రోక్‌లు లేదా ఫిట్స్ (Strokes/Seizures): ఇవి మెదడును దెబ్బతీసి ముఖాలను గుర్తించే విధానాన్ని దెబ్బతీయవచ్చు.
ట్యూమర్లు (Tumours): కొన్నిసార్లు మెదడులో ట్యూమర్ ఉన్నప్పుడు ఈ సమస్య రావొచ్చు. కొన్ని కేసుల్లో శస్త్రచికిత్స చేసి ట్యూమర్ తొలగించిన తర్వాత లక్షణాలు మాయమయ్యాయి.
మానసిక రుగ్మతలు (Psychiatric conditions): కొంతమందిలో మెదడులో ఎలాంటి లోపం కనిపించకపోయినా వారికి స్కిజోఫ్రెనియా, బ్రీఫ్ సైకోటిక్ డిసార్డర్, చార్ల్స్ బోనెట్ సిండ్రోమ్ లేదా Alice in Wonderland సిండ్రోమ్‌లను నిర్ధారించారు.
Also Read: Rajasthan: 17వ సారి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన.. 55 ఏళ్ల బామ్మ
మైగ్రేన్ (Migraines): చాలా అరుదుగా మైగ్రేన్ సమయంలో డీమన్ ఫేస్ సిండ్రోమ్ లక్షణాలు కనిపించిన సందర్భాలు ఉన్నాయి.
మత్తు పదార్థాల వినియోగం (Drug abuse): తరచు డ్రగ్స్, నిద్ర మాత్రలు, మత్తు మందులు వాడేవారికి ఈ రకమైన సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.