Swetcha Effect: విద్యుత్ స్తంభాలపై ప్రాణాంతకంగా మారిన వైర్లను వెను వెంటనే తొలగించాలంటూ స్వేచ్ఛ రాసిన కథనంపై ప్రభుత్వం స్పందించింది. ‘తీగలా.. యమ పాశాలా?’ అంటూ ఇవాళ (ఆగస్టు 19) కేబుల్ వైర్లపై స్వేచ్ఛ కథనాన్ని ప్రచురించింది. ఈ క్రమంలో విద్యుత్ శాఖ ఉన్నాతాధికారులతో సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka).. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనవసర కేబుల్ వైర్లను తొలగించాలని సూచించారు. మానవీయ కోణంలో ఆలోచించి కేబుల్ వైర్లను తొలగించాలని గత సంవత్సర కాలంగా కేబుల్ ఆపరేటర్లకు పలుమార్లు నోటీసులు ఇచ్చామని తెలిపారు. కావలసిన సమయం ఇచ్చినా.. వారు స్పందించకపోవడంతో ప్రజల ప్రాణానికి ముప్పు ఏర్పడిందని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కఠిన చర్యలు తీసుకోండి’
ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న కేబుల్ వైర్లను ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని భట్టి విక్రమార్క అన్నారు. అధికారులు, సిబ్బంది విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్తు కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే అధికారులు, సిబ్బంది వెంటనే కఠినంగా స్పందించాలని వాటిని తొలగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ కనక్షన్ తీసుకునేవారు విద్యుత్ శాఖ సిబ్బంది సహాయంతోనే ఏర్పాటు చేసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తుల ద్వారా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం మూలంగా ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం అన్నారు.
అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ
హైదరాబాద్ మహానగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు సంబంధించి కన్సల్టెంట్ సమర్పించిన డిపిఆర్ (డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) పై సమావేశంలో చర్చించారు. సాగునీరు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వివిధ ఎత్తిపోతల పథకాల కింద విద్యుత్ సరఫరా, వినియోగం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్, జెన్కోసిఎండి. హరీష్, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫారుకి, ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Power Cables Hyderabad: ఫ్లైఓవర్ల పైనా కుప్పలుగా కేబుల్ వైర్లు.. ఇంటర్నెట్ టెలిఫోన్ వైర్లతో ప్రమాదాలు
పెను విషాదాలు!
హైదరాబాద్ లో టెలిఫోన్ స్తంభాలు, జీహెచ్ఎంసీ(GHMC) స్ట్రీట్ లైట్ల(Street lights) స్తంభాలంటూ తేడా లేకుండా ఒక్కో పోల్స్‌కు రకరకాల వైర్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి. గాలి దుమారానికి విద్యుత్ తీగలు(Electrical wires) తగిలినప్పుడు మెరుపులు వచ్చి అవి కేబుళ్ల(Cables) మీద పడి, మంటలు వచ్చిన ప్రమాదాలు కూడా చాలానే ఉన్నాయి. గతంలో వర్షం కురిసినపుడు నాంపల్లి బస్టాపు(Nampally Bus Stop)లో కరెంట్ తీగ తెగిపడి ఏకంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా జరిగింది. ఫ్లైఓవర్లపై తెగి పడిన కేబుల్,(Cables ఇంటర్నేట్ వైర్ల పైనుంచి ప్రయాణిస్తూ వాహనదారులు స్కిడ్ అయి పడిపోయి మృతి చెందిన ఘటనలూ లేకపోలేవు. గతంలో ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న కోర్టు.. వైర్లు, ఇతర తీగలు వేలాడకుండా, రోడ్లపై పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.