Irfan Pathan: మన దేశంలో క్రికెట్‌ను ఒక మతంలా ఆరాధిస్తుంటారని కొత్తగా గుర్తుచేయాల్సిన పనిలేదు. వరల్డ్ కప్‌ల సమయంలో క్రికెట్ పిచ్చి పతాక స్థాయికి చేరుతుంది. భారత క్రికెట్ చరిత్రలో రెండు వన్డే వరల్డ్‌కప్‌లు అభిమానులకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. 1983, 2011 వన్డే వరల్డ్ కప్‌లలో భారత జట్టు విశ్వవిజేతగా నిలవడమే ఇందుకు కారణంగా ఉంది. మరో మూడు వరల్డ్ కప్‌లలో ఫైనల్స్‌కు చేరినప్పటికీ కప్ కల నెరవేరలేదు. ఇక వన్డే వరల్డ్ కప్‌లలో ఎప్పటికీ మరచిపోలేని చేదు జ్ఞాపకం ఏదంటే 2007 వన్డే ప్రపంచ కప్. భారత క్రికెట్ జట్టు చరిత్రలో ఈ వరల్డ్ కప్ ఒక చీకటి అధ్యాయంగా చెప్పవచ్చు. ఎందుకంటే, భారత్ జట్టు అత్యంత దారుణంగా గ్రూపు దశలోనే టోర్నమెంట్ నుంచి ఇంటిముఖం పట్టింది. శ్రీలంకతో పాటు నాడు పసికూనగా ఉన్న బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిపోయి నిష్ర్కమించింది. ఈ ఓటమిపై దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు భగ్గుమన్నారు. తీవ్ర ఆగ్రహానికి కూడా గురయ్యారు. క్రికెటర్ల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
అంతటి చేదు జ్ఞాపకం అయిన 2007 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టులో సభ్యుడిగా ఉన్న మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత రెండు రోజులపాటు హోటల్ గదుల్లోనే జీవచ్ఛవాల్లా గడిపామని, తామంతా చనిపోయినట్టుగానే అనిపించిందని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. నాడు అందరిలోనూ అటువంటి భావనే నెలకొందని వివరించాడు. అందరూ చాలా విచారంగా గడిపారని, ప్రతిఒక్కరూ షాక్‌లో ఉండిపోయారని తెలిపాడు. ఓ టాప్ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2007 వరల్డ్‌కప్ నుంచి ఘోర నిష్క్రమణతో జట్టు అనుభవించిన మానసిక ఒత్తిడిని, దాని తీవ్రతను తెలియజేశాడు. కాగా, నాటి జట్టులో క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ ఉన్నారు.
Read Also- Medigadda Barrage: కేసీఆర్‌ను గద్దెదింపడం కోసం ఈరెండు పార్టీలు కుట్ర?
ఘోర నిష్క్రమణ జరిగిందిలా?
వన్డే వరల్డ్‌కప్-2007 వెస్టిండీస్ వేదికగా జరిగింది. ఆ టోర్నీలో భారత జట్టు గ్రూప్-బీలో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్, బెర్ముడా మిగతా మూడు జట్లు. టీమ్‌లో దిగ్గజాలు ఉండడంతో భారత్ జట్టు సులువుగా నాకౌట్ దశకు క్వాలిఫై అవుతుందని అందరూ అంచనా వేశారు. కానీ, అనూహ్యంగా తొలి మ్యాచ్‌లోనే నాడు పసికూనగా ఉన్న బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో, ఈ షాకింగ్ ఓటమిపై అందరూ నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత మ్యాచ్‌లో బెర్ముడాపై తలపడిన భారత్ అతి భారీ విజయం సాధించింది. దీంతో, సూపర్-8 ఆశలు చిగురించాయి. శ్రీలంకపై గెలిస్తే తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించవచ్చని కలలు కన్నారు. కానీ, గ్రూప్‌లో చివరి మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత ప్లేయర్లు విఫలమయ్యారు. దీంతో, అప్రతిష్ట మూటగట్టుకుంటూ టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది.
Read Also- Shreyas Iyer: ఆసియా కప్‌కు భారత జట్టు ఎంపికలో ట్విస్ట్!.. స్టార్ బ్యాటర్ దూరం!!
ఈ దారుణ పరాజయం భారత క్రికెట్ చరిత్రలో చెడు జ్ఞాపకమే అయినప్పటికీ, జట్టు సరికొత్త రూపు దిద్దుకోవడానికి బాటలు వేసిందని చెప్పవచ్చు. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. టీమ్ పగ్గాలను ఎంఎస్ ధోనీకి అప్పగించారు. ధోనీ నాయకత్వంలో టీమిండియా అదే ఏడాది జరిగిన 2007-టీ20 వరల్డ్‌కప్, ఆ తర్వాత 2011 వన్డే వరల్డ్‌కప్‌లను ముద్దాడింది. ఆ తర్వాత పలు ఐసీసీ టైటిళ్లను కూడా భారత జట్టు గెలుచుకోగలిగింది. ఇదివుంచితే, ఇర్ఫాన్ పఠాన్ భారత జట్టు ఆడినన్ని రోజులు కీలక ఆటగాడిగా రాణించాడు. మొత్తం 120 వన్డేలు, 29 టెస్టులు, 24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.