Indus Waters Treaty: మంగళవారం జరిగిన ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం (NDA Parliamentary meeting)లో ప్రధాని మోదీ (Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) చేసిన ఇండస్ జలాల ఒప్పందం (Indus Waters Treaty) గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెహ్రు రెండు సార్లు దేశాన్ని విభజించారని ప్రధాని అన్నారు. ఒకసారి రాడ్ క్లిఫ్ లైన్ ద్వారా విభజిస్తే.. మరొకసారి ఇండస్ జలాల ఒప్పందం ద్వారా అని పేర్కొన్నారు. 80% సింధు నదీ జలాలను పాకిస్తాన్‌కు అప్పగించి దేశాన్ని నెహ్రూ విభజించారని ఆరోపించారు.
‘నెహ్రూ కూడా అంగీకరించారు’
నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన సింధు జలాల ఒప్పందం.. భారత రైతులకు వ్యతిరేకంగా మారిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాక్ తో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందం వల్ల భారత్ కు ఎలాంటి లాభం జరగలేదని అప్పట్లో నెహ్రూ తన సొంత కార్యదర్శి వద్ద అంగీకరించారని మోదీ పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీల రియాక్షన్..
సింధు జలాల ఒప్పందంపై బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ (Jagdambika Pal) మాట్లాడుతూ.. ‘ఇది దేశానికి జరిగిన మోసం. నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్య ప్రధానమంత్రి అయితే పార్లమెంట్ అనుమతి తీసుకోవాలి. కేబినెట్, పార్లమెంట్ నమ్మకం లేకుండానే పాకిస్తాన్‌కి వెళ్లి ఒప్పందంపై సంతకం చేసి వచ్చారు. ఇది రైతులను మోసం చేయడమే’ అని విమర్శించారు. మరో బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ (MP Ravi Shankar) స్పందిస్తూ.. ‘నెహ్రూ ఒప్పందంపై సంతకం చేయడం మాత్రమే కాకుండా పాకిస్తాన్‌కు రూ. 80 కోట్లు కూడా ఇచ్చారు. పార్లమెంట్‌లో చర్చ లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం తప్పు. ప్రధానమంత్రి మోదీ వాస్తవాలను దేశానికి తెలియజేశారు. మేము గర్వపడుతున్నాం’ అని అన్నారు.
హేగ్ కోర్టు తీర్పు తిరస్కరణ
మరోవైపు సింధు జలాల ఒప్పందం (IWT) విషయంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (PCA) ఆగస్టు 14న వెలువరించిన తీర్పును భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తీర్పునకు ఎటువంటి చట్టబద్ధత లేదని, దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పింది. హేగ్ కేంద్రంగా పనిచేస్తున్న మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఏర్పాటును, దాని చట్టబద్ధతను భారత్ ఎప్పుడూ గుర్తించలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. జలాల వినియోగంపై మా హక్కులను ఆ తీర్పులు ఏమాత్రం ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు.
సింధు జలాల ఒప్పందం నిలిపివేత
ఏప్రిల్‌లో పహల్గాం (Pahalgam Terror Attack)లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక భారతీయులు మరణించారు. దీంతో పాక్ పై ద్వైపాక్షిక చర్యలకు దిగిన భారత్.. సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ తన మద్దతును నిలిపివేస్తేనే ఈ ఒప్పందాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పింది.
Also Read: Red Rainbow: అరుదైన అద్భుతం.. సింగిల్ కలర్ రెడ్ రెయిన్‌బో.. భలే గమ్మత్తుగా ఉందే!
ఇండస్ జలాల ఒప్పందం
సింధు జలాల ఒప్పందం విషయానికి వస్తే భారత్ పాక్ మధ్య ఇది 1960లో కుదిరింది. ప్రపంచ బ్యాంక్ (World Bank) మధ్యవర్తిత్వంతో సుమారు 9 ఏళ్లపాటు సాగిన సుదీర్ఘ చర్చల అనంతరం భారత్ – పాక్ లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా పశ్చిమ ఉప నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలు పాకిస్తాన్ కు చెందుతాయి. తూర్పు నదులైన రావి, బియాస్, సట్లేజ్ భారత్ కు కేటాయించబడ్డాయి.