Suryapet: కల్తీ మద్యం తయారీదారులకు నకిలీ లేబుళ్లు సప్లయ్ చేస్తున్న ఇద్దరిని ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో నకిలీ లేబుళ్లతోపాటు 50లక్షల రూపాయల విలువ చేసే యంత్ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏ టీం సీఐ అంజిరెడ్డి రెండు నెలల క్రితం సిబ్బందితో కలిసి సూర్యాపేటలో నకిలీ మద్యం తయారు చేస్తున్న గ్యాంగును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: Govt On Parents: తల్లిదండ్రులను విస్మరిస్తే కటకటాలే.. రోడ్డుపై వదిలేసినా క్రిమినల్ కేసులు
విచారణలో ఈ ముఠా వేర్వేరు బ్రాండ్ల మద్యం లేబుళ్లను తయారు చేయించుకుని వాటిని సీసాలపై అతికించి మార్కెట్ లోకి సరఫరా చేస్తున్నట్టుగా వెల్లడైంది. దీంట్లో కీలక నిందితునిగా ఉన్న చరణ్ జీత్ సింగ్ ను అప్పట్లో అరెస్ట్ చేశారు. విచారణలో 4కోట్ల రూపాయల విలువ చేసే స్పిరిట్ ను కృష్ణ ఇండస్ట్రీ నుంచి కొని వేర్వేరు రాష్ట్రాలకు సరఫరా చేసినట్టు చరణ్ జీత్ సింగ్ వెల్లడించాడు. ఈ క్రమంలో అతని బ్యాంక్ లావాదేవీలను సీఐ అంజిరెడ్డి విశ్లేషించారు.
యంత్ర పరికరాలను స్వాధీనం
ఈ క్రమంలో నకిలీ లేబుళ్ల యూనిట్ గురించి సమాచారం తెలిసింది. దీని ఆధారంగా కుషాయిగూడ శివసాయినగర్ ప్రాంతంలో ఉన్న ఈ యూనిట్ పై ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. పెద్ద మొత్తంలో నకిలీ లేబుళ్లతోపాటు వాటి తయారీకి వాడుతున్న యంత్ర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. యూనిట్ నడుపుతున్న గడ్డమీది ప్రకాశ్ తోపాటు నినావత్ రాజేశ్ లను అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం లేబుళ్ల తయారీ యూనిట్ గుట్టును రట్టు చేసిన సిబ్బందిని డైరెక్టర్ షానవాజ్ ఖాసీం అభినందించారు.
Also Read: Indian Railways: రైళ్లల్లో విచిత్రమైన సమస్య..15 వేలకు పైగా ఫిర్యాదులు.. మీరూ ఫేస్ చేశారా?