Vinayaka Chavithi 2025: హిందువులకు అతిముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఆ రోజున గణపయ్యను ఇంట్లో ప్రతిష్టించి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కుడుములు, ఉండ్రాళ్లు, పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఇతర పండుగల రోజుల్లో ఇంట్లోని పూజమందిరంలోనే దేవుళ్లకు పూజలు చేస్తుంటారు. కానీ వినాయక చవితి ఇందుకు భిన్నం. బొజ్జ గణపయ్యకు ఇంట్లోనే ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి మూడ్రోజుల పాటు నిత్యం పూజిస్తుంటారు. దీంతో మండపాన్ని ఏర్పాటు చేసే విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏ విధంగా ఏర్పాటు చేస్తే మండపం.. అద్భుతంగా, ట్రెడిషనల్ గా ఉంటుందో తెలియగా తికమక పడుతుంటారు. అటువంటి వారి కోసం ఈ ప్రత్యేక కథనాన్ని అందిస్తున్నాం. గణేష్ మండపం ఏర్పాటుకు ఉపయోగపడే ఐడియాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాంప్రదాయ మండపం
సాధారణంగా చాలామంది సాంప్రదాయ శైలిలో గణేశ చతుర్థి మండపాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ట్రెడిషనల్ గా మండపాన్ని తీర్చిదిద్దేందుకు ముందుగా పుష్పాలంకరణ చేయాల్సి ఉంటుంది. మండపం చుట్టూ మల్లె, గులాబీ, చామంతి, సన్నజాజి వంటి సుగంధ పుష్పాలతో అలంకరించండి. గణపతి విగ్రహం వెనుక పెద్ద పూల మాలలు లేదా రంగవల్లి ఆకారంలో డెకరేషన్ చేయవచ్చు. మండపం ఎంట్రన్స్‌లో రెండు వైపులా రంగురంగుల పూల హారాలతో అలంకరణ చేయండి. తర్వాత మండపం ఎంట్రన్స్, గణపతి విగ్రహం చుట్టూ మామిడి ఆకులు వేలాడదీయండి. వీటితో పాటు మండపం ఎంట్రన్స్‌లో గణేశుడి చిత్రాలు, శుభప్రదమైన చిహ్నాలు (స్వస్తిక, ఓం, పాదముద్రలు) లేదా పూల ఆకారంలో రంగోలి వేయండి. తర్వాత మట్టి దీపాలు లేదా ఆయిల్ లాంప్స్ మండపం చుట్టూ ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించండి.
ఆధునిక మండపం అలంకరణ
ఆధునిక శైలిలో మండపం డెకరేషన్ యువతను ఆకర్షించేలా ఉంటుంది. ట్రెండిగా గణేష్ మండపం కోరుకునే వారు.. LED లైట్లు, ఫెయిరీ లైట్లు, లేదా స్ట్రింగ్ లైట్లతో మండపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి. అలాగే గణపతి విగ్రహం వెనుక బంగారం, ఎరుపు, ఆకుపచ్చ రంగు బెలూన్‌లతో ఆర్చ్‌లు లేదా డిజైన్‌లు తయారు చేయవచ్చు. బెలూన్‌లలో గణేశుడి చిత్రాలు లేదా శుభాకాంక్షలు రాసిన స్టిక్కర్లు జోడించవచ్చు. గణపతి విగ్రహం వెనుక LED స్క్రీన్‌ను ఉంచి, గణేశుడి చిత్రాలు, శ్లోకాలు లేదా ఆధ్యాత్మిక యానిమేషన్‌లను ప్రదర్శించవచ్చు. లేజర్ లైట్లతో గణేశుడి చిత్రాలను మండపం గోడలపై ప్రొజెక్ట్ చేయవచ్చు.
