Sudershan Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న విపక్షాల ఇండియా కూటమి (INDIA Block) ఊహించని నిర్ణయం తీసుకుంది. కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డిని (Sudershan Reddy) ఎంపిక చేసింది. గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. గోవా మొదటి లోకాయుక్తగా సేవలు అందించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. 1971లో న్యాయవాది వృత్తిని మొదలుపెట్టారు. అనంతరం ఆయన ఏపీ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1995లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2007 జనవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 జులైలో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత గోవా తొలి లోకాయుక్తగా సేవలు అందించారు.
ఇండియా (INDIA) కూటమి తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. కూటమిలో భాగస్వామ్య పార్టీలతో పలు దఫాలు చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు అందరికీ ఆమోదయోగ్యమైన పేరుని ఎంపిక చేశారు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త మైల్‌స్వామి అన్నాదురై, మహాత్మా గాంధీ మునిమనవడు, రచయిత తుషార్ గాంధీ పేర్లను కూడా ఇండియా కూటమి నేతలు పరిశీలించినట్టుగా విశ్వసనీయ సమాచారం.
అభ్యర్థిత్వంపై సుదర్శన్ రెడ్డి స్పందన ఇదే..
ఉపరాష్ట్రపతిగా తన అభ్యర్థిత్వంపై సుదర్శన్ రెడ్డి స్పందించారు. దేశ జనాభాలో 60 శాతం పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు తనను నామినేట్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ‘‘ అభ్యర్థిత్వాన్ని సమర్పిస్తాను. పార్లమెంటు సభ్యులు అందరూ నా అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరతాను. ఎన్నికల ఫలితాన్నీ ఎవరూ ముందే చెప్పలేరు. నేను జ్యోతిషం జాతకాలు చెప్పే పనిచేయడం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉత్తర, దక్షిణ భారతానికి మధ్య జరుగుతున్న పోటీగా చూస్తున్నారా అని ప్రశ్నించగా, పోటీలో ఉన్న అభ్యర్థులం ఇద్దరం దక్షిణ భారతదేశానికి చెందినవారమేనని పేర్కొన్నారు. భారత్ అంతా ఒక్కటే, మనమంతా ముందుగా భారతీయులం అని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. ఎన్డీయే కూటమి ఇప్పటికే మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్ అభ్యర్థిగా ప్రకటించింది. దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి పదవి అనే విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో సభ్యుల సంఖ్య పరంగా చూస్తే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఆధిక్యం కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలను మినహాయిస్తే ప్రస్తుతం ఉభయ సభల సభ్యుల సంఖ్య 782గా ఉంది. ఉపరాష్ట్రపతి గెలుపునకు కనీసం 392 ఓట్లు అవసరం అవుతాయి.
Read Also- Google Fined: గూగుల్‌కు బిగ్ షాక్.. ఏకంగా రూ.300 కోట్ల జరిమానా.. ఎందుకంటే?
ఎన్డీయే అభ్యర్థి గెలుపు సులభమే
ఎన్‌డీఏ (NDA) చేతిలో ప్రస్తుతం 293 మంది లోక్‌సభ సభ్యులు, రాజ్యసభలో 133 సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులతో బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిగా గెలిపించుకోవడం సులభమే. అయితే, ఎన్డీయే కూటమి పార్టీలకు చెందిన సభ్యులు ప్రతిపక్షాల అభ్యర్థిగా ఓటు వేస్తే తప్ప ఫలితం మారే అవకాశమేమీ ఉండదు. ఇక, ఎన్డీయే కూటమి ఎంపీలు ఏమైనా ట్విస్ట్ ఇస్తారా?, లేక సజావుగానే సీపీ రాధాకృష్ణన్‌కు ఓటు వేస్తారా అనేది ఎన్నిక జరిగే సెప్టెంబర్ 9నే తేలనుంది.
పోటీ లేకుండా బీజేపీకి సునాయాస విజయాన్ని కట్టబెట్టకూడదనే ఉద్దేశంతో విపక్షాల ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడుతోంది. ఈ పోటీ ఏకపక్షంగా సాగినా, ప్రతిపక్షాల ఐక్యతను జనాలకు చాటిచెప్పడం మరో ఉద్దేశంగా ఉంది. ప్రత్యేకంగా ఎన్నికల వ్యవస్థపై వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేంద్రాన్ని ఒత్తిడికి గురిచేసే వ్యూహంలో భాగంగా అభ్యర్థిని నిలిపింది.
తెలుగు వ్యక్తి ఎంపిక అందుకే..
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తిని నియమించడం వెనుక మరో ముఖ్యోద్దేశం కూడా ఉంది. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేయడం ద్వారా డీఎంకేను ఒత్తిడిలో పెట్టాలని బీజేపీ వ్యూహం పన్నింది. ఆ వ్యూహానికి ప్రతిస్పందనగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి మాజీ జడ్జి ఎంపిక చేయడం ద్వారా ఏపీలోని అధికారి టీడీపీని ఇరకాటంలో పెట్టాలని విపక్షాలు భావించినట్టు తెలుస్తోంది. మిత్రపక్షం బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వాలా? లేక తెలుగు వ్యక్తికి మద్దతివ్వాలా? అని టీడీపీ పునరాలోచనలో పడేసే విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP), ఇతర తెలుగు ఎంపీలకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని లెక్కలు వేసుకున్నారు. మరి, తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఎటువైపు నిలబడతారనేది వేచిచూడాల్సిందే.