Hydraa: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాధాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను తొలగించింది. 22.20 ఎకరాలలో దాదాపు 100 ప్లాట్లతో అనుమతి పొందిన ఈ లే ఔట్‌లో 4 పార్కులుండగా,రెండు కబ్జా(దాదాపు 8 వేల 500 గజాలు)కు గురయ్యాయి. అలాగే 5 వేల గజాల మేర రోడ్డు కూడా కబ్జా అయినట్లు హైడ్రాకు ఫిర్యాదు అందింది. వీటికి తోడు దాదాపు 300ల గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హోటల్ షెడ్డును కూడా హైడ్రా గురువారం తొలగించింది. ఇలా మొత్తం 16000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ దాదాపు రూ.400ల కోట్ల వరకు ఉన్నట్లు హైడ్రా వెల్లడించింది.
అధికారులు కబ్జాలు
1995లో అనుమతి పొందిన ఈ లే ఔట్ ను 2006లో ప్రభుత్వం రెగ్యులరైజ్ కూడా చేసింది. ఈ లే ఔట్ ప్రకారం జీహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్కులను జైహింద్‌రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారంటూ జూబ్లీ ఎన్‌క్లేవ్ లే ఔట్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఇటీవలే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో విచారించిన హైడ్రా అధికారులు కబ్జాలు వాస్తవమేనన్న విషయాన్ని నిర్ధారించుకున్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు వాటిని గురువారం తొలగించారు. హైడ్రా ఏసీపీ శ్రీకాంత్ , ఇన్ స్పెక్టర్ రాజశేఖర్,బాలగోపాల్ నేతృత్వంలో ఈ కూల్చివేతలు జరిగాయి. కబ్జాల నుంచి రక్షించిన స్థలానికి వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు సూచిస్తూ బోర్డులు కూడా పెట్టారు. పార్కులు, ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. కబ్జాకు పాల్పడ్డవారిపై పోలీస్ కేసులు కూడా పెడుతున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు.
Also Read: Udaya Bhanu: వాళ్ళకి త్వరలో నేనేంటో చూపిస్తా.. గుట్టు మొత్తం బయట పెడతా.. ఉదయభాను
నాలుగు చోట్ల ఆక్రమణల తొలగింపు
లే ఔట్ ప్రకారం ఉన్న 4 పార్కుల్లో 2 పార్కులు, ఒక రహదారి, ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్టు నిర్థారించిన హైడ్రా గురువారం ఈ మేరకు చర్యలు తీసుకుంది.హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ రహదారికి ఆనుకుని మెటల్ చార్మినార్ కు ఎదురుగా దాదాపు 300 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, అనుమతి లేకుండా హోటల్ నిర్మించి అద్దెలను జైహింద్‌రెడ్డి తీసుకుంటున్నట్లు గుర్తించారు. అదే స్థలంలో భారీ ప్రకటనల హోర్డింగ్ కూడా పెట్టి రెండింటి ద్వారా నెలకు రూ.4 లక్షల వరకూ ఆదాయం పొందుతున్నట్లు జూబ్లీ ఎన్‌క్లేవ్ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు హైడ్రా వెల్లడించింది.
ప్రభుత్వానికి చెందుతుందని
ప్రభుత్వ స్థలంలో హోటల్‌ను నిర్మించి అద్దె వసూలు చేస్తున్న వైనంపై గతంలో జీహెచ్ఎంసీ నోటీసులు కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2006లో రెగ్యులరైజ్ అయిన లే ఔట్ అక్కడి ప్లాట్ యజమానులకు తెలవకుండా తర్వాత ఎలా రద్దవుతుందని ఫిర్యాదుదారులు వాపోయారు. యూఎల్‌సీ ల్యాండ్ అయితే ప్రభుత్వానికి చెందుతుందని, మధ్యలో జైహింద్‌రెడ్డిది ఎలా అవుతుందని ఎన్‌క్లేవ్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసారు. యూఎల్‌సీ ల్యాండ్ తన సొంతం అయితే ప్లాట్ల జోలికి రాకుండా, పార్కులే ఎలా జైహింద్‌రెడ్డివి అవుతాయని ప్రశ్నించారు. జైహింద్‌రెడ్డిపై చాలా వరకు ల్యాండ్ గ్రాబింగ్ కేసులున్నాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. పార్కులను కాపాడిన హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. చుట్టూ ఐటీ కార్యాలయాలు, నివాసాలు ఉన్న ప్రాంతంలో పార్కులను కాపాడి, ఇక్కడివారికి హైడ్రా ఊపిరి అందించిందని పేర్కొన్నారు.