పర్యావరణ హితమైన డెకరేషన్
పర్యావరణాన్ని కాపాడే ఆలోచనలు ఈ రోజుల్లో చాలా జనాదరణ పొందుతున్నాయి. కాబట్టి సహజసిద్ధంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయాలని భావించే వారు.. ప్రకృతి నుంచి లభించే కొన్ని వస్తువులను సేకరించాల్సి ఉంటుంది. కొబ్బరి ఆకులు, వెదురు, గడ్డి, మట్టి కుండలు వంటి సహజ వస్తువులతో మండపం అలంకరణ చేయవచ్చు. మట్టి గణేష్ విగ్రహం చుట్టూ మట్టి కుండలలో మొక్కలు ఉంచి పచ్చటి వాతావరణాన్ని సృష్టించవచ్చు. మండపం పైన పండ్లను వేలాడదీయడం ద్వారా మండపాన్ని మరింత అద్భుతమైన లుక్ ను తీసుకురావచ్చు.
బడ్జెట్ ఫ్రెండ్లీ డెకరేషన్ ఆలోచనలు
ఖర్చు తక్కువగా ఉండేలా మండపం అలంకరణ చేయాలనుకుంటే ఈ ఆలోచనలు ఉపయోగపడతాయి. ఇంట్లో ఉన్న రంగు కాగితాలు, రిబ్బన్‌లు, లేదా పాత సామగ్రితో హస్తకళలను తయారు చేయవచ్చు. గణేశుడి చిత్రాలు లేదా శ్లోకాలు రాసిన కాగితం కటౌట్‌లను మండపంలో వేలాడదీయవచ్చు. స్థానికంగా లభించే పుష్పాలను ఉపయోగించి ఖర్చును తగ్గించవచ్చు. ఉదాహరణకు చామంతి లేదా గన్నేరు పుష్పాలు సులభంగా లభిస్తాయి. ఆకర్షణీయంగా ఉంటాయి. వీటితో పాటు ఇంట్లో ఉన్న పాత దీపాలు లేదా స్ట్రింగ్ లైట్లను ఉపయోగించి మండపాన్ని అలంకరించవచ్చు. రంగు కాగితాలతో లాంతర్లు తయారు చేసి లైట్లను లోపల ఉంచవచ్చు.
గణేష్ విగ్రహం అలంకరణ
అయితే గణేష్ విగ్రహం అలంకారం విషయంలోనూ కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అటువంటి వారు ముందుగా గణపతి (పెద్ద విగ్రహం ప్రతిష్టిస్తే)కి రంగురంగుల పట్టు వస్త్రాలు, జరీ షాల్స్ లేదా బంగారు రంగు దుస్తులు ధరించండి. చిన్న చిన్న ఆభరణాలు, కిరీటం, ముత్యాల హారాలతో అలంకరణ చేయవచ్చు. విగ్రహం చుట్టూ పూల మాలలు వేస్తే గణపతి లుక్ బాగుంటుంది. అలాగే విగ్రహం ముందు లడ్డూలు, ఫలాలు, ఇతర నైవేద్యాలను అందంగా అమర్చండి. చిన్న చిన్న మట్టి కుండలలో ఈ నైవేద్యాలను ఉంచి అలంకరణలో భాగంగా చేయవచ్చు.
Also Read: Indus Waters Treaty: పాక్‌తో సింధు జలాల ఒప్పందం.. నెహ్రూపై ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు
ఇతర చిట్కాలు
మండపం అలంకరణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. దీపాలు, లైట్లు, లేదా విద్యుత్ సామగ్రి వాడేటప్పుడు సురక్షితంగా ఉండేలా చూసుకోండి. పిల్లలు, భక్తులు సురక్షితంగా ఉండేలా మండపంలో స్థలాన్ని ఖాళీగా ఉంచండి. మండపం అలంకరణకు కావాల్సిన సామగ్రిని ముందుగానే సేకరించండి. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయండి. మీ ప్రాంతంలోని స్థానిక సంప్రదాయాలను గౌరవిస్తూ, వాటిని మండపం డెకరేషన్‌లో చేర్చండి.
Also Read: Red Rainbow: అరుదైన అద్భుతం.. సింగిల్ కలర్ రెడ్ రెయిన్‌బో.. భలే గమ్మత్తుగా ఉందే!
గమనిక: ఇక్కడ అందిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా యధావిథిగా అందించిన కథనం ఇది. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే జ్యోతిష్యులు, పండితుల సలహాలు తీసుకోగలరు. ఇందుకు స్వేచ్ఛ ఎటువంటి బాధ్యత వహించదు.