Election Commission: బీజేపీకి అనుకూలంగా ‘ఓట్ల దొంగతనం’ జరుగుతోందని, ఇందులో కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission) ప్రత్యక్ష ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) ఆదివారం ఘాటుగా స్పందించింది. ‘ఓట్ల దొంగతనం’ (vote chori) అంటూ రాహుల్ గాంధీ ‘అనుచితమైన పదాలు’ వాడారని, ఎన్నికల సంఘంపై ఇలా మాట్లాడడం రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఓటర్లను లక్ష్యంగా చేసుకునేందుకు ఎన్నికల సంఘాన్ని కూడా ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సంఘం ఓటర్ల పక్షాన నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో ఇవాళ (ఆగస్టు 17) మధ్యాహ్నం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు, ఎన్నికల కమిషనర్లు సుఖబీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
Read Also- Voter Adhikar Yatra: కొత్త యాత్ర మొదలుపెట్టిన రాహుల్ గాంధీ
మా దృష్టిలో అంతా సమానం
ఎన్నికల సంఘం దృష్టిలో ప్రతిపక్షం, పాలకపక్షం అనే తేడా ఉందని, ప్రతి పార్టీ ఒకటేనని జ్ఞానేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా రాజ్యాంగబద్ధమైన బాధ్యతల నుంచి ఎన్నికల సంఘం ఏమాత్రం వెనుకడుగు వేయబోదని ఆయన స్పష్టం చేశారు. బిహార్‌లో చేపట్టిన సర్‌ను (స్పెషల్ ఇన్సెన్సివ్ రివిజన్) రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకే నిర్వహించామని, ఓటర్ల డేటాబేస్‌లో సవరణలు చేసేందుకు ప్రారంభించామని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి నెల రోజుల గడువు ఉందని, రాజకీయ పార్టీలు ఎలాంటి లోపాలనైనా సూచించవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ద్వారాలు ప్రతిఒక్కరి కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. ఓటర్లు, రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి అధికారులు అందరూ సమర్థవంతంగా, పారదర్శకంగా పనిచేస్తున్నారని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవాలు పార్టీల నాయకత్వానికి చేరడం లేదో, లేక తప్పుదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా నిజాలను విస్మరిస్తున్నారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. బీహార్‌లో రాహుల్ గాంధీ ‘వోటర్ అధికార్ యాత్ర’ ప్రారంభించిన రోజు ఎలక్షన్ సంఘం ఈ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడం గమనార్హం.
Read Also- Congress: మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో వరుస రాజీనామాలు.. కారణాలు ఇవే
రాహుల్ గాంధీని అఫిడవిట్ అడిగింది అందుకే..
‘ఓట్ల చోరీ’ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఒక నియోజకవర్గంలో ఓటరుగా ఎవరైనా ఒక వ్యక్తి.. ఫిర్యాదు చేయాలంటే చట్టం ప్రకారం ఒకే మార్గం ఉందని, ఎలక్టోరేట్ రిజిస్ట్రేషన్ నియమావళిలోని రూల్ 20లో ఉన్న సబ్ రూల్(3), సబ్ రూల్(బీ) ప్రకారం, ఫిర్యాదు చేసే వ్యక్తి సాక్షిగా (witness) ఫిర్యాదు చేస్తారని వివరించారు. అలాంటి సందర్భంలో ఫిర్యాదు చేసిన వ్యక్తి ఓ అఫిడవిట్ రూపంలో ప్రమాణం చేయాల్సి ఉంటుందని, అది కూడా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ముందర, ఎవరిపై ఫిర్యాదు చేస్తున్నారో ఆ వ్యక్తి సమక్షంలో ఈ ప్రమాణం జరుగుతుందని జ్ఞానేశ్ కుమార్ వివరించారు. అందుకే, రాహుల్ గాంధీని అఫిడవిట్ అడిగామని చెప్పారు.
విదేశీయులు పోటీ చేయలేరు
ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వ్యక్తులకు తప్పనిసరిగా భారత పౌరసత్వం ఉండాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం, భారత పౌరులకు మాత్రమే ఎంపీ లేదా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుందన్నారు. విదేశీయులకు పోటీ చేసే హక్కు ఉండబోదని జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. విదేశీయులు ఎవరైనా ఓటర్ల నమోదుకు సంబంధించిన అప్లికేషన్ ఫారాలు నింపి ఉంటే, సర్ (SIR) ప్రక్రియలో వారి పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నిరూపించుకోకపోతే వెరిఫికేషన్ తర్వాత వారి పేర్లు తొలగింపునకు గురవుతాయని వివరించారు.
ఇక, పశ్చిమ బెంగాల్‌లో సర్ (SIR)నిర్వహణ తేదీపై త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై ముగ్గురు ఎన్నికల కమిషనర్లు సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటారని ప్రధాన్ ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ తెలిపారు.