Live Worm In Eye: ప్రస్తుత సాంకేతిక యుగంలో కంటి చూపు సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం, అదే పనిగా సెల్ ఫోన్ చూడటం వల్ల కంటి సమస్యలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ కు చెందిన ఓ వ్యక్తికి కంటి సమస్య ఎదురైంది. చూపు మసకబారడంతో పాటు కన్ను ఎర్రగా మారడంతో కాంటాక్ట్ లెన్స్ సమస్య అనుకున్నాడు. అయితే వైద్యులను సంప్రదించి.. కంటి పరీక్ష చేయించుకోగా అతడికి షాకింగ్ విషయం తెలిసింది. అతడి కంటిలో ఓ పురుగు సజీవంగా కదులుతూ కనిపించింది.
వివరాల్లోకి వెళ్తే..
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ (New England Journal of Medicine)లో ప్రచురితమైంది. దాని ప్రకారం తమ వద్దకు వచ్చిన బాధితుడికి వైద్యులు కంటి పరీక్ష చేశారు. అతడి ఎడమ కంటిలో లెన్స్, రెటీనా మధ్య జెల్ లాంటి పదార్థం (vitreous humor) ఉండటాన్ని వారు గమనించారు. అది కదులుతుండటాన్ని చూసి పరాన్నజీవిగా నిర్ధారించారు. అదే సమయంలో రోగి కంటి చూపు 20/80కి పడిపోవడాన్ని కూడా గుర్తించారు. దీంతో పురుగును తొలగించడంతో పాటు కొత్త లెన్స్ ను అమర్చాల్సి ఉంటుందని బాధితుడికి తెలియజేశారు.
శస్త్రచికిత్స – పురుగు తొలగింపు
కంటిలో సజీవంగా కదులుతున్న పురుగును తొలగించేందుకు వైద్యులు ‘పార్స్ ప్లానా విట్రెక్టమీ’ (pars plana vitrectomy) అనే ప్రత్యేక శస్త్రచికిత్స చేశారు. ఇది సాధారణంగా రెటినా సమస్య ఉన్నవారికి చేస్తుంటారు. చికిత్సలో భాగంగా కంటి తెల్లటి పొరపై ఉన్న పురుగును సక్షన్ టూల్ సహాయంతో నెమ్మదిగా బయటకు తీశారు. అనంతరం దాన్ని సూక్ష్మదర్శినిలో పరీక్షించగా.. అది గ్నాథోస్టోమా స్పినిగెరుమ్ (Gnathostoma spinigerum) అనే పరాన్న జాతి జీవి అని తేలింది. సరిగా వండని మాంసం తినడం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతుందని వైద్యులు తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ ను గ్నాథోస్టోమియాసిస్ (gnathostomiasis) అంటారని పేర్కొన్నారు.
కంట్లోకి ఎలా చేరిందంటే?
గ్నాథోస్టోమా స్పినిగెరుమ్ లార్వా మొదట ఆహారం ద్వారా కడుపులోకి చేరుతుంది. అక్కడి నుంచి ప్రేగుల గుండా ఇతర శరీర భాగాల వద్దకు ప్రయాణిస్తుంది. కంటికి మాత్రమే కాకుండా మెదడులోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు అది ప్రాణాంతకమవుతుంది. అదృష్టవశాత్తు ఈ రోగిలో పురుగు మెదడుకు చేరకముందే బయటికి తీసేశామని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగికి ఆంటి-పరాసిటిక్ మందులు, స్టెరాయిడ్లు అందించినట్లు చెప్పారు. అయితే 8 వారాల తర్వాత కంటి వాపు తగ్గింది గానీ చూపు మెరుగయ్యేందుకు మరికొంత సమయం పట్టొచ్చని బాధితుడు తెలిపారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కేబుల్ వైర్లపై స్పందించిన ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
ముంబైలో మరో కేసు
ఈ ఏడాది మేలో ముంబయికి చెందిన కంటి నిపుణురాలు డాక్టర్ దేవాంశి షా (Dr Devanshi Shah).. 60 ఏళ్ల వ్యక్తి కంట్లోనుంచి 10 సెంటీమీటర్ల పొడవైన పురుగును తొలగించారు. కంటి నొప్పి, చూపు సమస్యతో ఆ వ్యక్తి తమ వద్దకు వచ్చినట్లు డాక్టర్ షా తెలిపారు. ‘ఆ పురుగును తీసివేయకపోతే అది హృదయం వద్దకు వెళ్లి కార్డియోవాస్క్యులర్ సమస్యలు కలిగించే ప్రమాదం ఉంది. మెదడులోకి వెళ్ళినా ప్రాణాంతకమవుతుంది’ అని అన్నారు. శస్త్రచికిత్స తర్వాత ఆ రోగికి చూపు తిరిగి రావడంతో పాటు కంటి నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని స్పష్టం చేశారు.