River In China: చైనాలో భౌగోళిక పరిస్థితులు చాలా విభిన్నంగా ఉంటాయి. అందుకే అక్కడి భూ స్వరూపాలు, అద్భుతమైన ప్రకృతి అందాలు పర్యాటకులను (River In China) అమితంగా ఆకట్టుకుంటుంటాయి. సాహసప్రియులనైతే మరింతగా ఆకర్షిస్తుంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ నుంచి టెర్రకోట్ ఆర్మీ (మట్టి సైనికుల విగ్రహాల సమాహారం) వరకు ప్రతి ఒక్కటీ చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. పర్యాటకులను మంత్రముగ్దులను చేయడమే కాకుండా, ప్రత్యేకమైన అనుభవాన్ని మిగుల్చుతాయి. చైనాలో ప్రకృతి అద్భుతాల్లో క్వియాన్తాంగ్ నది (Qiantang River) కూడా ఒకటి. ఈ నది కొన్ని సందర్భాల్లో అత్యంత అరుదైన రీతిలో వెనక్కి (రివర్స్‌లో) ప్రవహిస్తుంది. ఆశ్చర్యం కలిగించే రీతిలో సముద్రం వైపు నుంచి వెనక్కి ప్రవహించడమే ఈ నది విశేషం.
Read Also- Rohit – Virat: కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్‌పై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన
‘టైడల్ బోర్’ (Tidal Bore) అనే ప్రకృతి ప్రక్రియ కారణంగా ఈ అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. ప్రపంచంలో కొన్ని నదుల్లో మాత్రమే ఈ దృగ్విషయం జరుగుతుంది. ప్రస్తుతం చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో క్వియాన్తాంగ్ నదిలో ఇది సాక్షాత్కారమైంది. ‘టైడల్ బోర్’ అంటే సముద్ర అలల కారణంగా జరిగే సహజ ప్రక్రియ. సముద్రంలో కలిసే నదిలో, ఆ నదిముఖం (mouth) చాలా ఇరుగా ఉండి, సముద్రపు అలలు చాలా ఎక్కువ (6 మీటర్లకు పైగా) ఉన్నప్పుడు ‘టైడల్ బోర్’ జరుగుతుంది. ఇదే సమయంలో, నది లోతు తక్కువగా కూడా ఉండాలి. అప్పుడు నది ప్రవాహ దిశ రివర్స్‌లో మారుతుంది. సముద్రం వైపు కాకుండా, నదిలోని నీరు ఉప్పొంగి, వెనక్కి ప్రవహిస్తుంది. భారీ సముద్ర అలల కారణంగా నదిలోని నీటిమట్టం పెరిగిపోయి వ్యతిరేక దిశలో ప్రవాహం మొదలవుతుంది. ఈ ప్రక్రియ చూడడానికి చాలా అద్భుతంగా, ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Read Also- Donald Trump: భారత రాయబారిగా సన్నిహితుడి పేరు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
క్వియాన్తాంగ్ నదిలో ఏర్పడే సముద్ర తరంగాలు కొన్నిసార్లు 30 అడుగుల ఎత్తు వరకు చేరుకుంటాయి. ఇవి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ముందుకు దూసుకెళ్తాయి. ఈ తరంగాలు నదిపై ప్రభావం చూపించడానికి కొన్ని గంటల ముందే భారీ శబ్దాలు వినిపిస్తాయి.ఓ భీకరమైన ప్రకృతి శబ్దాలు వినిపిస్తాయి. ఈ తరంగాలు తగ్గిపోయిన తర్వాత కూడా నీటి మట్టం కొన్ని గంటలపాటు చాలా ఎక్కువగానే ఉంటుంది. అద్భుతమైన ఈ ప్రకృతి సదృశ్యాన్ని స్థానికులు ‘సిల్వర్ డ్రాగన్’ (Silver Dragon) అని పిలుస్తారు. ఈ ప్రక్రియ ప్రతి పౌర్ణమి (Full Moon) రోజున జరుగుతుంది. అయితే, శరదృతువులో (Autumn) ఇది అద్భతంగా అనిపిస్తుంది.
ఈ ప్రకృతి అద్భుతాన్ని చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో నదీ తీరాలకు తరలి వెళుతున్నారు. ఈ సందర్భంగా, వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక పండుగను కూడా అక్కడ జరుపుకుంటారు. ప్రతి ఏడాది సుమారు 1,70,000 పర్యాటకులు ఈ పండుగను చూడటానికి అక్కడికి వెళుతుంటారని అంచనాగా ఉంది. జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమని చూసిన పర్యాటకులు చెబుతుంటారు. చూసే అవకాశం వస్తే అసలు మిస్ కావొద్దని అంటున్నారు.