GHMC – Hydraa: గ్రేటర్ హైదరాబాద్‌కు ఈ మధ్య వరుసగా రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు వస్తున్నాయి. అయితే, జీహెచ్ఎంసీ,(GHMC) హైడ్రా, జలమండలి, ట్రాఫిక్ పోలీసులు(Police) వర్షం సహాయక చర్యల్లో భాగంగా వాటర్ లాగింగ్, లోతట్టు ప్రాంతాలకు వరద నివారణ చర్యలతో పాటు ప్రాణ నష్ట నివారణ చర్యలు చేపట్టడంపై చూపుతున్న శ్రద్ధను ప్రజారోగ్య పరిరక్షణపై చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షం పడిందంటే చాలు హైదరాబాద్ మహానగరంలోని వీఐపీ, వీవీఐపీ ఏరియాల్లోనూ నేటికీ రోజుల తరబడి వర్షం నీరు నిలిచే ప్రాంతాలున్నాయి.
అదే ప్రాంతాల్లో రోడ్లపై, జంక్షన్లలో ఎక్కడబడితే అక్కడ చెత్తా చెదారం కూడా రోజుల తరబడి నిల్వ ఉంటుంది. ఫలితంగా వర్షం నీటిలో చెత్త నానడంతో దోమలు వృద్ధి చెంది, ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారుతున్నది. వర్షపు నీరు నిలిచే ప్రాంతాలతో పాటు నాలాలు, చెరువుల్లో దోమల వృద్ధి చెందకుండా రోజుకి రెండు సార్లు దోమల నివారణలో భాగంగా ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్ చేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారే తప్ప, అనారోగ్యం పాలవుతున్న ప్రజలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Mayasabha: ‘మయసభ’కు ఆది పినిశెట్టిని తీసుకోవడానికి కారణమిదేనట!
అనారోగ్యం పాలవుతున్నా పట్టింపు ఏది?
జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని 1500 మురికివాడల్లో డెంగ్యూ అనుమానిత లక్షణాలతో బాధపడుతూ ప్రైవేట్ క్లీనిక్ లను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నది. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి సాధారణ అనారోగ్య లక్షణాలతో హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతున్నది. ఇప్పటికే గతేడాది వర్షాకాలం నమోదైన డెంగ్యూ కేసుల కన్నా ఎక్కువ సంఖ్యలో అనుమానిత కేసులు నమోదైనట్లు సమాచారం. వర్షం సహాయక చర్యలను జీహెచ్ఎంసీ ఎంత పటిష్టంగా, పకడ్బందీగా నిర్వహిస్తుందన్న విషయాన్ని పక్కనబెడితే, గత నెల 29వ తేదీ నుంచి ఈ నెల 8వ తేదీ వరకు జీహెచ్ఎంసీ నిర్వహించిన శానిటేషన్ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్‌కు మాత్రమే వ్యాధి నివారణ చర్యలు పరిమితమయ్యాయన్న వాదనలున్నాయి.
వాస్తనానికి జీహెచ్ఎంసీ(GHMC) డ్రైవ్ ముగిసిన తర్వాత నగరంలో వర్షాలు దంచి కొట్టాయి. ఒక్కో రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకంగా 12 సెంటీ మీటర్లకు మించి వర్షపాతం నమోదు కావడంతో, ఒక రకంగా సకాలంలో చెత్త తరలింపు విధులకు కూడా బ్రేక్ పడినట్టయింది. ఈ క్రమంలో సిటీ సెంటర్‌లోని వీఐపీ ఏరియాల్లో చాలా చోట్ల చెత్త ఇంకా నీటిలోనే నానుతున్నట్లు, వాటిని తరలించే నాథుడే కరవయ్యాడని, చెత్తను తరలించాలని స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులకు చెబితే వారు పట్టించుకోవటం లేదని పలు చోట్ల స్థానికులు వాపోతున్నారు. మామూలు రోజుల్లోనే బల్క్ గ్యార్బేజీ తరలింపుపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్న స్వచ్ఛ టిప్పర్ ఆటో కార్మికులు వరుసగా రెండు రోజుల పాటు వర్షం కురిస్తే రోడ్లపై పడుతున్న చెత్తను ఏ మాత్రం తొలగించడం లేదన్న ఆరోపణలున్నాయి.
డ్రైవ్ ముగియగానే అంతా మామూలే
నగరంలో వర్షాలు విస్తారంగా కురవడం మొదలు కాగానే, అంటు వ్యాధులు ప్రబలకుండా కమిషనర్ కర్ణన్ ఎంతో ముందు చూపుతో శానిటేషన్ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని గత నెల 29వ తేదీ నుంచి
ఈ నెల 8వ తేదీ వరకు సుమారు సిటీలోని 150 వార్డులు కవరయ్యేలా నిర్వహించారు. ప్రతి రోజు కమిషనర్ ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించగా, సిబ్బంది దోమల నివారణ చర్యల్లో భాగంగా ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించినట్టే నిర్వహించి, ఈ నెల 8వ తేదీతో స్పెషల్ డ్రైవ్ ముగియడంతో అంతా షరా మామూలే అన్నట్టు మౌనం వహించినట్లు సమాచారం. సిటీలోని కేవలం రాజ్ భవన్, అసెంబ్లీ, సీఎం క్యాంప్ ఆఫీస్, సచివాలయం, బీఆర్కే భవన్, జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయం వంటి వీఐపీ పాయింట్లకే ఫాగింగ్ పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డెంగ్యూ కేసుల వివరాల గోప్యం?
జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో ప్రతి ఏటా నమోదయ్యే డెంగ్యూ కేసుల వివరాలను ఈ సంవత్సరం బయట పెట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా గత నెల 29 వ తేదీ నుంచి ఈ నెల 8వ తేదీ వరకు శానిటేషన్ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ లో దోమల నివారణకు చేపట్టిన చర్యలు ఎంత వరకు ఫలితాలిచ్చాయి? గతానికి ఇప్పటికీ డెంగీ కేసులేమైనా తగ్గాయా పెరిగాయా అనే వివరాలడిగితే ఎంటమాలజీ విభాగం సిబ్బంది మౌనం వహిస్తుండడం వెనకా ఆంతర్యమేంటనే ప్రశ్న తలెత్తుతున్నది. ఇటీవలే గ్రేటర్ హెల్త్ విభాగానికి జాయింట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ శంకర్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్‌లో చేపట్టిన దోమల నివారణ చర్యలపై నివేదిక అడిగినా, ఎంటమాలజీ విభాగం ఇవ్వకుండా గోప్యం పెట్టడం వెనకా కారణమేంటనేది తెలియడం లేదు.
Also Read: Thai Princess: రెండేళ్లుగా బెడ్ పైనే ప్రిన్సెస్.. రాజ భవనం నుంచి షాకింగ్ ప్రకటన