Cheteshwar Pujara: భారత క్రికెట్ జట్టు యొక్క టెస్ట్ బ్యాటింగ్ దిగ్గజం చతేశ్వర్ పుజారా, తన 15 ఏళ్ల అద్భుత కెరీర్‌కు ముగింపు పలికారు. 37 ఏళ్ల పుజారా, ఆదివారం (ఆగస్టు 24, 2025) సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించారు. “భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం ఆలపించడం, మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ నా శక్తిమేరకు ఆడడం. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. కానీ, అన్ని మంచి విషయాలకు ముగింపు ఉంటుందన్నట్లు, నేను భారత క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఇన్నేళ్ళు నా మీద మీరు ప్రేమ చూపిస్తూ సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ” అని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాశారు.
పుజారా తన 13 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో 103 మ్యాచ్‌లు ఆడి, 43.60 సగటుతో 7,195 పరుగులు చేశారు. 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో నంబర్ 3 స్థానంలో రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసి, భారత టెస్ట్ బ్యాటింగ్‌లో సుదీర్ఘకాలం స్థిరత్వాన్ని అందించారు. 2010లో ఆస్ట్రేలియాతో బెంగళూరులో టెస్ట్ డెబ్యూ చేసిన పుజారా, 2018-19, 2020-21లో ఆస్ట్రేలియాలో భారత్ టెస్ట్ సిరీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
Also Read: Viral Video: నిర్మానుష్య వీధిలో వెళ్తోన్న వ్యక్తి.. మీదకు దూసుకొచ్చిన 7 కుక్కలు.. తర్వాత జరిగిందిదే!
ముఖ్యంగా, 2018-19 సిరీస్‌లో 521 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచారు. 2005లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పుజారా, గత రంజీ ట్రోఫీ సీజన్‌లోనూ ఆడారు. ఆస్ట్రేలియాపై 49.38 సగటుతో 5 సెంచరీలు సాధించిన ఆయన, టెస్ట్ క్రికెట్‌లో భారత్‌కు అనేక విజయాలను అందించారు. అయితే, 2023 జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత జాతీయ జట్టులో స్థానం కోల్పోయారు.