J-K Cloudburst: ఇటీవల ఉత్తరఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ సృష్టించిన విలయాన్ని మరచిపోకముందే మరోచోట తీవ్ర విషాదం నెలకొంది. జమ్మూ కశ్మీర్‌లోని చోసిటి ప్రాంతంలో ఇవాళ (ఆగస్టు 14) మధ్యాహ్న సమయంలో తీవ్ర మేఘ విస్పోటనం (J-K Cloudburst) సంభవించింది. దీంతో, అకస్మాత్తుగా వరదలు వెలువెత్తాయి. ఈ ఘటనలో భారీ ప్రాణ నష్టం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కిష్ట్వార్‌లోని హిమాలయాల్లో కొలువై ఉన్న మాచైల్ మాతా ఆలయానికి వెళ్లే మార్గంలో చోసిటి ప్రాంతం ప్రారంభంలోనే ఉంటుంది. అందుకే, క్లౌడ్ బరస్ట్ ప్రభావంతో యాత్రికులు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయారు. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. వరదల్లో కనీసం 10 మంది చనిపోయినట్టుగా ఓ అధికారి మీడియాకు వెల్లడించారు.
Read Also- DMart Independence Sale: డీమార్ట్ పంద్రాగస్టు ఆఫర్.. సగం ధరకే వస్తువులు.. అస్సలు మిస్ కావొద్దు!
క్లౌడ్ బరస్ట్ విలయంపై కిష్ట్వార్ డిప్యూటీ కమీషనర్ పంకజ్ శర్మ మాట్లాడుతూ, రక్షణ చర్యలు ప్రారంభించామని తెలిపారు. చోసిటి ప్రాంతంలో మేఘవిస్పోటనం కారణంగా అకస్మాత్తుగా వరద వచ్చిపడిందని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తనతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని అధికారి పంకజ్ శర్మ తెలిపారు. కాగా, స్థానికంగా నెలకొన్న పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ శర్మ ఈ విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశారు.
చోసిటి ప్రాంతంలో భారీ మేఘవిస్పోటనం జరిగిందని, పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టానికి దారి తీసే అవకాశముందని అధికారి పంకజ్ శర్మ తెలిపారు. పాలనా యంత్రాంగం వెంటనే స్పందించిందని, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లాయని వివరించారు. నష్టం అంచనాకు సంబంధించిన పనులు మొదలయ్యాయన్నారు. అవసరమైన రక్షణ, వైద్య సేవలకు ఏర్పాట్లు చేపట్టామని, తన ఆఫీస్‌కు ఈ మేరకు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వస్తున్నాయని పంకజ్ శర్మ వివరించారు. అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తున్నామని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు.
ఇక, రెస్క్యూ చర్యలను మరింత ముమ్మరం చేయాలని పోలీసులు, సైన్యం, విపత్తు స్పందన బృందాలను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కోరారు. చోసిటి ప్రాంతంలో జరిగిన మేఘవిస్పోటనం వార్త తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. ఈ విషాదంలో ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. పౌరులు, పోలీసు, సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారులకు రెస్క్యూ, సహాయ చర్యలను మరింత ముమ్మరం చేయాలంటూ ఆదేశించానని పేర్కొన్నారు. ప్రభావిత బాధిత వ్యక్తులకు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని ఆదేశించానని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పేర్కొన్నారు.