Ind vs Pak: పాకిస్థాన్‌తో భారత్ క్రికెట్ సంబంధాలపై (Ind vs Pak) కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లు, క్రీడా ఈవెంట్లు ఉండబోవని క్లారిటీ ఇచ్చింది. కేవలం ఆసియా కప్‌లో (Asia Cup 2025) పాల్గొనేందుకు మాత్రమే భారత క్రికెట్ జట్టుకు అనుమతి ఇస్తున్నామని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు కొనసాగించకూడదన్న సుస్పష్టమైన వైఖరిని గత కొంతకాలంగా కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా ఓ ఉన్నతాధికారి ప్రస్తావించారు. భారత టీమ్‌లు పాకిస్థాన్ వెళ్లబోవని, అలాగే పాక్ జట్లకు కూడా భారత్‌లో ఆతిథ్యం ఇవ్వబోమనంటూ సదరు అధికారి స్పష్టం చేశారు. ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు కొనసాగించకూడదన్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.
ఆసియా కప్ 2025లో భారత్ జట్టు పాల్గొనడాన్ని అడ్డుకోబోమని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి ఓ జాతీయ మీడియా సంస్థకు తెలిపారు. ఆసియా కప్‌ను ‘ఏషియన్ క్రికెట్ కౌన్సిల్’ నిర్వహిస్తోందని ఈ సందర్భంగా ఆ అధికారి గుర్తుచేశారు. కాగా, ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం, లీగ్ దశలో సెప్టెంబర్ 14న భారత్ – పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. నాకౌట్ దశలో సెప్టెంబర్ 21న, ఇరుజట్లూ ఫైనల్ చేరితే మరోసారి సెప్టెంబర్ 29న కూడా దాయాదుల మధ్య పోరు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఇది ప్రాక్టీస్ మాదిరిగా పనికొస్తుందని ఆసియా టీమ్‌లు భావిస్తున్నాయి.
Read Also- Shreyas Iyer Father: ఆసియా కప్‌లో అయ్యర్‌కు చోటు దక్కకపోవడంపై అతడి తండ్రి సంచలన వ్యాఖ్యలు
విధానపరంగా స్పష్టత
అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు సంబంధించి తాజాగా రూపొందించిన విధానంలో భారత్-పాక్ క్రీడా సంబంధాలపై ఈ విధంగా కేంద్రం స్పష్టంగా పేర్కొంది. పాకిస్థాన్‌తో క్రీడా సంబంధాల విషయంలో భారతదేశపు విధానం , మన దేశం అనుసరిస్తున్న సాధారణ విధానానికి ప్రతిబింబంగా ఉంటుంది. ఇరుదేశాల్లో జరిగే ద్వైపాక్షిక క్రీడా ఈవెంట్లు జరగవు. పాకిస్థాన్‌లో జరిగే క్రీడా పోటీల్లో భారత జట్లు పాల్గొనవు. అంతేకాదు. భారత్‌లో నిర్వహించే పోటీలకు పాకిస్థాన్‌ను ఆహ్వానించేది లేదు. అయితే, అంతర్జాతీయ లేదా బహుళ జాతీయ క్రీడా ఈవెంట్ల విషయంలో, అవి భారతదేశంలో జరిగినా, విదేశాల్లో జరిగినా మన దేశ క్రీడాకారుల ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం ఉంటుంది.అంతర్జాతీయ క్రీడా సంస్థల నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు మన దేశం నమ్మదగిన వేదికగా ఎదుగుతున్న క్రమంలో భారత్‌లో నిర్వహించబడే మల్టీ నేషనల్ స్పోర్ట్స్ టోర్నమెంట్లలో పాకిస్థాన్ జట్లు, ఆటగాళ్లు కూడా పాల్గొనవచ్చు’’ అని క్రీడా విధానంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
Read Also- Congress MLA Resign: కేరళ కాంగ్రెస్‌లో నటి కలకలం.. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి రాజీనామా
అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు దేశంలో జరుగుతుండడాన్ని దృష్టిలో ఉంచుకొని… క్రీడాకారులు, టీమ్‌లకు చెందిన అధికారులు, టెక్నికల్ నిపుణులు, అంతర్జాతీయ క్రీడా సంస్థల ప్రతినిధులకు వీసా జారీ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేయనుంది. ఈ మేరకు నూతన క్రీడా విధానంలో పేర్కొంది. అంతర్జాతీయ క్రీడా సంస్థల కార్యదర్శులు, అధికారులకు వారి పదవీకాలాలు పూర్తయ్యే వరకు, అంటే గరిష్టంగా ఐదేళ్లపాటు పలుమార్లు భారత్ వచ్చేందుకు వీలుగా మల్టీ ఎంట్రీ వీసాలు మంజూరు చేయాలని నిర్ణయించింది.
వరల్డ్ కప్‌లలో దాయాదుల సమరాలు
కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులు ద్వైపాక్షిక సిరీస్‌లకు మాత్రమే పరిమితం అవుతాయి. కాబట్టి, వరల్డ్ కప్‌లు, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్‌లకు ఈ నిబంధనలు వర్తించవు. ఈ గేమ్స్ అంతర్జాతీయ క్రీడా సంస్థల ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి అలాంటి క్రీడా పోటీల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. ఈ తరహా టోర్నమెంట్లు తటస్థంగా లేదా తృతీయ దేశాల్లో జరుగుతుంటాయన్న విషయం తెలిసిందే.