Khazana Jewellers Robbery: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ చందానగర్ లోని ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ వినీత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. మెుత్తం ఏడుగురు వ్యక్తులు దోపిడీలో పాల్గొన్నట్లు డీసీపీ తెలిపారు. ఇందులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు స్పష్టం చేశారు. నిందితులంతా బిహార్ కు చెందిన వారని.. వారిపై 4,5 కేసులు నమోదయ్యాయని చెప్పారు.
20 రోజుల క్రితమే రెక్కీ..
ఏడుగురు నిందితుల్లోని ఒక వ్యక్తి ఏకంగా 10 కేసులు ఉన్నట్లు డీసీపీ వినీత్ కుమార్ తెలియజేశారు. ‘నిందితుల నుంచి 900 గ్రాముల వెండి అభరణాలు సీజ్ చేశాం. 10 కేజీల వెండి ఆభరణాలు ఖజానాలో దోపిడీ చేశారు. 20 రోజుల క్రితం నగరానికి వచ్చి రెక్కీ ప్రారంభించారు. ఆశిష్ కుమార్ సింగ్, దీపక్ కుమార్ సాహ.. లను పూణే లో అరెస్ట్ చేసాము. 24 గంటలలో నిందితులను గుర్తించాము. బీహార్ నుండి వారు వేపన్స్ కొనుగోలు చేశారు. A1 మోటార్స్ నుండి సెకండ్ హ్యాండ్ బైక్స్ తీసుకున్నారు. ఆశిష్, దీపక్ లు ఈ ముఠాకు వసతి.. రెక్కీకి సహకరించారు. వీరు దోపిడీ లో కూడా పాల్గొన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.
Also Read: CM Revanth Reddy: భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
జ్యువెలరీ షాపులకు సూచనలు
మరోవైపు హైదరాబాద్ నగరంలోని జ్యువెలరీ షాపు నిర్వాహకులకు డీసీపీ వినీత్ కుమార్ కీలక సూచనలు చేశారు. ప్రతీ ఒక్క షాపుకు తప్పకుండా తెఫ్ట్ అలారం పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సెక్యూరిటీని బలోపేతం చేసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం సీసీటీవీలను ఏర్పాటు చేసుకొని నిత్యం అవి వర్క్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. దొంగల ముఠా జ్యువెలరీ షాపులను టార్గెట్ చేస్తున్న క్రమంలో ఈ సూచనలు ప్రతీ షాపు నిర్వహకులు తప్పక పాటించాలని ఆదేశించారు.
Also Read: Centre on GST: దీపావళి బొనాంజా ఫిక్స్.. ఇక జీఎస్టీలో రెండే శ్లాబులు.. భారీగా తగ్గనున్న ధరలు!
దోపిడి ఎలా జరిగిందంటే?
హైదరాబాద్ చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాపులో ఆగస్టు 12న ఈ దోపిడి జరిగింది. ఉదయం 10:35 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డ్ షాపును తెరవగా.. ఆరుగురు వ్యక్తులు ముసుగు ధరించి తుపాకులతో లోపలికి ప్రవేశించారు. బంగారం దాచిన లాకర్ కీ ఇవ్వాలని డిప్యూటీ మేనేజర్ ను బెదిరించారు. అతడు అందుకు నిరాకరించడంతో కాలిపై కాల్పులు జరిపి.. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. మరోవైపు సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకోగా.. దుండగులు పరారయ్యారు. షాపులోని వెండి ఆభరణాలు దోచుకొని పారిపోయారు. దీంతో నగల దుకాణాన్ని పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాష్ మెహంతి.. దోపిడి ముఠాను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. అలా నిందితులను పట్టుకున్నారు.