Alaska Summit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Russian counterpart Vladimir Putin) శుక్రవారం అలాస్కాలో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం చాలా ఫలప్రదంగా, పరస్పర గౌరవభావంతో జరిగిందని ఇరుదేశాధినేతలు ప్రకటించారు. అయితే ఉక్రెయిన్ యుద్ధం విషయంలో పరస్పర ఒప్పందానికి మాత్రం రాలేకపోయినట్లు ప్రకటించారు. దీంతో కొంతకాలంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ వచ్చిన అలాస్కా భేటి.. ఎలాంటి ఒప్పందం జరగకుండానే ముగిసినట్లైంది.
ట్రంప్ ఏమన్నారంటే?
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటి అనంతరం.. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘ఒప్పందం కుదిరే వరకు ఎలాంటి ఒప్పందం లేదు’ అని ఈ సందర్భంగా ట్రంప్ తేల్చి చెప్పారు. దీన్ని బట్టి ఇరువురి నేతల చర్చల్లో తుది పరిష్కారం రాలేదని అర్థమవుతోంది. అయినప్పటికీ ట్రంప్ మాట్లాడుతూ ‘ ఇది చాలా ఫలప్రదమైన సమావేశం. చాలా అంశాలలో ఏకాభిప్రాయం కుదిరింది. చాలా కొద్దిపాటి విషయాలు మాత్రమే మిగిలాయి. మేము అక్కడికి చేరుకోలేదు. కానీ చేరుకునే మంచి అవకాశం ఉంది’ అని అన్నారు. అయితే ఉక్రెయిన్ యుద్ధాన్ని (Ukraine War) ఆపాలన్న లక్ష్యంతో ట్రంప్ ఈ భేటి నిర్వహించగా.. అసలు దానిపై ఏకాభిప్రాయం రాకపోవడంతో అలాస్కా భేటి విఫలమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పుతిన్ వ్యాఖ్యలు..
మరోవైపు పుతిన్ సైతం భేటి అనంతరం మాట్లాడారు. ట్రంప్ తో చర్చలు నిర్మాణాత్మకంగా పరస్పర గౌరవభావంతో జరిగాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సమగ్ర అంశాలపై చర్చించామని, అది ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. ‘ఈ అవగాహన ఉక్రెయిన్‌లో శాంతికి మార్గం వేస్తుందని ఆశిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. అలాగే ఉక్రెయిన్ సహా యూరోపియన్ దేశాలు.. ఈ సమావేశాన్ని సానుకూలంగా స్వీకరిస్తాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ట్రంప్ తో కలిసి కుదుర్చుకునే ఒప్పందం ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో మాకు సహాయపడుతుందని, ఉక్రెయిన్‌లో శాంతికి మార్గం సుగమం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. యూరోపియన్ దేశాలు దానిని నిర్మాణాత్మకంగా గ్రహిస్తాయని, ఎలాంటి ఆటంకం కలిగించవని ఆశిస్తున్నా. పురోగతిని దెబ్బతీసేందుకు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయరని కోరుకుంటున్నా’ అని పుతిన్ తెలిపారు.
నాటోనే అసలు సమస్య..
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి దారి తీసిన అతి ముఖ్యమైన అంశం నాటో. ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆలోచనను విడిచిపెట్టాలని అలాగే తూర్పు ప్రాంతాలను రష్యాలో భాగంగా అంగీకరించాలని పట్టుబడుతూ యుద్ధానికి దిగింది. కానీ ఉక్రెయిన్.. రష్యా ఆలోచనను పదే పదే తిరస్కరిస్తూ వస్తోంది. రష్యా మళ్లీ దాడి చేయకుండా భద్రతా హామీలు ఉండాలని కీవ్ కోరుతోంది. ఈ నాటో అంశంపై ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.
చప్పట్లతో పుతిన్ కు స్వాగతం
యూఎస్, రష్యా అధ్యక్షుల శిఖరాగ్ర సమావేశం అలాస్కాలోని ఆంకరేజ్‌లో ఉన్న జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్-రిచార్డ్సన్ సైనిక స్థావరంలో జరిగింది. యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్‌పై నిఘా కోసం ఉపయోగించిన ఈ స్థావరంలో ఇరువురు అధ్యక్షులు తమ ప్రత్యేక విమానాల్లో చేరుకున్నారు. 2022లో ఉక్రెయిన్‌పై దాడి ఆదేశించిన తరువాత పుతిన్ మొదటిసారి పాశ్చాత్య భూభాగంలో అడుగుపెట్టగా ట్రంప్ చప్పట్లు కొడుతూ ఆయనకు స్వాగతం పలికారు.
Also Read: Shwetha Menon: ‘అమ్మ’ ప్రెసిడెంట్‌గా శ్వేతా మేనన్ విక్టరీ.. ప్రత్యర్థి ఎవరో తెలుసా?
తర్వాత భేటి మాస్కోలోనే
ట్రంప్ సమావేశం అనంతరం పుతిన్‌తో అనేక విషయాలపై ఏకాభిప్రాయం కుదిరిందని అన్నారు. కానీ ఉక్రెయిన్ యుద్ధంపై ఈ స్నేహపూర్వక చర్చ ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించలేదు. ఉక్రెయిన్ యుద్ధం నిలిపివేయడానికి అమెరికా సహకారం చాల ముఖ్యమని పుతిన్ అభిప్రాయపడ్డారు. వేదిక వదిలి వెళ్లేటప్పుడు రెండో సమావేశం గురించి ట్రంప్ ప్రస్తావించగా.. పుతిన్ చిరునవ్వుతో ‘ఈసారి మాస్కోలో’ (Next time in Moscow) అని బదులిచ్చాడు.