Hyderabad: సంచలనం సృష్టించిన 12 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు అధికారుల చేతికి ఓ కీలక క్లూ దొరికింది. హత్య జరిగిన రోజున సహస్ర కుటుంబం నివాసముంటున్న అపార్ట్మెంట్ గేటు వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి నిలబడి ఉండటం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు విశ్లేషిస్తున్నారు. అయితే, విజువల్స్ స్పష్ఠంగా లేకపోవటంతో పోలీసులు ఆ ఫుటేజీని కంప్యూటర్ ఎక్స్‌పర్ట్స్‌కు చూపించి రికార్డయిన దృశ్యాలు స్పష్టంగా కనిపించేలా చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం.
Also Read: Crime News: దారుణం మహిళను బెదిరించిన కానిస్టేబుల్.. ఒప్పుకోకపోతే చంపేస్తానంటూ..!
కూకట్‌పల్లి(Kukatpally) సంగీత్ నగర్‌లో నివాసముంటున్న సహస్రను ఆమె కుటుంబం అద్దెకు ఉంటున్న ఇంట్లోనే అగంతకుడు కత్తితో పొడిచి పొడిచి చంపిన విషయం తెలిసిందే. దారుణం జరిగి మూడు రోజులైనా కేసు ఇప్పటికి మిస్టరీగానే మిగిలి ఉంది. సహస్ర కుటుంబం అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ రెండో అంతస్తులో నివసిస్తున్న ఒడిషాకు చెందిన ఓ వ్యక్తితోపాటు పోలీసులు దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయినా, కేసులోని చిక్కుముడి మాత్రం వీడలేదు. ఇక, నేరస్థలం నుంచి సేకరించిన వేలిముద్రల ఆధారంగా విచారణ జరిపినా ఫలితం రాలేదు. హత్య జరిగిన రోజు నుంచి 5 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నా కేసులోని మిస్టరీ ఛేదించడానికి పనికొచ్చే ఒక్క క్లూ కూడా పోలీసుల చేతికి చిక్కలేదు.
సీసీ ఫుటేజీతో..
ఈ పరిస్థితుల్లో గురువారం తాజాగా వెలుగు చూసిన ఓ సీసీ కెమెరా ఫుటేజీ కేసులోని చిక్కుముడులను విప్పుతుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. దీంట్లో హత్య జరిగిన రోజున సహస్ర కుటుంబం ఉంటున్న అపార్ట్మెంట్ వద్ద అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ వ్యక్తి కదలికలు రికార్డయ్యాయి. సదరు వ్యక్తి గేటు తీసుకుని బయటకు రావటానికి రెండుసార్లు ప్రయత్నిస్తూ కనిపించాడు. అయితే, అదే ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళ వాకిలి ఊడుస్తూ కనిపించటంతో గేటు పైనుంచి తొంగి చూసి ఆ వ్యక్తి వెనక్కి వెళ్లిపోయాడు. ఇదంతా సహస్ర కుటుంబం ఉంటున్న అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న ఇంటికి సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. అయితే, ఫుటేజీలో సదరు వ్యక్తి స్పష్టంగా కనిపించట్లేదు. కొద్దిగా తల పైకెత్తి గేటు పైనుంచి బయటకు తొంగి చూడటం, ఆ వెంటనే వెనక్కి వెళ్లి పోవటం రికార్డయ్యింది. సదరు వ్యక్తి ముఖం కూడా స్పష్టంగా కనిపించట్లేదు.
తగాదాలు ఉన్నాయా?
కంప్యూటర్ నిపుణుల సహాయంలో వీలైనంత క్లియర్‌గా ఫుటేజీలోని దృశ్యాలు కనిపించేలా చేయాలని అధికారులు భావిస్తున్నారు. అవసరమైతే స్కెచ్ఆర్టిస్టుల సహాయంతో సదరు వ్యక్తి ఊహాచిత్రాన్ని రూపొందించాలని అనుకుంటున్నారు. ఇక, సహస్ర కేసులో దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్న పోలీసులు గురువారం ఆ చిన్నారి తల్లిదండ్రులను కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. కుటుంబంలో ఏవైనా గొడవలు నడుస్తున్నాయా? అన్న దానిపై సహస్ర తల్లిదండ్రులను వేర్వేరుగా ప్రశ్నించారు. దాంతోపాటు బంధువులు ఎవరితోనైనా తగాదాలు ఉన్నాయా? అన్నదానిపై ఆరా తీశారు. కేసు గురించి మాట్లాడగా విచారణ కొనసాగుతోందని, త్వరలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వ్యక్తిని పట్టుకుంటామన్న విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Crime News: కన్నతల్లి కర్కశత్వం.. సొంత బిడ్డపైనే దారుణం!