Bhupalpally district
వరంగల్, స్వేచ్ఛ: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో (Bhupalpally district) వాగులు, వంకలు పొంగిపొర్లుతూ జలమయంగా మారాయి. నీరు పారుతున్న రహదారులపై ప్రజల ప్రయణాలు ఇబ్బందికరంగా మారాయి. భూపాలపల్లి జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,79,860 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. పూర్తిస్థాయిలో 85 గేట్లు తెరిచి అధికారులు నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలుగా ఉంది. ఇక, ఎడతెరిపిలేని వర్షానికి జన జీవనం స్తంభించింది.
నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు రెండవ, మూడవ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓబీ వెలికితీత పనులు నిలిచిపోయాయి. వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో వరద నీరు చేరింది. పని స్థలాలు బురదమయం కావడంతో బొగ్గు ఉత్పత్తి చేసే యంత్రాలు, డోజర్,లు టిప్పర్లు, ఫుక్లింగ్ తదితర యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో, భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని 2 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో రోజుకు సుమారుగా 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా సింగరేణి సంస్థకు రోజుకు రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం జరుగుతోంది. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో చేరిన వర్షపు నీటిని ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద మోటార్లతో బయటికి పంపుతున్నారు. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో ఆగస్టు నెలలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 2.75 లక్షల టన్నులు, కాగా ఓబీ రిమూవల్ 23.5 ఎల్‌బీసీఎంగా ఉంది. దీంతో, బొగ్గు ఉత్పత్తి లక్ష్యం చేరుకోవటానికి అధికారులు చర్యలు చేపట్టారు. కార్మికుల గైర్హాజరు శాతం తగ్గించి యంత్రాల పని గంటలు పెంచి ఉత్పతి ఉత్పాదకపై ప్రత్యేక దృష్టి సారించారు. భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి అన్ని బొగ్గు బావులపై, మల్టీ డిపార్ మెంటల్ అధికారులతో, కార్మికులతో సమావేశం నిర్వహిస్తూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యం చేరుకునేలా చర్యలు చేపట్టారు.

Read Also- Brahmanandam: నా దృష్టిలో అందమైన హీరో ఎవరో తెలుసా?.. బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు
ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాలలో రోడ్లపై ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దీంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు నీరు పారుతున్న రహదారులపై ప్రయాణాలు చేయకుండా పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం మహా ముత్తారం మండలంలోని ముత్తారం – యామనపల్లి కేశవాపూర్ – పెగడపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న పెద్దవాగు ప్రాంతాన్ని పరిశీలించారు.
Read Also- HHVM OTT: షాకింగ్ సర్‌ప్రైజ్.. ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘వీరమల్లు’.. ఇంకొన్ని గంటల్లోనే!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పొంగుతున్న వాగులపై ప్రజలు ప్రయాణాలు చేయకుండా ట్రాక్టర్లతో భారీ కేండింగ్ ఏర్పాటుతో పాటు రెవెన్యూ, పోలీస్, పంచాయతి శాఖల అధికారులు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాగుల్లో చేపలు పెట్టేందుకు ప్రజలు వెళ్ళొద్దని సూచించారు. రహదారిపై నీళ్లు పారుతున్నందున ప్రజల రావాణా ఏ విధముగా చేస్తున్నారని పంచాయతి రాజ్, ఆర్ అండ్ బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అజాం నగర్ మీదుగా వెళ్తున్నారని ప్రయాణం చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ ఎం శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈ ఈ రమేష్, పీఆర్ డిఈ రవీందర్, ఎంఈఓ రవీందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏ ఓ అనూష పాల్గొన్నారు.