GHMC – Hydraa: చినుకుపడితే చాలు ముంపునకు గురయ్యే అమీర్ పేట(Ameer Peet), మైత్రివనం ప్రాంతాలను వరద ముప్పుు నుంచి రక్షించటం ఎలా? అన్న అంశంపై గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ(GHMC), హైడ్రా(Hydraa) జాయింట్ గా సమాలోచనలు చేస్తున్నాయి. అమీర్ పేట్, మైత్రి వనం ఏరియాలు ముంపుకు గురికాకుండా చేపట్టాల్సిన చర్యలపై సంయుక్తంగా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే పలు మార్లు జీహెచ్ఎంసీ(GHMC), హైడ్రా వేర్వేరుగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, ముంపు నివారణకు పరిష్కార మార్గాలను అన్వేషించారు. వరద ముంపు సమస్యలు ఉత్పన్నం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు.
క్షేత్ర స్థాయిలో కసరత్తులు
తాజాగా గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్,హైడ్రా కమిషనర్ ఎ వి రంగనాథ్(Hydra Commissioner A V Ranganath), జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్, సాంకేతిక కన్సల్టెంట్ లతో కలసి అమీర్ పేట్, మైత్రి వనం ఏరియాల్లో పర్యటించారు. అమీర్ పేట్,మైత్రి వనం పరిసరాల్లో వరద కాలువలకు ఉన్న ఆటంకాలను జీహెచ్ఎంసీ ,హైడ్రా కమిషనర్ లు జాయింట్ గా పరిశీలించారు. అమీర్ పేట మెట్రో స్టేషన్ , మైత్రి వనం దగ్గర వరద ఉధృతిని శాశ్వతంగా కట్టడి చేయడానికి ఉన్న అవకాశాలను క్షేత్ర స్థాయిలో కసరత్తులు చేశారు. జూబ్లీ హిల్స్,వెంకటగిరి, రహ్మత్ నగర్, యూసుఫ్ గూడ, ప్రాంతాల నుంచి కృష్ణ కాంత్ పార్క్ మీదుగా ప్రవహించే కాలువ గాయత్రి నగర్ వద్ద ఉన్న నాలాలో కలుస్తుంది.
Also Read: Ganesh Immersion Process: గణేష్ నిమజ్జనంపై బల్దియా ఫోకస్.. భారీగా ఏర్పాట్లు
భారీగా వరద రావడంతో
ఈ ప్రాంతాలతో పాటు ఇటివలే మధురానగర్,శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుంచి భారీగా వరద రావడంతో రోడ్డు మొత్తం మునిగిపోయింది.అమీర్ పేట మెట్రో, మైత్రివనం ప్రాంతం వరద నీటితో నిండిపోయింది. 40 అడుగుల వెడల్పుతో పై నుంచి వచ్చిన వరద కాలువలు అమీర్ పేట, ఎస్ఆర్ నగర్ మెయిన్ రోడ్డు దాటే సమయంలో 10 అడుగులకు కుంచించుకుపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కుచించుకుపోయిన నాలా వెడల్పు చేయడంతో పాటు భవిష్యత్తులో ముంపు సమస్యలు పునరావృతం కాకుండా డ్రైన్ రీ – మోడలింగ్ (నాలా పునర్నిర్మాణం) కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.