H-CITI Project: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్(Ttaffic), రద్దీకి చెక్ పెడుతూ సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు ప్రతిపాదించిన హెచ్ సిటీ(H-City) పనుల్లో సింహా భాగం పనులు ఎట్టకేలకు గాడీన పడనున్నాయి. గత సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో సర్కారు పరిపాలనపరమైన మంజూరీలిచ్చిన సుమారు రూ.7032 కోట్ల ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ వంటి పనులు వచ్చే నెల నుంచి స్పీడప్ కానున్నాయి. ఇప్పటికే హెచ్ సిటీ కింద ప్రతిపాదించిన పనుల్లో రూ.1090 కోట్లతో కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మించతలపెట్టిన ఆరు స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లకు ఇప్పటికే స్థల సేకరణ ప్రారంభమైనప్పటికీ, కేబీఆర్ పార్కు మొత్తం కేంద్రం ప్రకటించిన ఎకో సెన్సిటీవ్ జోన్ పరిధిలోకి వస్తుందంటూ, అక్కడి పచ్చదనాన్ని ధ్వంసం చేసేలా ఈ పనులు చేపడుతున్నారంటూ ముగ్గురు పిటిషన్ దారులు, స్థల సేకరణను సవాలు చేస్తూ మరి కొందరు ఆస్తుల యజమానులు కోర్టును ఆశ్రయించారు.
ముందుగానే గ్రహించిన జీహెచ్ఎంసీ
ఈ నేపథ్యంలో కోర్టు పరిశీలనలో ఉన్న స్థలాలు మినహా ఎలాంటి వివాదాల్లేని ముగ్ధా జంక్షన్ వంటి ప్రాంతాల్లో వచ్చే నెల మొదటి వారంలో పనులు ప్రారంభించాలని జీహెచ్ఎంసీ(GHMC) యోచిస్తున్నట్లు సమాచారం. ఎలాగో కోర్టు కేసుల వల్ల పనులు ఆలస్యం కావచ్చునన్న విషయాన్ని ముందుగానే గ్రహించిన జీహెచ్ఎంసీ రెండు నెలల క్రితమే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, టెండర్లకు సంబంధించిన ఫైనాన్షియల్ కమిటీ, టెక్నికల్ కమిటీల ఆమోదం తీసుకుని, ఎంపికైన ఏజెన్సీల జాబితాను సర్కారుకు పంపించారు. ప్రస్తుతం సర్కారు పరిశీలనలో ఉన్న ఏజెన్సీల జాబితాపై ఈ నెలాఖరు కల్లా క్లారిటీ వస్తుందని, ఆ వెంటనే పనులు మొదలుపెట్టేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వీటిలో ఎక్కువ పనులను కేఎన్ఆర్, మేగా ఏజెన్సీలు తక్కువగా కోడ్ చేసినట్లు సమాచారం.
టెండర్ల ప్రక్రియ పూర్తయిన పనులు
టెండర్ల ప్రక్రియ పూర్తయి, త్వరలోనే ప్రారంభం కానున్న పనుల వివరాలిలా ఉన్నాయి. ఖైరతాబాద్ జోన్(Khairatabad Zone) లో రూ. 210 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఎఫ్ఎఫ్ సీఎల్ జంక్షన్ ఫస్ట్ లెవెల్ ఫ్లై ఓవర్, టీవీ9 జంక్షన్ వద్ద 3 లేన్ల యూని డైరక్షనల్ అండర్ పాస్ పనులతో పాటు రూ. 837 కోట్ల వ్యయంతో శేరిలింగంపల్లి జోన్(Serilingampally Zone) లో మూడు జంక్షన్లలో గ్రేడ్ సెపరేటర్, మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్, ఖజాగూడ జంక్షన్, ఐఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల వద్ద నిర్మించే పనులు త్వరలో మొదలుకానున్నాయి. రూ.1090 కోట్ల వ్యయంతో కేబీఆర్ చుట్టూ నిర్మించనున్న ఆరు స్టీల్ ఫ్లై ఓవర్ లు, మరో ఆరు అండర్ పాస్ లలో కోర్టు పరిధిలో వివాదంగా లేని ఆస్తుల్లో ఇప్పటికే సేకరించిన స్థలంలో త్వరలో పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తుంది. కూకట్ పల్లి జోన్ పరిధిలో రూ.180 కోట్లతో జాతీయ రహదారి 65 కు కుడివైపు కూకట్ పల్లి వై జంక్షన్ లో నిర్మించనున్న మూడు లేన్ల ఫ్లై ఓవర్ పనులను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిసింది. నిత్యం ట్రాఫిక్ తో అల్లాడిపోయే రేడి బౌలీ నుంచి నానల్ నగర్ జంక్షన్ వరకు రూ.398 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్, గ్రేడ్ సెపరేటర్ కు త్వరలోనే టెండర్ల ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి కాని పనులు
రూ.530 కోట్ల వ్యయంతో మియాపూర్ క్రాస్ రోడ్(Miyapur Cross Road) నుంచి ఆల్విన్ కాలనీ వరకు నిర్మించనున్న మూడు లేన్ల ఫ్లై ఓవర్, లింగంపల్లి(Lingam Pally) నుంచి గచ్చిబౌలీ(Gachibowli) వరకు నిర్మించనున్న అండర్ పాస్ కు రైల్వే శాఖ నుంచి ఇంకా క్లారిటీ రావల్సి ఉన్నందున ఈ పని ప్రారంభమయ్యేందుకు ఇంకా సమయం పట్టనున్నట్లు తెలిసింది. పైగా ఈ పనికి ఇంకా రోడ్డు విస్తరణ కూడా పూర్తి కాలేదని తెలిసింది. శేరిలింగంపల్లి జోన్ లో రూ.124 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్వోబీ పనులకు కూడా రైల్వే శాఖ నుంచి క్లారిటీ రావల్సి ఉన్నట్లు తెలిసింది. రోజురోజుకి పెరరగుతున్న ట్రాఫిక్ కారణంగా ఐటీ కారిడార్ కు రాకపోకలు మరింత సులువు చేసేందుకు గాను రోడ్ నెంబర్ 12లోని విరించి హాస్పిటల్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పొస్టు వరకు వంద ఫీట్ల నుంచి 120 ఫీట్లకు రోడ్డు విస్తరణకు ఇప్పటికే మార్కింగ్ చేసిన అధికారులు పలు ఆస్తుల నుంచి స్థలాలను కూడా సేకరించగా, మరి కొన్ని ఆస్తుల నుంచి ఇంకా స్థలాలను సేకరించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
Also Read: Jangaon district: సర్కారు సాయంతో సోలారు వెలుగులు.. కలెక్టర్ కీలక వ్యాఖ్యలు